వాటికి బ్యాడ్ టాక్.. దీనికి కలిసొచ్చింది


టాలీవుడ్లో సంక్రాంతి, దసరా పండుగలకు ఉండే సందడి దీపావళికి ఉండదు. కానీ కోలీవుడ్‌కు మాత్రం దీపావళి చాలా స్పెషల్. అలాగే బాలీవుడ్లోనూ దీపావళికి భారీ చిత్రాలు రిలీజవుతుంటాయి. ఈసారి దీపావళికి తమిళంలో అన్నాత్తె లాంటి భారీ చిత్రంతో పాటు హిందీలో సూర్యవంశీ రిలీజయ్యాయి. తెలుగులో మారుతి మూవీ ‘మంచి రోజులు వచ్చాయి’ పండుగ కానుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తమిళ డబ్బింగ్ వెర్షన్లు పెద్దన్న, ఎనిమీ సైతం తెలుగులో పెద్ద ఎత్తునే విడుదలయ్యాయి. ‘సూర్యవంశీ’ హిందీ వెర్షన్ కూడా తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలోనే రిలీజయ్యాయి. ఐతే వీటన్నింట్లో తక్కువ అంచనాలతో రిలీజైన ‘ఎనిమీ’నే బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది. తెలుగు ప్రేక్షకుల దృష్టి విడుదలకు ముందు ప్రధానంగా ‘మంచి రోజులు వచ్చాయి’ మీదే ఉంది. ఆ తర్వాత క్రేజ్ తెచ్చుకున్నది రజినీ సినిమా ‘పెద్దన్న’నే.

ఐతే ఈ రెండు చిత్రాలూ అంచనాలను అందుకోలేకపోయాయి. ‘మంచి రోజులు వచ్చాయి’ మేకర్స్ చాలా కాన్ఫిడెంట్‌గా ముందు రోజే ప్రిమియర్స్ కూడా వేశారు. కానీ మారుతి చాలా హడావుడిగా.. పెద్దగా కసరత్తు చేయకుండా లాగించేసిన ఈ సినిమాలో విషయం లేకపోయింది. కామెడీ పెద్దగా వర్కవుట్ కాలేదు. స్వయంగా మారుతినే ఈ సినిమాలో కామెడీ తగ్గిందని ఒప్పుకున్నాడు. తొలి రోజు కొంత సందడి చేయడం తప్పిస్తే ‘మంచి రోజులు వచ్చాయి’ పెద్దగా ఇంపాక్ట్ వేయలేదు.

‘అన్నాత్తె’కు మరీ డిజాస్టర్ టాక్ రావడంతో రెండో రోజు నుంచే దాని థియేటర్లు వెలవెలబోయాయి. వీటికి నెగెటివ్ టాక్ రావడం.. ‘ఎనిమీ’కి కలిసొచ్చింది. ఈ సినిమా మీద ముందు పెద్దగా అంచనాలు లేవు. కానీ మిగతా రెండు చిత్రాలకు బ్యాడ్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమా వైపు చూశారు. తొలి రోజు ఈవెనింగ్ షోల నుంచి ‘ఎనిమీ’కి మంచి స్పందన వచ్చింది. ఆ సినిమా డీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ అని టాక్ రావడంతో ప్రేక్షకులు బాగానే చూస్తున్నారు. తమిళంలో అయితే ఈ సినిమా హౌస్ ఫుల్స్‌తో రన్ అవుతోంది. ‘అన్నాత్తె’కు పోటీగా ఈ సినిమాను ఎందుకు రిలీజ్ చేస్తున్నారన్నారు కానీ ఇప్పుడు ఇదే బాక్సాఫీస్ విన్నర్ అయ్యేలా ఉంది.