జగన్ విజయానికి మాటీవీ సాయం

జగన్ విజయానికి మాటీవీ సాయం

నందమూరి తారక రామారావు జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టాల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ తీసిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా గత వారం తెలంగాణ వరకే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఏపీలో విడుదల కానివ్వదంటూ వేసిన పిటిషన్‌ను సమర్థిస్తూ అక్కడి కోర్టులు దీనికి అడ్డుకట్ట వేశాయి. ఎలాగైనా ఈ చిత్రాన్ని ఎన్నికల్లోపే విడుదల చేయాలని వర్మ అండ్ కో గట్టిగానే ప్రయత్నించింది. కానీ అందుకు అవకాశమే లేదని తేలిపోయింది.

ఈ వారాంతంలో సినిమా రాదని తేలిపోయింది. కాబట్టి ఎన్నికలయ్యాకే సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ వాళ్లు ఉన్నారన్నది స్పష్టం. ఈ చిత్రాన్ని ఏపీలో కూడా రిలీజ్ చేస్తే చంద్రబాబుపై జనాల్లో నెగెటివిటీ పెరిగి అది వైకాపాకు కలిసొస్తుందని ఆశించారు. కానీ అది జరగలేదు.

ఐతే ఎన్టీఆర్ మీద ఆశలు వదులుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ వాళ్లు.. చంద్రబాబుపై వ్యతిరేకత పెంచడానికి మరో మార్గం ఎంచుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంపై తీసిన 'యాత్ర' చిత్రాన్ని ఎన్నికల అస్త్రంగా ప్రయోగిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఆదివారం నాడు టీవీలో ప్రిమియర్ షోగా వేస్తున్నారు. మాటీవీలో ఈ చిత్రం ప్రసారం కానుంది. నిర్మాతలతో మాట్లాడి ఈ సినిమాను తక్కువ రేటుకే మా టీవీ వాళ్లకు ఇచ్చి ఎన్నికల్లోపే సినిమా ప్రసారం అయ్యేలా వైకాపా వాళ్లు చూస్తున్నట్లు సమాచారం.

మామూలుగా కొత్త సినిమాలు సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేస్తుంటారు. కానీ ఈ చిత్రాన్ని మధ్యాహ్నం 12 గంటలకు టీవీలో వేస్తున్నారు. రెగ్యులర్ సినిమా వ్యూయర్స్‌‌తో పాటు అందరూ సినిమా చూడాలని.. ఆదివారం మధ్యాహ్నం అందరూ ఇంటి పట్టున ఉంటారు కాబట్టి సినిమా చూస్తారని ఆలోచించి ఇలా చేసినట్లు తెలుస్తోంది. దీని గురించి గట్టిగా ప్రచారం కూడా చేయనున్నారట. 'యాత్ర'లో వైఎస్‌ను దేవుడిలా చూపించడమే కాక.. చంద్రబాబును విలన్ లాగా ప్రొజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాబట్టి ఈ సినిమా ఎన్నికల ప్రచారాస్త్రంగా ఉపయోగపడుతుందని వైకాపావాళ్లు భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English