లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ న్యూజిలాండ్ ఉగ్ర‌దాడి !

లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ న్యూజిలాండ్ ఉగ్ర‌దాడి !

యావ‌త్ ప్ర‌పంచం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డిన న్యూజిలాండ్ ఉగ్ర‌దాడికి సంబంధించి ఒళ్లు గ‌గుర్పాటుకు గురి చేసే అంశాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ అందిన‌ స‌మాచారం ప్ర‌కారం మ‌సీద్ లో జ‌రిపిన కాల్పుల్లో మొత్తం 49 మంది మ‌ర‌ణించిన‌ట్లుగా తెలుస్తోంది. మ‌సీదులో ఎక్క‌డ చూసినా మృత‌దేహాలు క‌నిపిస్తున్నాయి.

రోద‌న‌లతో మ‌సీదు మారుమోగుతోంది. న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చ‌ర్చ్ లోని పెద్ద‌దైన అల్ నూర్ మ‌సీదులోకి  పెద్ద ఎత్తున ఆయుధాలు ధ‌రించిన గుర్తు తెలియ‌ని దుండ‌గుడు విచ‌క్ష‌ణ‌రహితంగా కాల్పులు జ‌రిపారు. ఈ ఉదంతంలో మ‌రింత దారుణ‌మైన విష‌యం ఏమంటే.. త‌న దాడి మొత్తాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసిన‌ట్లుగా గుర్తించారు.

భ‌యాన‌కంగా సాగిన దాడికి సంబంధించిన‌ 17 నిమిషాల నిడివి ఉన్న ఈ లైవ్ స్ట్రీమింగ్ సంచ‌ల‌నంగా మారింది. అయితే.. ఈ లైవ్ స్ట్రీమింగ్ వీడియోను షేర్ చేయ‌కూడ‌దంటూ న్యూజిలాండ్ పోలీసులు ప్ర‌జ‌ల‌ను కోరుతున్నారు. న్యూజిలాండ్ లో చోటు చేసుకున్న ఉగ్ర‌దాడికి కార‌ణ‌మైన వ్య‌క్తి ఆస్ట్రేలియాకు చెందిన వాడిగా భావిస్తున్నారు.

ఈ ఘ‌ట‌న‌పై న్యూజిలాండ్ ప్ర‌ధాని జెసిందా ఆర్డెర్న్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. దేశం చూసిన చీక‌టి రోజుల్లో ఇదొక‌టిగా ఆమె చెప్పారు. హింస‌కు తీవ్ర‌మైన రూపం తాజా ఘ‌ట‌న‌గా ఆమె అభివ‌ర్ణించారు. దాడికి పాల్ప‌డిన వ్య‌క్తి న‌ల్ల రంగు దుస్తుల్ని ధ‌రించి మ‌సీద్ లోకి జొర‌బ‌డి విచ‌క్ష‌ణ‌ర‌హితంగా కాల్పులు జ‌రిపిన‌ట్లుగా గుర్తించారు.
ఒంటినిండా ఆయుధాల‌తో ఉన్న వ్య‌క్తి మ‌సీదులోకి చొర‌బ‌డిన వైనాన్ని ప‌లువురు ప్ర‌త్య‌క్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌తో సంబంధం ఉన్న న‌లుగురు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక మ‌హిళ ఉన్న‌ట్లు చెబుతున్నారు. న‌ర‌మేధం సాగించిన ఉగ్ర‌వాది.. ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత కొద్దిసేపు ఘ‌ట‌నాస్థ‌లంలోనే ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English