ఎన్నిక‌లు ముగిసినా!... తాయిలాలు ఆగట్లేదు!

ఎన్నిక‌లు ముగిసినా!... తాయిలాలు ఆగట్లేదు!

తెలంగాణ‌లో ఇప్ప‌టికే ఎన్నిక‌లు ముగిశాయి. తొలి సారి ద‌క్కిన సీఎం కుర్చీలో ఐదేళ్ల పాటు పూర్తి కాలం కూర్చోకుండానే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లిన కేసీఆర్‌... రెండో ద‌ఫా కూడా బంప‌ర్ విక్ట‌రీ సాధించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా పెద్ద‌గా హామీలేమీ ఇవ్వ‌కుండానే... తాము ఏం చేశామ‌న్న వాటితోనే ప‌ని కానిచ్చేసిన కేసీఆర్... ఎన్నిక‌లు ముగిసి త‌న‌కు అధికార ప‌గ్గాలు ద‌క్కిన త‌ర్వాత త‌న‌దైన శైలి సంక్షేమానికి తెర తీశార‌ని చెప్పాలి. కాసేప‌టి క్రితం అసెంబ్లీలో 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన ఓటాన్ అఔంట్ బ‌డ్జెట్ ను స్వ‌యంగా కేసీఆరే ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ ఏ ఒక్క‌రూ ఊహించ‌ని విధంగా సంక్ష‌మ ప‌థ‌కాల ప‌రిధిని పెంచేశారు.

గ‌డ‌చిన ఎన్నికల్లో త‌న విక్ట‌రీలో కీల‌క భూమిక పోషించిన రైతు బంధు ప‌థ‌కాన్ని ఒక్కో రైతుకు ఇప్పుడు ఇస్తున్న రూ.8,000 ను ఎవ‌రూ అడక్కుండానే రూ.10 వేల‌కు పెంచేశారు. ఇక ఎన్నిక‌లకు ముందు ప్ర‌క‌టించినట్టుగా నిరుద్యోగ భృతిని ప్ర‌క‌టించిన కేసీఆర్‌... ఒక్కో నిరుద్యోగికి నెల‌కు రూ.3,016ను అందించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఇందుకోసం బ‌డ్జెట్ లో రూ. 1,810 కోట్లు కేటాయించారు. ఇప్ప‌టిదాకా ఇస్తున్న ఆస‌రా పింఛ‌న్ల మొత్తాన్ని రూ.1,000 నుంచి రూ.2016కు పెంచారు. ఇందుకోసం బ‌డ్జెట్ లో రూ. 12,067 కోట్లను కేటాయించారు. దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్లు రూ.1500 నుంచి రూ.3016కు పెంచిన కేసీఆర్‌... దీని కోసం బడ్జెట్‌లో రూ.12వేల కోట్లను కేటాయించారు. పెన్షన్‌ వయసు 60 నుంచి 57 ఏళ్లకు తగ్గించేసి ఔరా అనిపించేశార‌నే చెప్పాలి.

ఇక కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ప‌థ‌కం కోసం ఏకంగా రూ. 1450 కోట్లు కేటాయించిన కేసీఆర్‌... ఈ ద‌ఫా కూడా త‌న ప్ర‌భుత్వం సంక్షేమ బాట‌లోనే కొన‌సాగుతుంద‌ని చెప్ప‌కనే చెప్పేశారు. బ‌డ్జెట్ ను స్థూలంగా ఓ సారి ప‌రిశీలిస్తే... పేరుకు ఓటాన్ అకౌంటే అయినా... అదిరూ. 1,82,017 కోట్లతో రూపొందింది. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 1,31,629 కోట్లు కాగా... మూలధన వ్యయం రూ. 32,815 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ మిగులు రూ. 6,564 కోట్లుగా ఉంటుంద‌ని అంచ‌నా వేసిన కేసీఆర్‌... ఆర్థిక లోటును రూ. 27,749 కోట్లుగా అంచనా వేశారు. మొత్తంగా ఎన్నిక‌ల వేళ సంక్షేమ మంత్రం ప‌ఠిస్తున్న నేత‌లున్న ప్ర‌స్తుత త‌రుణంలో ఎన్నిక‌లు ముగిసి అధికారం చేతికందిన త‌ర్వాత కూడా అదే బాట‌లో ప‌య‌నిస్తూ కేసీఆర్‌... త‌న‌ది భిన్న‌మైన మార్గ‌మేన‌ని నిరూపించుకున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English