కాంగ్రెస్ లోనే స‌బిత‌.. చ‌క్రం తిప్పిన రేవంత్‌?

కాంగ్రెస్ లోనే స‌బిత‌.. చ‌క్రం తిప్పిన రేవంత్‌?

రాజ‌కీయాల్లో ఎప్పుడైనా.. ఏమైనా జ‌రిగే వీలుంది.  ప్ర‌త్య‌ర్థులుగా నిత్యం కొట్టుకు చ‌చ్చే వారు సైతం క‌లిసి కండువాలు క‌ప్పుకునే చిత్రం రాజ‌కీయాల్లోనే సాధ్యం. శాశ్విత మిత్రులు.. శాశ్విత శ‌త్రువులు రాజ‌కీయాల్లో అస్స‌లు ఉండ‌రు. ఈ సూత్రాన్ని న‌మ్మిన కార‌ణంగానే రేవంత్ పుణ్య‌మా అని కాంగ్రెస్ కు తీర‌ని న‌ష్టం తృటిలో త‌ప్పిందా? అంటే అవున‌నే మాట వినిపిస్తోంది.

త‌మ కుటుంబానికి రాజ‌కీయంగా అండ‌గా ఉండే అస‌ద్ లాంటి నేత మ‌ధ్య‌వ‌ర్తిగా వ్య‌వ‌హ‌రించి.. గులాబీ కారు ఎక్కేందుకు వీలుగా స‌బిత కుటుంబాన్ని ఒప్పించే ప్ర‌య‌త్నం రాజ‌కీయంగా ఎంత‌టి సంచ‌ల‌నంగా మారిందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అస‌ద్ నివాసంలో కేటీఆర్ తో భేటీ అయిన స‌బిత.. టీఆర్ఎస్ లోకి వెళ్లటం దాదాపుగా ఖాయ‌మైంద‌న్న మాట వినిపించింది. అదే జ‌రిగితే పార్టీకి జ‌రిగే న‌ష్టం అంతా ఇంతా కాదు.

ఈ విష‌యాన్ని గుర్తించిన కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం ఈ ఇష్యూ మీద సీరియ‌స్ గా దృష్టి సారించింది. స‌బిత‌ను పార్టీ నుంచి వీడిపోకుండా చూడాలంటూ టీ పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని స‌బిత‌తో మాట్లాడాల‌ని ఆదేశించిన‌ట్లు చెబుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన రేవంత్‌.. స‌బిత‌ను.. ఆమె కుమారుడ్ని టీఆర్ఎస్ లోకి వెళ్లే విష‌యంపై పున‌రాలోచ‌న జ‌రిపేలా చేయ‌టంలో స‌క్సెస్ అయిన‌ట్లుగా తెలుస్తోంది. స‌బిత‌తో రేవంత్ జ‌రిపిన చ‌ర్చ‌లు ఫ‌ల‌వంత‌మ‌య్యాయ‌ని..చ‌ర్చ‌ల నేప‌థ్యంలో ఆమె కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్ట‌న్లుగా చెబుతున్నారు.

తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ రోజు (మంగ‌ళ‌వారం) సాయంత్రం స‌బిత‌.. ఆమె కుమారుడు.. రేవంత్ రెడ్డి త‌దిత‌రులు ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. అక్క‌డ పార్టీ అధినేత రాహుల్ తో స‌మావేశం కానున్న‌ట్లు చెబుతున్నారు. స‌బిత‌ను కాంగ్రెస్ నుంచి వీడిపోకుండా ఉండేందుకు పార్టీ అధినాయ‌క‌త్వం చేసిన ప్ర‌య‌త్నాలు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. తాము పిలిస్తే చాలు కాంగ్రెస్ నేత‌లు ప‌రిగెత్తుకొస్తార‌ని చెబుతున్న కేసీఆర్ మాట‌ల్లో నిజం లేద‌న్న విష‌యం స‌బిత ఎపిసోడ్ చెప్ప‌క‌నే చెప్పే ప‌రిస్థితి. తెలంగాణ‌లో కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయాల‌ని.. ఉనికి అన్న‌ది లేకుండా చేయాల‌న్న కేసీఆర్ ప్ర‌య‌త్నానికి తాజా ప‌రిణామం ఎదురుదెబ్బ‌గా చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English