అబ్బా… పవన్ ఏం ట్వీటావయ్యా..!

జగన్ సర్కార్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిద్రలేచింది మొదలుకుని పడుకునే విమర్శించడమే పనిగా పెట్టుకుని అటు బహిరంగ సభల్లో.. ఇటు సోషల్ మీడియా వేదికగా హడావుడి చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఎంత చేసినా సరే.. అదేదో సినిమా డైలాగ్‌ లో లాగే మాకు కనపడవ్.. వినపడవ్ సార్ అన్నట్లుగా విమర్శనాస్త్రాలు సంధిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌ గా ఉన్న ‘ఎయిడెడ్ స్కూల్’ వ్యవహారంపై పవన్ స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా సెటైర్లేస్తూ మరీ రాసుకొచ్చారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థలను మూసేయాలని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ఆయన.. అవి మూతబడితే లక్షలాది మంది పేద విద్యార్థులు విద్యకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యార్ధులు, సిబ్బందితోపాటు వారి కుటుంబాలను ప్రభుత్వం నిర్ణయం అతలాకుతలం చేసిందని ఆక్షేపించారు. నిజంగా ఎయిడెడ్ పాఠశాలలను, టీచర్లను ఆదుకోవాలన్న ఉద్దేశ్యం ఉంటే వాటిని స్వాధీనపరుచుకోవడం ఒక్కటే మార్గమా? అసలు ఇంతకంటే మంచి నిర్ణయం, సరైన చర్యలు తీసుకొనే ఆలోచనలే కరవయ్యాయా..? లేదా ప్రభుత్వానికి మరే ఇతర దురుద్దేశాలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. అప్పుడు ‘అమ్మ ఒడి’… ఇప్పుడు ‘అమ్మకానికో బడి’ అంటూ పవన్ ప్రాస ఉపయోగించి మరీ సెటైరికల్‌గా వరుస ట్వీట్లు చేశారు.

పవన్ ఏపీ ప్రభుత్వంపై సంధించిన ప్రశ్నలివే!

  1. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వానికి అప్పగించేందుకు నాలుగు అవకాశాలను ఇస్తూ వైసీపీ ప్రభుత్వం ఈ ఏడాది నవంబర్ 12న ఓ సర్కులర్ జారీచేసింది.
  2. ఈ విధాన నిర్ణయం 2,200 ప్రయివేటు స్కూళ్లను, 2 లక్షల మంది విద్యార్ధులను.. అలాగే 6,700 మంది ఉపాధ్యాయులను, 182 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలను, దాదాపు 71 వేలమంది విద్యార్థులను, 116 ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలను, దాదాపు రెండున్నర లక్షలమంది విద్యార్థులను ఇబ్బందులపాలు చేసింది. విద్యార్ధులు, సిబ్బందితోపాటు వారి కుటుంబాలను సైతం అతలాకుతలం చేసింది.
  3. ఇందులో విద్యాసంస్థలు, విద్యార్థులే ప్రధాన భూమిక పోషిస్తున్నారన్న అంశాన్ని వైసీపీ ప్రభుత్వం మరిచింది. విద్యార్ధుల భవిషత్తును పూర్తిగా గాలికి వదిలేశారు. ఈ నిర్ణయంతో విద్యార్థులే బలిపశువులుగా మారారు. విద్యార్థుల విషయంలో వారి భవిషత్తును నాశనం చేస్తూ ఎందుకు వైసీపీ ప్రభుత్వం అంత దారుణంగా వ్యవహరించింది?
  4. వీటిలో ఎన్ని ఎయిడెడ్ పాఠశాలల్లో స్కూల్ మేనేజిమెంట్ కమిటీలు పనిచేస్తున్నాయి? ఈ అంశాలపై ఎస్ఎమ్సీలు తమ తమ సమావేశాల్లో చర్చించాయా? అసలు ఈ పాఠశాలల్లో ఎస్ఎమ్సీలు లేని పక్షంలో ఈ నిర్ణయానికి విలువ ఉందా? ఇది ఆర్టీఈ సూత్రాలను ఉల్లంఘించినట్టు కాదా?
  5. ఎయిడెడ్ సంస్థలను ప్రభుత్వంతో కలుపుకొనేందుకు లేదా స్వాధీనపర్చుకోవడానికి వైసీపీ ప్రభుత్వం ఎందుకు తొందరపడుతోంది? విద్యార్థులు విద్యా సంవత్సరం మధ్యలో ఉండగా సమయంకాని సమయంలో ప్రభుత్వం ఈ తెలివితక్కువ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎమొచ్చింది? వైసీపీ ప్రభుత్వం తన తప్పుడు నిర్ణయాలతో విద్యార్థులను సమస్యల్లోకి నెట్టివేస్తోంది.
  6. నిజంగా ఎయిడెడ్ పాఠశాలలను, టీచర్లను ఆదుకోవాలన్న ఉద్దేశ్యం ఉంటే వాటిని స్వాధీనపరుచుకోవడం ఒక్కటే మార్గమా? అసలు ఇంతకంటే మంచి నిర్ణయం, సరైన చర్యలు తీసుకొనే ఆలోచనలే కరవయ్యాయా? లేదా ప్రభుత్వానికి మరే ఇతర దురుద్దేశాలు ఏమైనా ఉన్నాయా? ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
  7. మూసివేసిన పాఠశాలల్లో చదివే విద్యార్థులను దగ్గరలోని పాఠశాలలకు సంవత్సరం మధ్యలోనే తరలిస్తారా? ఇది వారి విద్యాసంవత్సరానికి అంతరాయం కలిగించదా? వారి చదువుకు అంతరాయం కాదా?
  8. డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుంది? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థలలో ఖాళీగా ఉన్న టీచర్ల పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారు? పాఠశాలలను, కళాశాలలను స్వాధీన పరుచుకోవాలన్న నిర్ణయం తీసుకొనేముందు టీచర్లను, లెక్చరర్లను నియమించాలన్న ఆలోచన మీకు రాలేదా? అంటూ వరుస ట్వీట్లతో హడావుడి చేశారు. ఈ ట్వీట్లపై అటు వైసీపీ అభిమానులు కౌంటర్ ఎటాక్ చేస్తుండగా.. జనసైనికులు మాత్రం ఆహా.. ఓహో అంటూ రిప్లయ్‌లు ఇస్తూ పెద్ద ఎత్తున రీట్వీట్‌లు చేస్తున్నారు. మరి ఈ ట్వీట్లపై మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని లాంటి వారు ఎలా రియాక్టవుతారా అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.