సర్జికల్ స్ట్రైక్స్-2.. సిద్ధు సంచలన వ్యాఖ్యలు

సర్జికల్ స్ట్రైక్స్-2.. సిద్ధు సంచలన వ్యాఖ్యలు

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో నెమ్మదిగా ఆలోచన మారుతోంది. మన వాయుసేన చేసిన మెరుపు దాడితో 350 మంది దాకా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు గట్టి ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి విషయంలో మొదట్లో అందరూ ఆహా ఓహో అన్నారు. కానీ ఇప్పుడు ఆ దాడుల విషయంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఈ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. మన వాళ్లు సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో అక్కడ ఉగ్రవాదుల్ని చంపారా లేక చెట్లు పీకారా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. భారత వాయుసేన బాలాకోట్‌లో ఉగ్రవాదుల్ని చంపిందనడానికి సాక్ష్యమేదని సిద్ధూ సూటిగా ప్రశ్నించాడు.

‘‘యుద్ధంలో ఎప్పుడూ కూడా ‘నిజం’ మొదటగా ఓడిపోతుంది. పాకిస్తాన్‌లో భారత్ నిర్వహించిన తీవ్రవాద వ్యతిరేక పోరులో వందలాది మంది తీవ్రవాదులను మట్టుబెట్టడం నిజమేనా? విదేశీ శత్రువుతో పోరాటం పేరుతో మన గడ్డపై మోసం బారిన పడుతోంది. మీరు తీవ్రవాదులను ఏరివేస్తున్నారా? లేక చెట్లు పీకుతున్నారా? ఇది ఎన్నికల గిమ్మిక్కేనా? 300 మంది తీవ్రవాదులు చనిపోయారంటున్నారు. అవునా? కాదా? ఇక ఇప్పుడు మీ ఉద్దేశం ఏమిటి?  ఆర్మీని రాజకీయాలకు వాడుకోవడం మానండి. దేశం ఎంత గొప్పదో సైన్యం కూడా అంతే గొప్పది’’ అని సిద్ధూ అన్నాడు. పుల్వామా దాడి జరిగిన అనంతరం అందరూ పాకిస్థాన్ మీద మండి పడుతుంటే.. కొందరు చేసిన తప్పులకు దేశాన్ని నిందించడం సమంజసమా అంటూ సిద్ధూ పాక్ పట్ల సానుభూతి వ్యక్తం చేయడం తీవ్ర దుమారం రేపింది. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో ఆయన సందేహాలు వ్యక్తం చేయడం ద్వారా మరోసారి వార్తల్లోకి వచ్చాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English