మహేష్‌ను కదిలించేసిన ‘స్కూల్’


సూపర్ స్టార్ మహేష్ బాబు తెరమీద ఉదాత్తమైన పాత్రలు చేయడమే కాదు.. బయట కూడా గొప్ప స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రశంసలు అందుకుంటూ ఉంటాడు. ఇప్పటిదాకా మహేష్ చొరవతో వెయ్యి మందికి పైగా చిన్న పిల్లలకు గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలు చేయించడం తెలిసిందే. ఇంకా వేరే రకంగారూ మహేష్ సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఏపీలో ఒక గ్రామం, తెలంగాణలో మరో గ్రామం దత్తత తీసుకుని వాటిని మహేష్ అభివృద్ధి చేయిస్తున్న సంగతి తెలిసిందే.

గ్రామాల దత్తత నేపథ్యంలో సాగే ‘శ్రీమంతుడు’ సినిమా చేసిన టైంలో మహేష్ ఈ బాధ్యత చేపట్టాడు. ఆ సినిమా కాన్సెప్ట్ మహేష్‌లోనే కాదు.. ఇలాంటి శ్రీమంతులు చాలామందిలో కదలిక తెచ్చి తాము పుట్టిన ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టేలా స్ఫూర్తినిచ్చింది.

ఈ క్రమంలోనే సుభాష్ రెడ్డి అనే వ్యాపారవేత్త తెలంగాణలోని కామారెడ్డి ప్రాంతంలో తాను పుట్టిన ఊరిలో అధునాతన సౌకర్యాలతో పాఠశాల నిర్మించారు. ఇదే స్కూల్లో చదువుకున్న పాత విద్యార్థులు మరిందరు ఆయనకు సహకారం అందించారు. ఈ పాఠశాలను మంత్రి కేటీఆర్ మంగళవారం ఆరంభించారు. ఈ సందర్భంగానే ‘శ్రీమంతుడు’ సినిమా స్ఫూర్తితో సుభాష్ రెడ్డి ఈ పాఠశాలను నిర్మించిన విషయం వెల్లడించారు. ఈ విషయం తెలిసి మహేష్ కదిలిపోయాడు.

ట్విట్టర్లో స్కూల్ ఇనాగరేషన్ ఫంక్షన్ తాలూకు వీడియోను షేర్ చేస్తూ.. ఎమోషనల్ అయ్యాడు. ‘శ్రీమంతుడు’ సినిమా స్ఫూర్తితో ఈ స్కూల్ నిర్మాణం జరిగిందని తెలిసి తనకెంతో సంతోషంగా ఉందని, సుభాష్ రెడ్డి లాంటి రియల్ హీరోలు సొసైటీకి చాలా అవసరమని మహేష్ వ్యాఖ్యానించాడు. ఈ స్కూల్ నిర్మాణం పూర్తి స్థాయిలో జరిగాక ‘శ్రీమంతుడు’ టీంతో కలిసి పాఠశాలను తాను సందర్శిస్తానని కూడా మహేష్ పేర్కొనడం విశేషం.