మోడీ,కేసీఆర్ జోడీ...ఢీకొట్టేందుకు రేవంత్ కొత్త ఎత్తుగ‌డ‌

మోడీ,కేసీఆర్ జోడీ...ఢీకొట్టేందుకు రేవంత్ కొత్త ఎత్తుగ‌డ‌

మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంటు అభ్య‌ర్థిగా బ‌రిలో దిగుతున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. నామినేష‌న్ వేసేందుకు ముందే ఆయ‌న త‌మ పార్టీ మిత్ర‌ప‌క్షాల‌తో స‌మావేశం అవుతూ వారితో క‌లిసి స‌త్తా చాటుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇలా త‌న‌దైన శైలిలో అడుగులు వేస్తున్న రేవంత్ తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యాల‌యానికి వెళ్లారు. అక్క‌డ పార్టీ నేత‌ల‌తో స‌మావేశ‌మై చ‌ర్చించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ అరాచకత్వంపై పోరాడడానికి సీపీఐ మద్దతు అడిగానన‌ని వెల్ల‌డించారు.

మ‌ల్కాజ్‌గిరీలో సీపీఐ ప్రభావం ఉంటుందని, వారి మద్దతుంటే తప్పకుండా గెలుస్తాన‌ని రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. ``ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ అరాచకత్వానికి బొమ్మ బొరుసుల్లాంటి వారు. బీజేపీ చేసిన పనులన్నింటికి కేసీఆర్ మద్దతిచ్చి ఇప్పుడు ప్రజల ముందు నాటకాలు ఆడుతున్నారు. ఢిల్లీలో మోడీని, ఇక్కడ కేడీని నిలువరించాలంటే కమ్యూనిస్టుల సహకారం అవసరం.`` అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు వేసిన ప్రతి ఓటు మోడీకి వేసినట్టేన‌ని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జాతీయ రాజకీయాలు కేసీఆర్‌కు అవసరం లేదని, సినిమాలో గచ్చిబౌలి దివాకర్ క్యారెక్టర్‌లాగా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఓ జోకర్ అని రేవంత్ మండిప‌డ్డారు.

సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడా వెంక‌ట్‌రెడ్డి మాట్లాడుతూ, త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వమని రేవంత్ కోరారని, మల్కాజ్‌గిరిలోని సీపీఐ నాయకులందరూ రేవంత్ గెలుపు కోసం కృషి చేస్తారని ప్ర‌క‌టించారు. బీజేపీ హఠావో దేశ్ బచావో అని పార్టీ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా లౌకిక శక్తులకు మద్దతిస్తున్నామ‌న్నారు. ``బీజేపీని ఓడించండి...టీఆర్ఎస్‌ను ఓడించండి`` అనే నినాదంతో ముందుకెళ్తామ‌ని అన్నారు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English