సమీక్ష – మంచి రోజులు వచ్చాయి

2/5

142 MInutes   |   Romance - Comedy   |   04-11-2021


Cast - Santosh Sobhan, Mehreen, Ajay Ghosh, Vennela Kishore, Praveen, Viva Harsha And Others

Director - Maruthi

Producer - SKN

Banner - V Celluloid, Mass Movie Makers

Music - Anoop Rubens

శిఖరాన్ని అధిరోహించిన తరువాత వీలైతే అక్కడ నిలదొక్కుకోవాలి. లేదంటే జాగ్రత్తగా కిందకు దిగాలి. అంతే గానీ దభాల్న జారిపోకూడదు. సింగిల్ మీనింగ్, డబుల్ మీనింగ్ డైలాగులతో విజయాలు సాధించినా మంచి పేరు రాలేదు దర్శకుడు మారుతి. కాన్సెప్ట్ సినిమాలు తీయడం ప్రారంభించిన తరువాత ఆయన తనకు అంటూ ఓ బ్రాండ్ ను తయారుచేసుకున్నారు. ఏదో ఒక పాయింట్ తో కథను అల్లేసి, కామెడీని ముడేసి, మినిమమ్ గ్యారంటీ సినిమాలు అందించగలరు అనిపించుకున్నారు. ప్రతి రోజూ పండగ సినిమాతో ఎమోషనల్ టచ్ కూడా డీల్ చేసేసారు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి ఓ చిన్న సినిమా తీసి, తన పేరు ను తానే చెరిపేసుకునేంత తప్పు చేసారు.

కరోనా సెకెండ్ ఫేస్ లో నెల రోజుల్లో ఓ చిన్న సినిమా చేసేయాలన్న హడావుడిలో అసలు తాను అనుకున్న సబ్జెక్ట్ ఏమిటో? తాను చేస్తున్న సినిమా ఏమిటో? దానికి తీసుకున్న నటులెవరో? ఇలాంటివి ఏమీ పట్టనంత వేగంతో తీసుకుంటూ పోయారు. అసలు అలా తీసిన సినిమా కథేంటీ?

ఓ కాలనీలో అతి భయస్థుడు గోపాలం (అజయ్ ఘోష్). ఆయనకు ఓ కూతురు (మెహరీన్). గోపాలం ఇంటి పక్కన వుండే లంబు, జంబుల్లాంటి ఇద్దరు టుమ్రీ కమెడియన్లు అతగాడు ప్రశాంతంగా, హాయిగా బతికేయడం చూసి కుళ్లుకుని, చెరో చెవిలో జోరీగల్లా చేరి, నానా గత్తర మాటలు చెబుతూ వుంటారు. ఇతగాడు అవి చెవికి ఎక్కించుకుని టెన్షన్ పడిపోతూ వుంటాడు. దీనికి తోడు అతగాడి కూతరు నిజంగానే ఓ కుర్రాడిని (సంతోష్ శోభన్) ప్రేమిస్తుంది. ఇంకేం వుంది. గోపాలం భయం కాస్తా అనుమానంగా మారిపోతుంది. ఆ అనుమానం పెనుభూతమై గుండె జబ్బు, ఆపై కరోనా ఇలా నానా వంకలు తిరుగుతుంది. చివరకు ఏమయింది అన్నది మిగిలిన సినిమా.

కరోనా గ్యాప్ లో ఓ సినిమా తీసేయాలన్న ఆత్రుతలో దర్శకుడు మారుతి స్క్రిప్ట్ మీద గట్టిగా వర్క్ చేసినట్లు లేదు. స్క్రిప్ట్ లో లోపాలను అస్సలు చూసుకున్నట్లు లేదు. అసలు స్క్రిప్ట్ ఏ దిశగా వెళ్తోంది అన్నది పట్టించుకున్నట్లు లేదు. పైగా చిన్న సినిమాగా తీయాలన్న తాపత్రయంతో దొరికిన వాళ్లను దొరికినట్లు తీసుకువచ్చి, నిల్చోపెట్టేసారు. వడ్లమాని శ్రీనివాస్, కోటీశ్వరరావు లాంటి నటులు ఎంత ఇరిటేట్ చేయాలో అంతా చేసారు.

ఇప్పటి వరకు మారుతి సినిమాల్లో వీక్ నెస్ లు అన్నీ హీరోలకే. ఇప్పుడు ఇక్కడ మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి. అందుకే అదే లీడ్ క్యారెక్టర్ అయింది. అజయ్ ఘోష్ మంచి నటుడే. కానీ అలాంటి నటుడిని లీడ్ క్యారెక్టర్ లో రెండు గంటలకు పైగా ప్రేక్షకులు భరించడం కష్టం. హీరోకి పెద్దగా క్యారెక్టర్ లేదు అని చిన్న హీరోను తీసుకున్నారు. దాంతో ఆ క్యారెక్టర్ మరింత చిన్నదైపోయింది.

అసలు మారుతి అనుకున్న కాన్సెప్ట్ అతి భయం. కానీ సినిమా ప్రారంభమైన కొద్ది సేపటికే అది అనుమానంగా మారిపోయింది. కూతురు విషయంలో తప్ప మరే విషయంలో ఈ అనుమానం వుండదు. భయమూ వుండదు. అతి భయాన్ని ఎలా పోగొట్టాలో అన్నిది క్లారిటీ లేదు. భయాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో నానా గత్తర చేసారు కానీ భయాన్ని స్మూత్ గా పొగొట్టలేకపోయారు. నాలుగు డైలాగులతో పోయే భయం అయితే అంత హంగామా చేయడం ఎందుకు?

సినిమాలో హీరో హీరోయిన్ ట్రాక్ ను ఆరంభం నుంచే యూత్ ఫుల్ గా చూపించాలన్న తాపత్రయం కనిపించింది. యూత్ ఫుల్ అంటే ముద్దులు అడగడం, హగ్ కోసం తాపత్రయపడడం అన్న దగ్గరే మారుతి ఆగిపోయారు. అంతకుమించి ఓ మాంచి ఫీల్ లేదా రొమాంటిక్ డయిలాగ్ ను ఆయన రాయలేకపోయారు. హీరో అండ్ కమెడియన్ ఫ్రెండ్స్ నడుమ కూడా సరైన నవ్వుల క్రాకర్స్ పేల్చలేకపోయారు. మారుతి బ్రాండ్ అయిన కామెడీ ఆ విధంగా అక్కడ ఫెయిలయింది.

కీలకమైన గుండు గోపాలం క్యారెక్టర్ దగ్గరకు వచ్చేసరికి అతగాడి పక్కన ఇద్దరు నటులను పెట్టి చేసిన కామెడీ అసలు పండలేదు. పలు సీన్లలో వడ్లమాని శ్రీనివాస్ హావభావాలు చూసి తల పట్టుకోవాల్సిందే. అతగాడిని చివరకు వచ్చేసరికి ఏకంగా విలన్ గా మార్చేసాడు. స్క్రిప్ట్ ను ఏ రోజుకు ఆరోజు అల్లుకున్నారేమో అనిపిస్తుంది ఇలాంటి వ్యవహారాలు చూస్తుంటేనే.

తొలిసగమే భారం అనుకుంటే మలిసగం శిరోభారం అయిపోయింది. ఇలాంటి సినిమాలో హీరో, హీరోయిన్లు పేరుకు మాత్రమే. అజయ్ ఘోష్ భయం అనే హడావుడికే. ప్రవీణ్, సప్తగిరి, సుదర్శన్ కామెడీకి ఓ నమస్కారం. వెన్నెల కిషోర్ కు ఓ సరైన క్యారెక్టర్ కూడా రాసుకోలేకపోయారు. టెక్నికల్ గా సినిమా ఓకె. అనూప్ పాటలు ఓకె. నేపథ్యసంగీతం మరీ లౌడ్ గా వుంది.

మొత్తం మీద దీపావళి బాంబులా పేలుతుంటే, వర్షంలో నానిపోయిన టపాసులా తుస్సమనిపోయింది

ప్లస్ పాయింట్లు

అక్కడక్కడ నవ్వులు

మైనస్ పాయింట్లు

వీక్ స్క్రిప్ట్
స్టార్ కాస్ట్

పంచ్ లైన్: ‘రోజులు’ బాలేవు