జ‌య‌ల‌లిత‌ను హ‌ల్వా ఇచ్చి చంపేశార‌ట‌!

 జ‌య‌ల‌లిత‌ను హ‌ల్వా ఇచ్చి చంపేశార‌ట‌!

పుర‌చ్చి త‌లైవి - మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణానికి సంబంధించి త‌మిళ‌నాడు మంత్రి ఒక‌రు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె హ‌త్య‌కు గుర‌య్యార‌ని స్ప‌ష్టం చేశారు. అక్ర‌మాస్తుల కేసులో ప్ర‌స్తుతం జైలు శిక్ష అనుభ‌విస్తున్న శ‌శిక‌ళ‌ను విచారిస్తే ఈ హత్య‌కు సంబంధించిన అస‌లు వాస్త‌వాలు వెలుగులోకి వ‌స్తాయ‌ని చెప్పారు.

విళుపురం జిల్లా కళ్లకురిచ్చి స‌మీపంలోని నీల‌మంగ‌ళంలో అన్నా డీఎంకే పార్టీ పోలింగ్ బూతు స్థాయి ఏజెంట్ల స‌మావేశంలో తాజాగా రాష్ట్ర న్యాయ‌శాఖ మంత్రి సి.వి.ష‌ణ్ముగం పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌య‌ల‌లిత ఆస్ప‌త్రిలో ఉన్న‌ప్పుడు ఆమెను చూసేందుకు తాము ప్ర‌య‌త్నించ‌గా ఆమె నిచ్చెలి శ‌శికళ ప‌దే ప‌దే అడ్డుకున్నార‌ని తెలిపారు. శ‌శిక‌ళే జ‌య‌ల‌లిత‌ను హ‌త్య చేశార‌ని ఆరోపించారు.

జ‌య‌ల‌లిత‌కు మ‌ధుమేహం ఉండేద‌ని.. అయిన‌ప్ప‌టికీ కావాల‌నే ఆమెకు శ‌శిక‌ళ‌, మ‌రికొంద‌రు ప‌లుమార్లు హ‌ల్వా తినిపించార‌ని ష‌ణ్ముగం ఆరోపించారు. దీంతో అమ్మ‌లో షుగ‌ర్ లెవ‌ల్స్ విప‌రీతంగా పెరిగాయ‌ని పేర్కొన్నారు. అనారోగ్యం కార‌ణంగా జ‌య‌ల‌లిత స‌హ‌జ‌ మ‌ర‌ణం చెందార‌ని అంద‌ర్నీ భ్ర‌మింప‌జేసేందుకే అలా ప‌దే ప‌దే హ‌ల్వా తినిపించార‌ని ఆరోప‌ణ‌లు గుప్పించారు. అమ్మ‌కు కార్డియాక్ అరెస్ట్ వ‌చ్చింద‌నేది అవాస్త‌వ‌మ‌ని తెలిపారు. కార్డియాక్ అరెస్టు బారిన‌ప‌డితే ఆస్ప‌త్రి వ‌రండాలో ర‌క్తం ఎలా చిందింద‌ని మంత్రి ప్ర‌శ్నించారు.

జైల్లో ఉన్న శ‌శిక‌ళ‌ను గ‌ట్టిగా విచారిస్తే పుర‌చ్చి త‌లైవి హ‌త్య‌కు సంబంధించి లోతైన వాస్త‌వాలు వెలుగులోకి వ‌స్తాయ‌ని ష‌ణ్ముగం అభిప్రాయ‌ప‌డ్డారు. అన్నా డీఎంకే పార్టీకి చెందిన రెండాకుల గుర్తును త‌మ‌కు కేటాయించాలంటూ పోరాడుతున్న టి.టి.వి.దిన‌క‌ర‌న్ పై మంత్రి విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. రెండాకుల గుర్తును నాశ‌నం చేసేందుకు దిన‌క‌ర‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఆయ‌న క‌ల‌లు ఎప్ప‌టికీ నెర‌వేర‌వ‌ని పేర్కొన్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English