లోట‌స్ పాండ్ వ‌దిలి పులివెందుల‌కు జ‌గ‌న్ అందుకే వెళ్లారా?

లోట‌స్ పాండ్ వ‌దిలి పులివెందుల‌కు జ‌గ‌న్ అందుకే వెళ్లారా?

ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న రోజులు వ‌చ్చేశాయి. అందుకే కాబోలు ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జాగ్ర‌త్త‌గా ఉంటున్నారు. త‌న‌పై వ‌చ్చే విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌ల విష‌యంలో ఆయ‌న అప్ర‌మ‌త్తంగా ఉంటున్నారు. ఎవ‌రు అవున‌న్నా.. కాద‌న్నా సోష‌ల్ మీడియా ఓట‌ర్ల మీద ప్ర‌భావితం చేస్తున్న నేప‌థ్యంలో త‌న‌పై జ‌రిగే నెగిటివ్ ఎమోష‌న‌ల్ ప్ర‌చారానికి చెక్ చెప్పాల‌న్న‌ట్లుగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఏపీ విప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రిస్తూ.. హైద‌రాబాద్ లోని లోట‌స్ పాండ్ లో కూర్చొని టికెట్ల‌ను డిసైడ్ చేస్తారా?  అభ్య‌ర్థుల జాబితాను హైద‌రాబాద్ లో కూర్చునే సి్ద‌ధం చేయాలా?  రేపొద్దున అధికారం వ‌చ్చినా హైద‌రాబాద్‌లో కూర్చునే సీఎంగా వ్య‌వ‌హ‌రిస్తారా? అంటూ ఎదుర‌వుతున్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పేందుకు వీలుగా జ‌గ‌న్ తాజాగా త‌న టూర్ ప్లాన్ ను మార్చుకున్న‌ట్లు చెబుతున్నారు.

అభ్య‌ర్థుల ఎంపిక‌తో పాటు.. నేత‌ల‌ని క‌ల‌వ‌టం.. వారిని బుజ్జ‌గించ‌టం.. టికెట్ల హామీలు ఇవ్వ‌టం లాంటి ప‌రిణామాలు హైద‌రాబాద్ లోని లోట‌స్ పాండ్ వేదిక‌గా సాగుతున్నాయి. దీనిపై జ‌గ‌న్ ప్ర‌త్య‌ర్థులు వెలెత్తి చూపిస్తూ.. త‌ప్ప ప‌డుతున్నారు. ఏపీలో జ‌రిగే ఎన్నిక‌ల అభ్య‌ర్థుల క‌స‌ర‌త్తు వేరే రాష్ట్ర రాజ‌ధానిలో కూర్చొని చేస్తారా? అంటూ సాగుతున్న ప్ర‌చారంతో జ‌గ‌న్ పార్టీకి ఇబ్బందిగా మారుతోంది. దీనికి సూటిగా స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్న ప‌రిస్థితి. దీంతో.. ప్ర‌త్య‌ర్థుల‌కు ఎక్కువ అవ‌కాశం ఇవ్వ‌టం మంచిది కాద‌న్న సూచ‌న‌తో జ‌గ‌న్ లోట‌స్ పాండ్ నుంచి పులివెందుల‌కు వెళ్లిపోయిన‌ట్లుగా చెబుతున్నారు.

అభ్య‌ర్థుల జాబితా వెల్ల‌డి ఇడుపులపాయ నుంచి చేయాల్సిన నేప‌థ్యంలో.. అందుకు మ‌రో రెండు రోజుల స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ హైద‌రాబాద్ ను విడిచి పులివెందుల‌కు ప్ర‌యాణం కావ‌టానికి కార‌ణం త‌న ప్ర‌త్య‌ర్థులు చేస్తున్న నెగిటివ్ ప్ర‌చారంగా చెబుతున్నారు.

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ను చూస్తే.. ఆయ‌న రాజ‌కీయం చేసేది ఏపీలో ఉండేది హైద‌రాబాద్‌లో అన్న విమ‌ర్శ బ‌లంగా వినిపించేది. ఈ విష‌యాన్ని గుర్తించిన ప‌వ‌న్ గ‌డిచిన ఏడాదిగా ఎక్కువ‌గా ఏపీలోనే ఉంటున్న ప‌రిస్థితి. త‌న నివాసాన్ని అమ‌రావ‌తి వ‌ద్ద ఏర్పాటు చేసుకోవ‌టం తెలిసిందే. నాడు ప‌వ‌న్ కు ఎదురైన విమ‌ర్శ‌లే.. నేడు జ‌గ‌న్ విష‌యంలోనూ చోటు చేసుకోవ‌టంతో అలెర్ట్ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు అధినేత‌ను అర్జెంట్ గా పులివెందుల‌కు వెళ్లాల‌న్న మాట చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ కార‌ణంతోనే.. జ‌గ‌న్ హైద‌రాబాద్ నుంచి పులివెందుల‌కు వెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English