అందరి కళ్లూ ఆ ప్రెస్ మీట్ మీదే..

అందరి కళ్లూ ఆ ప్రెస్ మీట్ మీదే..

‘బాహుబలి’ తర్వాత రాజమౌళి తీస్తున్న కొత్త సినిమా మీద మామూలు అంచనాలు లేవు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో జక్కన్న తీస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టి నిలిచి ఉంది. అందులోనూ ఈ మధ్య ఓ కార్యక్రమంలో భాగంగా జక్కన్న మాట్లాడుతూ.. ‘ఆర్ఆర్ఆర్’ను కూడా ‘బాహుబలి’ లాగే భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు చెప్పాడు.

ఇది ‘బాహుబలి’లా రాజులు, రాజ్యాల నేపథ్యంలో సాగకపోవచ్చు కానీ.. భారీతనానికి మాత్రం లోటుండదని స్పష్టమవుతోంది. దీనికి వివిధ భాషల నుంచి నటీనటులు, టెక్నీషియన్లను తీసుకోవడం ద్వారా పాన్ ఇండియన్ మూవీగా నిలబెట్టడానికి జక్కన్న ప్రయత్నిస్తున్నాడు. ఈ చిత్రంలో కథానాయికలంటూ ఈ మధ్య రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. జనాలు బాగా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఐతే ఈ చిత్రంలో కథానాయికల గురించి అధికారికంగా వెల్లడించడాానికి ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీటే పెట్టబోతున్నట్లు సమాచారం.

మరి కొన్ని రోజుల్లో నిర్వహించబోయే ఈ ప్రెస్ మీట్లో స్వయంగా రాజమౌళే పాల్గొని.. ‘ఆర్ఆర్ఆర్’లో లీడింగ్ లేడీస్ గురించి వెల్లడిస్తాడట. ఎన్టీఆర్, చరణ్‌ల పక్కన నటించే కథానాయికలతో పాటు ఇందులోని మిగతా లేడీ క్యారెక్టర్ల గురించి కూడా అందులో వెల్లడిస్తాడట. జక్కన్న స్వయంగా ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడనగానే అందరి దృష్టీ దీనిపై నిలిచింది.

కేవలం కథానాయికల గురించి చెప్పి ఈ ప్రెస్ మీట్ ముగించకపోవచ్చు. అదే విషయం అయితే దాన్ని ట్విట్టర్ ద్వారా కూడా వెల్లడించవచ్చు. కాబట్టి అంతకుమించి రాజమౌళి ఇంకేమైనా మాట్లాడతాడనే భావిస్తున్నారు. మీడియా ప్రతినిధులు మరిన్ని విశేషాలు రాబట్టడానికి ప్రయత్నిస్తారు. నేషనల్ మీడియాను కూడా పిలిపించి.. సినిమాను ఇప్పట్నుంచే జాతీయ స్థాయిలో వార్తల్లో నిలబెట్టడానికి టీం ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఈ ప్రెస్ మీట్లో ఏమేం విషయాలు బయటికి వస్తాయో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English