ఏపీ ఎన్నిక‌ల‌కు కేసీఆర్‌ డ‌బ్బులు

ఏపీ ఎన్నిక‌ల‌కు కేసీఆర్‌ డ‌బ్బులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రుగుతున్న ఎన్నిక‌లపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌త కొన్ని రోజులుగా తెలంగాణ సీఎం కేసీఆర్ పాత్ర‌పై ఘాటుగా స్పందిస్తున్న చంద్ర‌బాబు తాజాగా తెలంగాణ సీఎం పాత్రపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీని కూడా పరోక్షంగా పరిపాలించాలని కేసీఆర్‌ చూస్తున్నారని, పోటీ చేయొద్దని అభ్యర్థులను ఆయన బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణా ప్రభుత్వం వేల కోట్లు పంపి ఓట్లను కొనేందుకు చూస్తోంద‌ని చంద్రబాబు ఆరోపించారు.

విజయవాడలో జ‌రిగిన‌ ఏపీ పెన్షనర్ల సంఘం వార్షికోత్సవ సభలో సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు.  ``కేసీఆర్‌, మోడీ.. జగన్‌తో కలిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. తెలంగాణలో ఎన్జీవోలు ఇళ్లు కట్టుకుంటుంటే అడ్డుపడ్డారు. చట్ట వ్యతిరేకంగా అందరిపై దాడులు చేస్తున్నారు. మనం ఎక్కువ పార్లమెంటు సీట్లను సాధిస్తే టీఆర్ఎస్, మోడీ,జగన్ కు చెంపపట్టు`` అని వివ‌రించారు. కేసీఆర్‌ బెదిరించి మన ఆస్తులు తీసుకున్నారని, ఏపీ బాగుపడితే తెలంగాణ కిందకి వెళ్తుందని ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్య పూరిత రాజకీయాలను నేను ఎక్కడా చూడలేదని అన్నారు. రాష్ట్రాన్ని అథోగతి పాలు చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో దౌర్జన్యాలు చేస్తున్నారని, తెలంగాణలో ఒకే పార్టీ ఉండాలని చూస్తున్నారని మండిపడ్డారు. అన్ని రకాల ఆర్థిక మూలాలపై తెలంగాణ ప్రభుత్వం దాడి చేసి లొంగదీసుకుంటుందని ఆరోపించారు. సేవామిత్ర డేటా దొంగిలించి వైసీపీకి ఇచ్చారని ఆరోపించారు.

తెలంగాణ కంటే మెరుగైన జీతాలు, పెన్షన్లు ఇస్తున్నామని ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు తెలిపారు. ``కష్టాల్లో ఉన్నా 43శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చాం. ఐదేళ్లలో రెండంకెల అభివృద్ధి సాధించాం. మెరుగైన జీవన ప్రమాణాలకు శ్రీకారం చుట్టాం. 55 లక్షల సీనియర్ సిటిజన్లకు రెండు వేలు పెన్షన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మనది. రిటైర్మెంట్ తీసుకొని నేను ప్రశాంతంగా జీవించ‌వచ్చు‌. అనుకున్న లక్ష్యం చేరుకొనే వరకు నేను విశ్రమించేది లేదు. గడిచిన రెండు సంవత్సరాలలో  రెండంకల వృద్ది సాధించాం. త్వరలో పెన్షనర్స్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ పెడతాం.  పెన్షనర్ వెల్పేర్ సొసైటిని ఏర్పాటు చేసుకోవాల‌ని మిమ్మ‌ల్ని కోరుతున్నా‌ను``  అని వెల్ల‌డించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English