మోడీ నిర్ణ‌యం ఖ‌రీదు.. 1114 కోట్లు.. త‌ల‌ప‌ట్టుకున్న ఏపీ!

పెట్రోల్ ధ‌ర‌లు, డీజిల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించాలంటూ.. టీడీపీ స‌హా బీజేపీలు.. భారీ ఎత్తున రాష్ట్రంలో ఆందోళ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే. కేంద్రం పెట్రోల్ ధ‌ర‌లు త‌గ్గించిన నేప‌థ్యంలో రాష్ట్రంలోనూ త‌గ్గించాల‌నే డిమాండ్లు వినిపించాయి. అయితే.. ఇది ఒక బాధ అయితే.. మ‌రోవైపు.. ఏపీ అధికారులు.. ప్ర‌భుత్వం.,. ఓ వాద‌న‌ను తెర‌మీదికి తెచ్చారు. కేంద్రంలోని మోడీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యం.. కార‌ణంగా ఏపీకి భారీ దెబ్బ త‌గిలింద‌ని.. తాజాగా వెల్ల‌డించారు. కేంద్రం ఇటీవ‌ల పెట్రోల్ , డీజిల్ ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తూ.. నిర్ణ‌యం తీసుకుంది.

అప్ప‌టి వ‌ర‌కు పెంచ‌డ‌మే త‌ప్ప‌.. త‌గ్గించ‌డం తెలియ‌ని కేంద్రం.. ఒక్క‌సారిగా.. పెట్రోల్‌పై రూ.5 డీజీల్ పై రూ.10 చొప్పున త‌గ్గించింది. దీంతో దేశ‌వ్యాప్తంగా ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. అయితే.. దీనికి సంబంధించి కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని త‌గ్గించింది. అయితే.. ఈ త‌గ్గింపుతో త‌మ ఆదాయం కూడా పోయింద‌ని.. రాష్ట్రం ఇప్పుడు గ‌గ్గోలు పెడుతోంది. కేంద్రం తగ్గించిన ఎక్సైజ్‌ డ్యూటీతో రాష్ట్రంలోనూ తగ్గిన వ్యాట్ కేంద్రం తగ్గించిన ఎక్సైజ్‌ డ్యూటీ కారణంగా..రాష్ట్రం ఆదాయంలో భారీగా కోత పడుతోందని అధికారులు తెలిపారు. ఏడాదికి వేయి కోట్ల రూపాయలకుపైగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోనుందన్నారు.

పెట్రోలు, డీజిల్‌పై ఐదు, పది రూపాయల చొప్పున కేంద్రం తగ్గింపు వల్ల..ఆ మేరకు రాష్ట్రంలో పెట్రోలు లీటరుపై రూపాయి 51పైసలు, డీజిల్పై 2రూపాయల 22 పైసల మేర వ్యాట్ తగ్గిందని పేర్కొన్నారు. ఏడాదికి డీజిల్పై 888 కోట్ల రూపాయలు, పెట్రోలుపై 226కోట్ల మేర వ్యాట్ ఆదాయం తగ్గనుంద‌న్నారు. కేంద్రం తగ్గించిన ఎక్సైజు పన్నుతో వ్యాట్ మూలధరలో వచ్చిన మార్పుల కారణంగా మొత్తంగా ఏడాదికి 1114 కోట్ల రూపాయల మేర వ్యాట్ ఆదాయంలో తగ్గుదల నమోదు కానుందని అధికారులు అంచనా వేశారు. సో.. ఒక‌వైపు.. టీడీపీ, బీజేపీలు.. ధ‌ర‌లు త‌గ్గించ‌మంటే.. ప్ర‌భుత్వం మాత్రం త‌మ‌కు న‌ష్టం వ‌చ్చింద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిపై విప‌క్షాలు ఎలాంటి వ్యాఖ్య‌లు చేస్తాయో చూడాలి.