కేటీఆర్ క్లారిటీ..నువ్వే తేల్చుకోవాలి హ‌రీశ్‌

కేటీఆర్ క్లారిటీ..నువ్వే తేల్చుకోవాలి హ‌రీశ్‌

మెదక్‌ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఏకంగా హ‌రీశ్‌రావుకు స‌వాల్ విసిరారు. మెదక్‌ పార్లమెంట్‌ కంటే కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోనే ఎక్కువ మెజార్టీ సాధిస్తామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు. దీనిపై మెదక్‌ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులకు సవాల్‌ చేస్తున్నానని కేటీఆర్‌ చెప్పారు.

కేటీఆర్ కంటే ముందు హ‌రీశ్‌రావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి వల్లే మెదక్‌, సిద్దిపేట జిల్లాలు ఏర్పడ్డాయని తెలిపారు.  ``మెదక్‌, సిద్దిపేట జిల్లాగా ఏర్పడింది అంటే సీఎం కేసీఆర్‌ వల్లే సాధ్యమైంది. గజ్వేల్‌, మెదక్‌కు రెండు నెలల్లో రైలు రాబోతుంది. దేశానికే ఆదర్శంగా గజ్వేల్‌ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతోంది. కేసీఆర్‌ ఈ జిల్లా బిడ్డ కావడం వల్లే అభివృద్ధి సాధ్యమవుతోంది. మన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞత చెప్పాలంటే మెదక్‌ పార్లమెంట్‌ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఈ సారి ఐదు లక్షల మెజార్టీతో ఎంపీ అభ్యర్థిని గెలిపించి తమ సత్తా నిరూపించుకోవాలి. `` అని పిలుపునిచ్చారు.

దీనిపై కేటీఆర్ స్పందిస్తూ, ``హరీష్‌రావు చెప్పినట్లు ఈ రోజు పోటీ కాంగ్రెస్‌, బీజేపీకి, మనకు లేదు. పోటీ ఉన్నదంతా ఒకరితో ఒకరు మెజార్టీలు సాధించేది ఉన్నది. హరీష్‌రావు ఒక మాట అన్నారు.. కరీంనగర్‌, వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల కంటే ఎక్కువ మెజార్టీని సాధించాలన్నారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని సిరిసిల్ల నియోజకవర్గం నాది. నేను కూడా సవాల్‌ చేస్తున్నా. మా కంటే ఎక్కువ మెజార్టీ తీసుకువచ్చి రుజువు చేసుకోవాలని సవాల్‌ చేస్తున్నా.`` అని ప్ర‌క‌టించారు. ఈ సందర్భంగా బావకు సవాల్‌ చేస్తున్నారు అని ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించగా.. ``కేటీఆర్‌ ఇందుకు స్పందిస్తూ.. బావతో కాదు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గం కంటే మేమే ఒక్క ఓటన్న ఎక్కువ తెచ్చుకొని మీ కంటే ముందుంటాం. బావ మేమంతా మంచిగానే ఉన్నాం`` అని కేటీఆర్‌ చెప్పడంతో సభలో ముసిముసి న‌వ్వులు విరిశాయి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English