కేసీఆర్ మీకో దండం.. ప‌వ‌న్ టోన్ లో ఈ మార్పేంది?

కేసీఆర్ మీకో దండం.. ప‌వ‌న్ టోన్ లో ఈ మార్పేంది?

తాట తీస్తా. లుంగీలు విప్ప‌దీసి కొడ‌తా.  జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మార్క్ వ్యాఖ్య‌లు. అలాంటి ప‌వ‌న్ ను తాజాగా తెలంగాణ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. స‌రిగ్గా ఐదేళ్ల క్రితం మార్చి 14న పార్టీ పెట్టిన ప‌వ‌న్.. త‌న పార్టీ ప్ర‌క‌ట‌న సంద‌ర్భంగా కేసీఆర్ ను  ఉద్దేశించి ఘాటు వ్యాఖ్య‌లే చేశారు. అంతేనా.. కేసీఆర్ కుమార్తె క‌విత‌ను ఉద్దేశించి తెలంగాణ జాగృతి లెక్క‌ల మాటేంది? అంటూ సూటిగా ప్ర‌శ్నించారు. ఆ త‌ర్వాత  చేప‌ట్టిన ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ కేసీఆర్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కేసీఆర్ ను ఉద్దేశించి హాట్ వ్యాఖ్య‌లు చేసిన వారిలో ప‌వ‌న్ ఒక‌రు. అలాంటి ఆయ‌న ఐదేళ్లు గ‌డిచేస‌రికి కేసీఆర్‌ను ఉద్దేశించి తాజాగా చేసిన వ్యాఖ్య‌లు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించేలా ఉన్నాయి. ఒకింత అభ్య‌ర్థ‌న‌.. మ‌రికొంత బ్ర‌తిమిలాడే ధోర‌ణిలో కేసీఆర్ మీకో దండం.. ఆంధ్రుల‌ను వ‌దిలేయాల‌న్న ఆయ‌న మాట వెనుక లెక్క వేరే ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

ప‌వ‌న్ మాట‌ల్లోనే చూస్తే.. కేసీఆర్‌.. మీకో న‌మ‌స్కారం. రెండు చేతులు జోడించి న‌మ‌స్క‌రిస్తున్నాను. ఉమ్మ‌డిగా ఉన్న‌ప్పుడు ఆంధ్రుల‌ను తిట్టారు. ఇవాళ విడిపోయాం. ఇక‌.. ఆంధ్రుల‌ను వ‌దిలేయండి. శిష్టా ఆంజనేయ శాస్త్రి చెప్పిన‌ట్లు రాజ్యాంబ‌ద్ద విరోధం ఉండాలే కానీ ప్ర‌జ‌ల మ‌ధ్య విరోధం కాదంటూ ప‌వ‌న్ వ్యాఖ్య‌లు చూస్తే.. చాలా బ్యాలెన్స్ డ్ గా ఉండ‌ట‌మే కాదు.. కాసింత త‌గ్గి మాట్లాడిన‌ట్లుగా ఉన్న‌ట్లు చెప్పాలి.

త‌న మాట‌తో కేసీఆర్ ఏపీని ప‌ట్టుకొని ఉన్న‌ట్లు.. ఆంధ్రుల మీద త‌న అధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తున్న భావ‌న క‌లిగేలా ఉన్నాయ‌ని చెప్పాలి. అంతేకాదు.. ఏపీ రాజ‌కీయాల్లో కేసీఆర్ త‌ల‌దూర్చ‌ట‌మే కాదు.. ఇప్పుడు ఆయ‌నే స్వ‌యంగా వ్యూహాల్ని సిద్ధం చేస్తున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌వేళ‌.. ప‌వ‌న్ మాట‌ల్లో కేసీఆర్ ప్ర‌స్తావ‌న రావ‌టం.. నేరుగా ఆంధ్రుల్ని వ‌దిలేయాల‌ని వ్యాఖ్యానించ‌టం వెనుక అస‌లు అర్థం వేరేన‌ని చెబుతున్నారు.

ఓవైపు జ‌గ‌న్ కు అన్ని విధాలుగా సాయం చేసేందుకు కేసీఆర్ సుముఖంగా ఉండ‌టం.. ఇదే విష‌యాన్ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు మొద‌లు ప‌లువురు నేత‌లు త‌ర‌చూ ప్ర‌స్తావిస్తున్న‌వైనం తెలిసిందే. ఇలాంటివేళ‌.. జ‌గ‌న్  మీద వ్య‌తిరేక‌త త‌న‌కు మేలు జ‌ర‌గాల‌న్న ఆలోచ‌న‌తో పాటు.. జ‌గ‌న్ కు.. కేసీఆర్ మ‌ధ్య ఉన్న లోగుట్టు సంబందాన్ని ప‌వ‌న్ త‌న తాజా వ్యాఖ్య‌తో చెప్పేశార‌ని చెప్పాలి. ఒక‌విధంగా చూస్తే.. జ‌గ‌న్ వెనుక కేసీఆర్ ఉన్నార‌ని.. త‌న వెనుక ఎవ‌రూ లేర‌న్న మాట‌ను  ప‌వ‌న్ చెప్పే ప్ర‌య‌త్నం చేశార‌ని చెప్పాలి. జ‌గ‌న్ వ్య‌తిరేక ఓటును సొంతం చేసుకోవాల‌న్న ఆలోచ‌న ప‌వ‌న్ మాట‌ల్లో క‌నిపిస్తుంద‌ని చెబుతున్నారు. ప‌వ‌న్ అంటే ఆవేశంతో విరుచుకుప‌డ‌ట‌మ‌న్న ఇమేజ్ కు భిన్నంగా ఆయ‌న తాజా వ్యాఖ్య‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం. త‌న చేతికి అధికారం వ‌స్తే.. పొరుగు రాష్ట్రంతో రాజీ ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తాన‌న్న సందేశాన్ని ఇచ్చేలా ప‌వ‌న్ మాట‌లు ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English