జ‌న‌సేన‌లో చేరిన టీడీపీ ఎంపీ

జ‌న‌సేన‌లో చేరిన టీడీపీ ఎంపీ

తెలుగుదేశం పార్టీని వీడి ఇత‌ర పార్టీల్లో చేరుతున్న ఎంపీల జాబితాలో మ‌రొక‌రు చేరారు. వివిధ స‌మీక‌ర‌ణాలు, గెలుపు లెక్క‌లు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం వ‌ల్ల టికెట్ దక్క‌ని నేప‌థ్యంలో స‌ద‌రు నాయ‌కుడు పార్టీని వీడారు. నంద్యాల ఎంపీ ఎస్పీ వై రెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సార‌థ్యంలోని జ‌న‌సేన పార్టీలో చేరారు. జ‌న‌సేన ఆయ‌న‌కు నంద్యాల ఎంపీగా అవ‌కాశం క‌ల్పించ‌నుంద‌ని తెలుస్తోంది.

నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం గత ఎన్నికల్లో వైసీపీ త‌ర‌ఫున గెలిచిన ఎస్పీవై రెడ్డి అనంత‌రం టీడీపీ కండువా క‌ప్పుకొన్నారు. ఈసారి నంద్యాల నుంచి బ‌రిలో దిగేందుకు ఆస‌క్తి క‌న‌బ‌ర్చారు. అయితే, వివిధ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో నంద్యాల ఎంపీ టికెట్‌ను మాండ్ర శివానంద్‌రెడ్డికి టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు కేటాయించారు. దీంతో టీడీపీ తనను మోసం చేసిందని ఆవేదన చెందిన ఆయన నంద్యాల నుంచి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే, ఈ స‌మ‌యంలో జ‌న‌సేన పార్టీ నేత‌లు ఎస్పీవై రెడ్డిని సంప్రదించిన‌ట్లు స‌మాచారం.

ఇండిపెండెంట్‌గా బ‌రిలో దిగే బ‌దులుగా జ‌న‌సేన త‌ర‌ఫున రంగంలోకి దిగేందుకు సిద్ధ‌మైన ఎస్పీవైరెడ్డి ఈ మేర‌కు కార్య‌క‌ర్త‌ల‌తో చ‌ర్చించారు. ఎస్పీవై రెడ్డి అనుచరుల్లో చాలామంది జనసేన నుంచి పోటీ చేయాలని సూచించడంతో ఆయన జనసేనలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. తన కుమార్తెతో క‌లిసి విజయవాడలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను జ‌న‌సేన కార్యాల‌యంలో ఎస్పీవై రెడ్డి క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌నకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి పవన్ కల్యాణ్ ఆహ్వానించారు. ఎస్పీవై రెడ్డికి ముందుగా హామీ ఇచ్చిన ప్ర‌కారం నంద్యాల టికెట్ ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English