ఏపీ ఎన్నికల బరిలో విద్యా సంస్థల అధిపతులు!

ఏపీ ఎన్నికల బరిలో విద్యా సంస్థల అధిపతులు!

వారంతా తెలుగు రాష్ట్రాల్లో పలు విద్యాసంస్థలు నెలకొల్పిన వారు. దశాబ్దాల కాలంగా కార్పొరేట్ విద్యను తెలుగు  విద్యార్థులకు అందజేస్తున్న వారు. అలా అనడం కంటే కార్పొరేట్ విద్యను రుద్దుతున్న వారు అనడం బాగుంటుందని కొందరి అభిప్రాయం. వీరికి ప్రజాసేవ పట్ల ప్రేమ పెరిగి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఒకటి రెండు విద్యా సంస్థల అధినేతలు అధికార తెలుగుదేశం పార్టీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాప్రతినిధులు,  మంత్రులుగాను పని చేశారు.

ఇప్పుడు వారికి తోడుగా మరిన్ని విద్యాసంస్థలకు చెందిన అధిపతులు కూడా అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారాయణ సంస్థల అధినేత నారాయణకు మంత్రి పదవి ఇచ్చి...  ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.

అమరావతిలో రాజధాని నిర్మాణంతో సహా కీలక కట్టడాలు నారాయణ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ఈ నిర్మాణాలు వెనుక అంతులేని అవినీతి దాగి ఉందని అంటున్నారు. అది వేరే సంగతి. ఇక అసలు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో నెల్లూరు నుంచి నారాయణ ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికలతో పరిచయం కానీ, సంబంధాలు గానీ లేని నారాయణ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారో లేదో వేచి చూడాలి.

ఇక అవంతి విద్యా సంస్థలకు చెందిన అవంతి శ్రీనివాస్ ఈసారి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భీమిలి నుంచి పోటీ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈయన తెలుగుదేశం పార్టీ తరఫున అనకాపల్లి లోక్ సభ సభ్యుడిగా పోటీ చేసి గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు పాలనపై తిరుగుబాటు చేసి ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

తెలుగు రాష్ట్రాల్లో తొలి విద్యా సంస్థ గా పేరుపొందిన విజ్ఞాన్ విద్యాసంస్థల రత్తయ్య కుమారుడు కృష్ణదేవరాయలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నరసరావుపేట నుంచి లోక్ సభ బరిలో నిలువనున్నారు. ఇతర విద్యా సంస్థలతో పోలిస్తే విజ్ఞాన సంస్థల యాజమాన్యానికి ప్రజల్లో మంచి సానుభూతి ఉంది.

నలంద విద్యా సంస్థల అధినేత వరప్రసాద్ రెడ్డి సత్తెనపల్లి నుంచి.... గుంటూరులోని పూజిత పాఠశాల నిర్వాహకుడు హరిప్రసాద్ బాపట్ల నుంచి.. ఎన్నారై విద్యాసంస్థల అధినేత ఆలపాటి రాజేంద్రప్రసాద్  వంటి వారు కూడా ఈసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విద్య ను కార్పొరేట్ సంస్కృతి లోకి మారిన తర్వాత ఇతర వ్యాపారాలతో పోలిస్తే విద్యా వ్యాపారం ఎంతో లాభసాటిగా మారింది. ఈ విద్యా వ్యాపారంలో నిష్ణాతులైన వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేందుకు తహతహలాడుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English