కోదండ‌రాం జాడేది...ఆట‌లో అరటి పండేనా

కోదండ‌రాం జాడేది...ఆట‌లో అరటి పండేనా

ప్రొఫెస‌ర్ కోదండ‌రాం. ఒక‌నాడు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు స‌మ ఉజ్జీగా విశ్లేష‌కుల‌చే పేర్కొన‌బ‌డిన రాజ‌కీయ వేత్త‌. అయితే, ఇప్పుడు ఆయ‌న అడ్ర‌స్ ఎక్క‌డ‌? ఆయ‌న స్థాపించిన తెలంగాణ జ‌న‌స‌మితి జాడేది? ఇది ప్ర‌స్తుతం రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఆరు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో మహాకూటమితో కలిసి పోటీ చేసిన ఆ పార్టీ ఆ ఎన్నిక‌ల్లో ఘోర పరాజయం చవిచూడటంతో అడ్ర‌స్ గ‌ల్లంతు అయిపోయినంత ప‌న‌యింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల‌తో కిక్కిరిసి పోయిన టీజేఎస్ కార్యాల‌యం,  ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కకపోవడంతో ఇప్పుడు అటువైపు చూసే వారి కోసం నిరీక్షిస్తోంది.

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కోదండ‌రాం పార్టీ ఆట‌లో అర‌టిపండు అయిందంటున్నారు. కరీంనగర్‌, నిజామాబాద్‌, మల్కాజిగిరి స్థానాల్లో తమ అభ్యర్థులు బరిలో ఉంటారని కోదండరామ్‌ తొలుత ప్రకటించారు. పదిరోజులు గడిచాయో లేదో ఆయా స్థానాల్లో పోటీ చేయడంలేదని హైదరాబాద్‌, ఖమ్మం, మహబూబాబాద్‌ నియోజకవర్గాల్లో అభ్యర్థులు బరిలో ఉంటారని స్పష్టం చేశారు. వీటిలో హైదరాబాద్‌ స్థానంపై ఆ పార్టీ కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. మజ్లిస్‌కు కంచుకోటగా ఉన్న అక్కడ టీజేఎస్‌ ఎలా నెగ్గుకొస్తుందని శ్రేణులు బహిరంగంగానే విమర్శించాయి. కాస్తంత ప్రభావం చూపే నియోజక వర్గాలను వదిలి హైదరాబాద్‌ స్థానాన్ని ప్రస్తావించడంపై అసంతృప్తి వెళ్లగక్కాయి. హైదరాబాద్‌ స్థానం నామినేషన్‌ తిరస్కరణకు గురవ‌డం గ‌మ‌నార్హం.

మ‌రోవైపు ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల విష‌యంలో కోదండ‌రా నిర్ణ‌యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. టీజేఎస్‌ పార్టీకి గణనీయమైన ఓటు బ్యాంకు ఉందని భావించే నల్లగొండ, వరంగల్‌ జిల్లాలను కాదని అంతగా క్యాడర్ లేని స్థానాలను ఎంపిక చేసుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఖమ్మం, మహబూబాబాద్‌లో ఓడితే పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ని కోదండ‌రాం క‌నీసం లోక్‌ సభ ఎన్నికల్లో  బరిలో నిలవకపోవడం ఏమిటని ప్రశ్నిస్తు న్నారు. భవిష్యత్తులో పోటీ చేస్తారా లేదా? అనేదానిపై కూడా స్పష్టత లేదు. ఏదిఏమైనా టీజేఎస్‌ పరిస్థితిపై ఆ పార్టీ నేత‌లే ఆశ‌లు వ‌దిలేసుకున్నార‌ని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English