కాంగ్రెస్ రెబల్ కేండిడేట్‌ కోసం చిరంజీవి ప్రచారం

కాంగ్రెస్ రెబల్ కేండిడేట్‌ కోసం చిరంజీవి ప్రచారం

కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్ర మంత్రిగా పనిచేసి విభజన తరువాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి టెక్నికల్‌గా ఇంకా ఆ పార్టీలోనే ఉన్నారు. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో రెబల్‌గా పోటీ చేసేందుకు సిద్ధమైన అభ్యర్థి తరఫున ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఆయన ఆ అభ్యర్థికి మాటిచ్చినట్లు కూడా తెలుస్తోంది.

కర్నాటకలో కొద్దిరోజుల కిందట మరణించిన దిగ్గజ నటుడు అంబరీష్ తన మరణం నాటికి మాండ్యా స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు. ఆయన మరణం తరువాత భార్య సుమలత ఆ టికెట్ ఆశించారు. కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆమెకు టికెట్ నిరాకరించింది. కర్నాటకలో జేడీఎస్‌తో కాంగ్రెస్ పార్టీకి పొత్తు ఉండడంతో జేడీఎస్‌ను కాదని కాంగ్రెస్ సుమలతకు టికెట్ ఇవ్వలేదు. మాండ్యాలో జేడీఎస్ నేత, కర్నాటక సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ పోటీ చేస్తుండడంతో కాంగ్రెస్ అక్కడ సుమలతకు టికెట్ ఇవ్వలేదు. దీంతో సుమలత ఇండిపెండెంట్‌గా బరిలో దిగారు.

ఈ నేపథ్యంలో ఆమెకు సినీ పరిశ్రమ నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. అంబరీష్ కన్నడ నాట దిగ్గజ నటుడు కావడంతో పాటు సుమలత కూడా కన్నడ, తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు. ఈ కారణంతో ఆమెతో హీరోలుగా నటించిన తమిళ, తెలుగు దిగ్గజాలు ఆమె తరఫున ప్రచారానికి రెడీ అవుతున్నారు. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి కూడా ఆమె కోసం ప్రచారం చేస్తానని మాటిచ్చారట.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా సుమలత తరఫున ప్రచారానికి ముందుకొచ్చారు. తెలుగులో మరో సీనియర్ హీరో మోహన్ బాబు కూడా సుమలత తరఫున ప్రచారానికి కర్నాటక వెళ్తానంటున్నారు. అలాగే కన్నడ సినీ పరిశ్రమలో ఇటీవల కేజీఎఫ్ సినిమాతో దుమ్ము రేపిన యూత్ హీరో యశ్ కూడా ఇప్పటికే ఆమె తరఫున ప్రచారం చేస్తానని ప్రకటించారు. మరోవైపు బీజేపీ కూడా వ్యూహాత్మకంగా ఆమెకు మద్దతు పలికింది.

అయితే.. ఇప్పటికే పార్టీకి దూరంగా ఉంటున్నా చిరంజీవిని భరిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆయన రెబల్ అభ్యర్థికి మద్దతు పలికితే ఏం చేస్తుందో చూడాలి. ఆయనపై వేటు వేస్తుందా..? అసలు కాంగ్రెస్ పార్టీ తనపై వేటు వేయాలనే చిరంజీవి ఈ నిర్ణయం తీసుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది. అదే జరిగితే ఆయన కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా దూరమై కొత్త రూటు వెతుక్కుంటారో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English