మ‌రో రికార్డు బ్రేక్ చేసిన ముకేశ్ అంబానీ..తొలిసారి టాప్ టెన్ లో!

మ‌రో రికార్డు బ్రేక్ చేసిన ముకేశ్ అంబానీ..తొలిసారి టాప్ టెన్ లో!

ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ.. విజ‌య‌మే త‌ప్పించి.. వెన‌క్కి చూసుకోవ‌టం అల‌వాటు లేని రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ ఛైర్మ‌న్ ముకేశ్ అంబానీ మ‌రో రికార్డును బ్రేక్ చేశారు. ప్ర‌పంచ అగ్ర‌శ్రేణి టాప్ టెన్ కుబేరుల్లో ఒక‌రుగా అవ‌త‌రించారు. తొలిసారి ఈ చోటును సంపాదించినట్లుగా ద హ్యుర‌న్ గ్లోబ‌ల్ రిచ్ లిస్ట్ 2019 పేర్కొంది.

రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ షేర్లు రాణించటంతో ముకేశ్ ఒక్క‌సారిగా ప్ర‌పంచ కుబేరుల్లో టాప్ టెన్ లో చోటు సాధించార‌ని చెప్పాలి. గ‌త నెల‌లో ఆర్ఐఎల్ మార్కెట్ విలువ ఏకంగా రూ.8ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకోవ‌టంతో ముకేశ్ వ్య‌క్తిగ‌త ఆస్తులు భారీగా పెరిగాయి. రిల‌య‌న్స్ లో ముకేశ్ కు 52 శాతం వాటా ఉన్న విష‌యం తెలిసిందే.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ముకేశ్ అంబానీ ఆస్తులు అంత‌కంత‌కూ పెరిగిపోతుంటే.. ఆయ‌న సోద‌రుడు అనిల్ అంబానీ ఆస్తులు అంత‌కంత‌కూ త‌గ్గిపోతున్నట్లుగా పేర్కొంది. ఎరిక్ స‌న్ కు రూ.540 కోట్ల బ‌కాయిలు చెల్లించ‌ని కార‌ణంగా సుప్రీంకోర్టు నుంచి అరెస్ట్ హెచ్చ‌రిక‌లు అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఆస్తులు పంచుకుంటూ అన్న‌ద‌మ్ములు విడిపోయిన త‌ర్వాత అనిల్ నిక‌ర ఆస్తులు భారీగా త‌గ్గిన‌ట్లుగా చెప్పింది. ఏడేళ్ల క్రితం అనిల్ ఆస్తులు 7 బిలియ‌న్ డాల‌ర్లు ఉంటే.. తాజాగా ఆయ‌న సంప‌ద 5 బిలియ‌న్ డాల‌ర్లు త‌గ్గి 1.9 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకుంది.

ప్ర‌పంచ టాప్ టెన్ కుబేరుల జాబితాలో తొలి స్థానంలో అమెజాన్ అధిప‌తి జెఫ్ బెజోస్ రెండోసారిఅగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నారు. ఆయ‌న నిక‌ర ఆస్తి 147 బిలియ‌న్ డాల‌ర్లుగా పేర్కొన్నారు. అయితే.. ఆయ‌న త‌న భార్య‌కు విడాకులు ఇవ్వ‌టం.. భ‌ర‌ణంగా భారీ మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధం కానున్న నేప‌థ్యంలో.. అదే జ‌రిగితే ఆయ‌న మొద‌టి స్థానం నుంచి మార‌క త‌ప్ప‌దు.

రెండో స్థానంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ 96 బిలియ‌న్ డాల‌ర్లు.. మూడో స్థానంలో వారెన్ బ‌ఫెట్ 88 బిలియ‌న్ డాల‌ర్లు.. నాలుగో స్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్డ్‌ 86 బిలియ‌న్ డాల‌ర్లు.. ఐదో స్థానంలో ఫేస్ బుక్ అధినేత జుక‌ర్ బ‌ర్గ్ 80 బిలియ‌న్ డాల‌ర్ల‌తో ఉన్నారు. భార‌త కుబేరుల్లో అంబానీ ప‌దో స్థానంలో నిల‌వ‌గా.. ఆయ‌న త‌ర్వాత ఉన్న వారిలో హిందుజా గ్రూప్ ఛైర్మ‌న్ ఎస్ పి హిందుజా 21 బిలియ‌న్ డాల‌ర్లు.. విప్రో ఛైర్మ‌న్ అజిజ్ ప్రేమ్ జీ 17 బిలియ‌న్ డాల‌ర్ల‌తో నిలిచారు.

ఇక‌.. భార‌త మ‌హిళా కుబేరుల్లో గోద్రెజ్ కుటుంబంలో మూడో త‌రం వార‌సులైన స్మిత్ క్రిష్ణ్ తొలి స్థానంలో నిలిచారు. ఆమె నిక‌ర ఆస్తులు 6.1 బిలియ‌న్ డాల‌ర్లు. సొంతంగా ఎదిగిన మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌గా కిర‌ణ్ మ‌జుందార్ షా 3.5 బిలియ‌న్ డాల‌ర్ల‌తో నిలిచారు. ఈ ఏడాది మొత్తం కుబేరుల సంఖ్య గ‌త ఏడాదితో పోలిస్తే త‌గ్గింది. గ‌త ఏడాది కుబేరుల సంఖ్య 2694 కాగా.. ఈసారి 2470కు ప‌రిమిత‌మైంది. ప్ర‌పంచంలోని 2470 మంది కుబేరుల మొత్తం 9.5ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లుగా అంచ‌నా వేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English