ఎట్టకేలకు రియాకు రిలీఫ్!

నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆమె బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా ఫ్రీజ్ చేసేశారు. ఈ కేసులో కొన్నాళ్లపాటు రియా జైల్లో కూడా ఉంది. ఆ తరువాత బయటకొచ్చింది. ఇప్పుడు ఆమె బ్యాంక్ అకౌంట్ల విషయంలో కోర్టు రియాకు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు తెలుస్తోంది. విచారణ సమయంలో నిందితురాలిగా ఆమె బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా ఫ్రీజ్ చేసింది ఎన్సీబీ. అయితే పది నెలలుగా తన బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారని.. ఈ విషయంలో తనకు అన్యాయం జరుగుతోందని రియా కోర్టుని ఆశ్రయించింది.

రియా అకౌంట్లను ఫ్రీజ్ చేసే ఉంచారని.. ఇంకా విచారణ జరుగుతోందని ఎన్సీబీ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. కానీ ఇప్పటికే పది నెలలు గడిచిపోవడంతో కోర్టు ఎన్సీబీ వాదనను పట్టించుకోలేదు. రియా బ్యాంక్ అకౌంట్లను డీఫ్రీజ్ చేయమంటూ కోర్టు తీర్పునిచ్చింది. అలానే రియా ఐఫోన్, ఐప్యాడ్ లను కూడా తిరిగి ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి ఈ విషయంలో రియాకు రిలీఫ్ దొరికింది.

సుశాంత్ తో రిలేషన్ లో ఉండడంతో అతడి మరణానికి ఆమెకి లింక్ ఉందనే అనుమానంతో రియాను అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత కేసు మొత్తం తారుమారై డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. అప్పట్లో రియాకు డ్రగ్స్ పెడ్లర్స్ తో సంబంధాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. మీడియా వర్గాల్లో కూడా రియా గురించి నానా రచ్చ జరిగింది. ఇప్పుడిప్పుడే ఆమెకి ఈ కేసులో ఊరట లభిస్తుంది.