ఆ ఇద్ద‌రిని ఓటు వేయ‌కుండా కాంగ్రెస్ ఆప‌గ‌ల‌దా?

ఆ ఇద్ద‌రిని ఓటు వేయ‌కుండా కాంగ్రెస్ ఆప‌గ‌ల‌దా?

ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా వ‌స్తున్న ఎన్నిక‌ల ప‌రంప‌ర‌లో తాజాగా తెలంగాణ‌లో ఎమ్మెల్యేల కోటాలో జ‌రిగే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల హ‌డావుడి న‌డుస్తోంది. మొత్తం ఐదు స్థానాల‌కు సాగుతున్న ఈ ఎన్నిక‌ల్లో అధికార పార్టీకి నాలుగు స్థానాల్లో పోటీ చేసే వీలుంది. అయితే.. వ్యూహ నైపుణ్యంతో ప్ర‌త్య‌ర్థుల‌కు షాకులిచ్చే అల‌వాటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇందుకు త‌గ్గ క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

తాను అనుకున్న‌ట్లుగా ఐదు స్థానాల్ని త‌మ వ‌శం చేసుకోవ‌టానికి చేయాల్సిన ప్ర‌య‌త్నాల్ని ఇప్ప‌టికే చేసి ఉంచారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు రేగ కాంతారావు.. ఆత్రం స‌క్కులు ఇప్ప‌టికే పార్టీకి గుడ్ బై చెప్పేసి టీఆర్ఎస్ లోకి చేర‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. శాంపిల్ గా ఇప్ప‌టికి బ‌య‌ట‌ప‌డింది ఇద్ద‌రే కానీ.. మ‌రికొంద‌రు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నాటికి బ‌య‌ట‌కు వ‌స్తార‌ని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే..  రెండోసారి ముఖ్య‌మంత్రి అయ్యాక కూడా కేసీఆర్ గ‌తంలో మాదిరి వ్య‌వ‌హ‌రించ‌టాన్ని విప‌క్ష నేత‌లు త‌ప్పు ప‌డుతున్నారు. త‌మ‌కు అవ‌కాశం లేని ఎమ్మెల్సీ సీటు మీద కేసీఆర్ ఎందుకు దృష్టి సారిస్తున్నారు?  అని వారు మండిప‌డుతున్నారు. స్పీక‌ర్.. డిప్యూటీ స్పీక‌ర్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా తాము హుందాగా వ్య‌వ‌హ‌రించినా కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఉత్త‌మ్ ఫైర్ అవుతున్నారు.

త‌మ‌కు న్యాయంగా రావాల్సిన ఎమ్మెల్సీ సీటును త‌మ సొంతం చేసుకోనున్న‌ట్లుగా ఉత్త‌మ్ లాంటి వాళ్లు చెబుతున్నా.. అందుకు అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్న‌ట్లు చెప్పాలి. పార్టీ మారుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని స్పీక‌ర్ ను కోరాల‌ని కాంగ్రెస్ నేత‌లు భావిస్తున్నారు. ఇరువురు ఎమ్మెల్యేల‌ను ఓటింగ్ కు దూరంగా ఉంచాల‌న్న ఆలోచ‌న‌లో తెలంగాణ కాంగ్రెస్ ఉన్న‌ప్ప‌టికీ ప్రాక్టిక‌ల్ గా అది వ‌ర్క్ వుట్ కాక‌పోవ‌చ్చ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఒక‌వేళ విప్ జారీ చేసినా.. ఇద్ద‌రు ఎమ్మెల్యేలు తెగించి అధికార ప‌క్షానికి ఓటేసినా.. అంతిమంగా నిర్ణ‌యం తీసుకోవాల్సింది స్పీక‌ర్ పైనే. అలాంట‌ప్పుడు ఆయ‌న ఎప్పుడు నిర్ణ‌యం తీసుకుంటారో చెప్ప‌లేని ప‌రిస్థితి. ఒక‌వేళ ఇబ్బందిక‌ర ప‌రిస్థితి వ‌స్తే.. ఎమ్మెల్యేల ఇద్ద‌రి చేత రాజీనామా చేయించి ఎన్నిక‌ల బ‌రిలో దింపే యోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఎలా చూసినా.. పార్టీ మార‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన ఇద్ద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటు వేయ‌కుండా నిలువ‌రించ‌టం సాధ్యం కాద‌ని చెబుతున్నారు. కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల‌తో హ‌డావుడి చేయ‌టం త‌ప్పించి.. ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఓటు వేయ‌ని రీతిలో పావులు క‌ద‌ప‌టం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English