ఐదు నిమిషాల కూడా రాజ‌కీయాలు ఆప‌లేవా మోడీ?

ఐదు నిమిషాల కూడా రాజ‌కీయాలు ఆప‌లేవా మోడీ?

ఇటీవ‌లి కాలంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీపై సునిశిత విమ‌ర్శ‌లు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మ‌రోమారు మండిపడ్డారు. ప్ర‌ధాన‌మంత్రి తీరును ఆయ‌న ప్ర‌శ్నించారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత దేశమంతా ఒక్కతాటిపై నిలబడాలని పిలుపునిచ్చిన ప్రధాని మోడీ. తాను మాత్రం ఆ పని చేయలేకపోతున్నారని ఆరోపించారు. మహారాష్ట్రలోని ధూలెలో జరిగిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ``పుల్వామా దాడి తర్వాత ప్రభుత్వాన్ని ఏ ఒక్కరూ విమర్శించొద్దని పార్టీ నేతలు, కార్యకర్తలకు చెప్పాను. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఉమ్మడిగా పోరాడాలని హితవు చెప్పా. కానీ మోడీ దీనికి భిన్నం` అని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీకి, ప్ర‌ధాని మోడీకి పొంత‌నే లేద‌ని రాహుల్ అన్నారు. ``పుల్వామా ఉగ్ర దాడి తర్వాత భారత్ ఐక్యంగా ఉందని మోడీ చెబుతారు. ఆ వెంటనే (ఢిల్లీలో) జాతీయ యుద్ధ స్మారకం ప్రారంభంలో మమ్ముల్ని విమర్శిస్తారు. ఈ దేశ ప్రధాని కేవలం ఐదు నిమిషాలైనా రాజకీయం చేయకుండా ఆపలేరు. ఆయనకు, కాంగ్రెస్ పార్టీకి మధ్య గల తేడా ఇదే`` అని పేర్కొన్నారు. మిలిటరీ యుద్ధ విమానాలను తయారు చేసే సామర్థ్యం గల హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)ను కాదని కాగితపు విమానాలను కూడా తయారు చేయని అనిల్ అంబానీ సారథ్యంలోని సంస్థకు రాఫెల్ యుద్ధ విమాన కాంట్రాక్ట్‌ను కట్టబెట్టారని మోడీపై రాహుల్ మండిపడ్డారు.

మ‌రోమారు పెద్ద నోట్ల ర‌ద్దును ఆయ‌న ప్ర‌స్తావించారు. పెద్దనోట్లను రద్దుతో బ్యాంకుల ముందు డబ్బు కోసం బారులు తీరింది మాత్రం సామాన్యులేనని రాహుల్ గుర్తుచేశారు. కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో మోదీ, పీయూ ష్ జీ ప్రతి కుటుంబానికి రోజుకు రూ.17 ఇచ్చారని మాకు అర్థమైంది. కుటుంబంలో ఒక్కో సభ్యుడికి రోజుకు రూ.3.5 మాత్రమే ఇచ్చారు. ఒకవైపు కార్పొరేట్లు బ్యాంకుల వద్ద తీసుకున్న రూ.3.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేస్తారు. మరోవైపు రైతుల కుటుంబ సభ్యులకు రూ.3.5 ఇస్తారు అని ఎద్దేవా చేశారు. అదీ కూడా ఐదెకరాలలోపు భూమి గల రైతులకే ఈ పథకం వర్తిస్తుందన్నారు. పేదలకు కనీస ఆదాయం ఇస్తామన్న తన వాగ్దానాన్ని రాహుల్‌గాంధీ పునరుద్ఘాటించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English