‘యన్.టి.ఆర్’ గురించి బాబును రాహుల్ అడిగితే..

‘యన్.టి.ఆర్’ గురించి బాబును రాహుల్ అడిగితే..

మొత్తానికి ‘యన్.టి.ఆర్’ సినిమాలో రెండో భాగం కూడా రిలీజైపోయింది. ప్రధానంగా ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం మీద తీసిన ‘మహానాయకుడు’ సినిమా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో ఏముంటాయని అనుకున్నారో అవే ఉన్నాయి. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం.. ఎన్నికల ప్రచారం.. 1983 ఎన్నికల్లో అద్భుత విజయం.. ఆపై నాదెండ్ల చేతిలో వెన్నుపోటు.. తిరిగి ఆయన ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడం.. చివరగా బసవతారకం మరణంతో ముగింపు.. ఇలా సాగిందీ సినిమా. తెలుగుదేశం పార్టీకి.. చంద్రబాబుకు ఏ రకమైన ఇబ్బంది రాకుండా కన్వీనియెంట్‌గా సినిమా తీసుకున్నారు. అనుకున్న ప్రకారమే నాదెండ్లను విలన్ని చేశారు. ఐతే నాదెండ్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన్ని ఎలా చూపించినా ఏమీ చేయలేడు. ఈ విషయంలో బాలయ్యకు కానీ.. చంద్రబాబుకు కానీ వచ్చిన ఇబ్బందేమీ లేదు.

కానీ సినిమాలో కాంగ్రెస్ పార్టీని కూడా విలన్‌గా చూపించారు. కొన్ని నెలల ముందు వరకైతే ఈ విషయంలోనూ ఇబ్బంది లేదు. కానీ తెలంగాణ ఎన్నికల సందర్భంగా పరిస్థితులు మారాయి. కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది. ఆ పార్టీ అధినాయకత్వంతో చంద్రబాబు చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. ముఖ్యంగా రాహుల్‌కు బాగా క్లోజ్ అయ్యాడు. ఐతే ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’లో రాజకీయాల ప్రస్తావన తక్కువ. కాంగ్రెస్ మీద పెద్దగా సెటైర్లేమీ పడలేదు. కానీ ‘మహానాయకుడు’లో కాంగ్రెస్ పార్టీని దోషిని చేశారు. నాదెండ్లతో పాటు ఇందిరా గాంధీని విలన్ లాగా చూపించారు. ఒక చోట అయితే కాంగ్రెస్ పార్టీ ఏపీలో ముఖ్యమంత్రుల్ని పదే పదే మార్చడంపై ‘‘కొత్త బట్వాడా ముఖ్యమంత్రి వచ్చాడురా’’ అనే సెటైర్ కూడా పడింది. ఐతే మారిన రాజకీయ పరిస్థితుల్లో ఇలాంటి సెటైర్లు కాంగ్రెస్-టీడీపీ దోస్తీకి ఇబ్బందికరమే. ఈ సినిమా గురించి రాహుల్‌కు కాంగ్రెస్ నేతలు సమాచారం ఇవ్వకుండా ఉండరు. మరి రేప్పొద్దున రాహుల్‌ను చంద్రబాబు కలిసినపుడు ఈ సినిమాలో తమ పార్టీని విలన్‌గా చూపించడంపై అడిగితే బాబు ఏం సమాధానం చెబుతాడో?


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English