ప‌వ‌న్ హామీల చిట్టా పెద్ద‌దే!

ప‌వ‌న్ హామీల చిట్టా పెద్ద‌దే!

జ‌న‌సేన అధినేత ఎన్నిక‌ల స‌మ‌ర శంఖారావాన్ని పూరించారు. ఐదేళ్ల క్రితం ఇదే రోజు (మార్చి 14)  హైద‌రాబాద్ లోని హైటెక్స్ లో జ‌న‌సేన పార్టీ పెట్టిన ఆయ‌న‌.. తాజాగా త‌మ పార్టీ ఆవిర్భావ దినోత్స‌వ స‌భ‌ను రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో నిర్వ‌హించారు. భారీగా త‌ర‌లివ‌చ్చిన జ‌న‌సందోహం న‌డుమ‌.. ఎన్నిక‌ల హామీల వ‌ర్షం కురిపించారు.

తాము అధికారంలోకి వ‌స్తే ఏమేం చేస్తామ‌న్న విష‌యాన్ని ఆయ‌న చెప్పుకొచ్చారు. తాను దేనిని ఆశించ‌న‌ని.. అధికారం మీద త‌న‌కు వ్యామోహం లేద‌ని చెప్పారు. యుద్ధం చేయ‌ట‌మే త‌న‌కు తెలుస‌ని చెప్పిన ప‌వ‌న్.. త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే తాము చేయ‌బోయే కార్య‌క్ర‌మాల వివ‌రాల్ని వెల్ల‌డించారు. ఆయ‌న హామీల్లో అధిక శాతం రైతుల‌పై వ‌రాల జ‌ల్లు కురిపించారు.

ఎక‌రాకు రూ.8వేల పంట సాయం.. 60 ఏళ్లకు పైబ‌డిన స‌న్న‌.. చిన్న‌కారు రైతుల‌కు రూ.5వేల పింఛ‌ను అందిస్తామ‌ని చెప్పారు. రైతుల‌కు ఉచితంగా సోలార్ మోట‌ర్లు అంద‌జేస్తామ‌ని చెప్పిన ఆయ‌న‌.. ఒక‌టి నుంచి ప‌దోత‌ర‌గ‌తి వ‌ర‌కూ ఉచిత విద్య‌ను అందిస్తామ‌ని చెప్పారు.

యువ‌త‌.. మ‌హిళ‌ల‌కు భ‌రోసా క‌ల్పించేలా హామీలు ఇచ్చాన ఆయ‌న‌.. తాము ప‌వ‌ర్లోకి వ‌చ్చిన మొద‌టి ఆర్నెల్ల‌లోనే ల‌క్ష ఉద్యోగాల్ని.. ఐదేళ్ల వ్య‌వ‌ధిలో ప‌ది ల‌క్ష‌ల ఉద్యోగాల్ని ఇస్తామ‌ని చెప్పారు. ప‌వ‌న్ త‌న హామీల్లో మ‌హిళ‌ల‌కు పెద్ద ఎత్తున వ‌రాలు ఇవ్వ‌టం గ‌మ‌నార్హం. మ‌హిళ‌ల‌కు ఇంత భారీగా హామీలు ఇటీవ‌ల కాలంలో మ‌రే పార్టీ ఇవ్వ‌లేద‌న్న మాట వినిపిస్తోంది. ప‌వ‌న్ ఇచ్చిన హామీల్లో ముఖ్య‌మైన‌వి చూస్తే..

+  ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు ఏడాదికి ఒకేసారి ఫీజు. ప్రభుత్వోద్యోగుల కోసం సీపీఎస్‌ రద్దు
+  ఎవరూ లంచం అడగని వ్యవస్థ రూపకల్పన
+ డొక్కా సీతమ్మ క్యాంటీన్లలో ఉచిత భోజనం
+ బీసీలకు ఐదు శాతం రాజకీయ రిజర్వేషన్లు
+ నదులు అనుసంధానం చేసి కొత్త జలాశయాలు నిర్మాణం
+ మత్స్యకారుల రుణాల కోసం ప్రత్యేక బ్యాంకు.
+ వేటకు వెళ్లని సమయంలో మ‌త్స్య‌కార్ల‌కు రోజుకు రూ.500ఆర్థిక సహాయం.
+ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల లోపు అందరికీ సురక్షిత మంచినీటి సరఫరా
+ అభివృద్ధి కోసం భూములిచ్చిన రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లింపు
+ ముస్లింల అభ్యున్నతి కోసం సచార్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు
+ ప్రతి మండలానికి కల్యాణ మండపం నిర్మాణం
మ‌హిళ‌ల‌కు..
+  మ‌హిళ‌ల‌కు అండగా ఉండే.. భద్రత కల్పించేలా కఠిన చట్టాల రూపకల్పన.
+  ప్రతి జిల్లాలో మహిళల కోసం ప్రత్యేక బ్యాంకు, ఆస్పత్రి నిర్మాణం
+ మహిళలకు శాసనసభలో 33శాతం రిజర్వేషన్లు
+ డ్వాక్రా సంఘాల మహిళలకు స్థానిక పంచాయతీ ఎన్నికల్లో ప్రాధాన్యం
+ ఆడపడుచులకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు
+ అన్ని మతాల మహిళలకు ఆయా పండుగలకు చీరల పంపిణీ  
+ మహిళా ఉద్యోగుల కోసం శిశు సంరక్షణా కేంద్రాలు ఏర్పాటు
+ మహిళలకు పావలా వడ్డీకే రుణాలు

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English