సోనియాపై ప్ర‌శంస‌..రాహుల్‌పై విమ‌ర్శ‌లు...కేసీఆర్ లెక్కంటో

సోనియాపై ప్ర‌శంస‌..రాహుల్‌పై విమ‌ర్శ‌లు...కేసీఆర్ లెక్కంటో

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మ‌రోమారు జాతీయ రాజ‌కీయాల గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీఎం కేసీఆర్ త‌న‌దైన శైలిలో స్పందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ పేరు త‌ల‌వ‌డ‌మే త‌ప్పు అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న కేసీఆర్ తాజాగా ఆమెపై ప్ర‌శంస‌లు కురిపించారు. సోనియాగాంధీకి, రాహుల్ గాంధీకి ఉన్న తేడాను విశ్లేషించారు.

దేశాన్ని కాంగ్రెస్, బీజేపీ నాశనం పట్టించాయని ఈ ఇంట‌ర్వ్యూలో కేసీఆర్ ఆరోపించారు. ``మేం దేశానికి ఓ ఎజెండాను నిర్దేశిస్తున్నాం. దేశానికి ఆర్థిక, పరిపాలనా పరమైన సంస్కరణలు ప్రతిపాదిస్తున్నాం. మా దేశం ప్రపంచంలో గొప్పగా ఉండాలి. మేం గర్వంగా చెప్పుకునే పరిపాలన సాగాలని కోరుకుంటున్నాం.`` అని కేసీఆర్ అన్నారు. ``నాకు ప్రధాని కావాలని కోరిక లేదు. అలాగే ఎవరో ప్రధాని కావాలని మేం పనిచేయడం లేదు. మేం జాతీయ పార్టీలను సమర్థించం. జాతీయ పార్టీలే తప్పనిసరై ప్రాంతీయ పార్టీలకు మద్దతిచ్చే పరిస్థితి సృష్టించడమే మా లక్ష్యం.`` అని తెలిపారు. ``ప్రాంతీయంగా బలంగా ఉన్న పార్టీలతో మా భేటీలో ఒక్కటే చెప్పాం, మీరు సొంతంగా ఎన్నికలకు వెళ్లండి. మనం గెలిచి నిర్దేశించే స్థితిలో ఉంటే, మేమే మద్దతిస్తామని జాతీయపార్టీలే మన వద్దకు వస్తాయని వివరించాను.`` అంటూ  త‌న ఫ్రంట్ గురించి వివ‌రించారు. రాహుల్ గాంధీ కంటే సోనియా గాంధీ చాలా పరిపక్వతతో ఆలోచిస్తారని ఈ సంద‌ర్భంగా కేసీఆర్ విశ్లేషించారు. రాహుల్ గాంధీ ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్నారని ఆయ‌న అన్నారు.

రాజకీయంగా, పరిపాలనా పరంగా మోడీ అట్టర్ ఫ్లాప్ అయ్యారని కేసీఆర్ విమ‌ర్శించారు. ``మొదటి కాంగ్రెసేతర పరిపూర్ణ ప్రభుత్వంగా మోడీకి దేశప్రజలు సువర్ణ అవకాశం ఇచ్చారు. కానీ, దేశప్రజలు ఆయనపై పెట్టుకున్న విశ్వాసాన్ని ఆయన వమ్ము చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన కుట్ర బుద్ది మార్చుకోలేదు. ఇతర నేతలకంటే తనను ఎక్కువగా ఊహించుకోవడం బొక్కబోర్లాపడం ఆయనకు అలవాటు. మ‌మతా బెనర్జీ బయటికి కరకుగా కనిపిస్తారు కానీ, చాలా సునిశితంగా, బాధ్యతగా వ్యవహరిస్తారు. నితీష్ కుమార్ కు ఆ రాష్ట్ర ప్రజలు పూర్తిగా అండగా ఉన్నారు. ఫెడరల్ ఫ్రంట్ గా మేము నిర్దేశిస్తున్న ఎజెండా, ఈ దేశానికి ఇప్పుడు అత్యంత ఆవశ్యకమైన అంశం`` అంటూ కేసీఆర్ విశ్లేషించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English