పవన్‌ స్టేట్‌మెంట్‌తో వేడెక్కిన రణం

పవన్‌ స్టేట్‌మెంట్‌తో వేడెక్కిన రణం

భీమవరంలో జనసేన ఓడిపోతే అది అవమానం అంటూ పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించడం సంచలనమైంది. ఒక్కసారిగా పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. పవన్‌ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తూ వుండడంతో 'ఇది కాకపోతే ఇంకొకటి' అంటూ ఫాన్స్‌ కాస్త తేలిగ్గానే వ్యవహరిస్తున్నారు. కానీ భీమవరం విజయం తనకి ఎంత ప్రతిష్టాత్మకమనేది పవన్‌కళ్యాణ్‌ డైరెక్ట్‌గా చెప్పేయడంతో జనసేనాని విజయం కోసం జనసైనికులు అహర్నిశలు కృషి చేయాల్సి వుంటుంది. గతంలో పాలకొల్లు నుంచి చిరంజీవి ఓడిపోవడం అభిమానులని దారుణంగా బాధించింది. దాని గురించి పవన్‌ ఎప్పుడూ ప్రస్తావించకపోయినా కానీ సొంత జిల్లాలో ఓటమి అవమానకరమని ఇప్పుడు చెప్పడంతో అప్పుడు అది తనని ఎంతగా హర్ట్‌ చేసిందనేది స్పష్టమయింది.

భీమవరం విజయాన్ని పవన్‌ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనేది నిన్న ఆయన ఉపన్యాసంలోనే తెలిసింది. ఎన్నడూ లేనిది ఆంధ్ర ఫీలింగ్‌ రగిలించడం కోసం తెలంగాణలో ఆంధ్రులని కొడుతున్నారనే వివాదాస్పద వ్యాఖ్యలు కూడా పవన్‌ ఎలాగైనా విజయం సాధించాలనే కసిలోనే చేసాడనేది సుస్పష్టం. జనసేనానికి ఇక్కడ విజయం ఎంత అవసరమనేది అతని మాటల్లోనే స్పష్టం కావడంతో ఇప్పుడు ఇతరులు కూడా అతడి మానసిక స్థయిర్యాన్ని దెబ్బ తీయడానికి ఇక్కడ ఎలాగైనా ఓడించాలని పథక రచన చేసే అవకాశం లేకపోలేదు. భీమవరం టఫ్‌ ఫైట్‌ వుంటుందనే సంకేతాలు అందడంతోనే పవన్‌ ఇక్కడ తన సహజ శైలికి భిన్నంగా మాట్లాడాడని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English