కుర్ర ఎంపీకి కష్టాలు మొదలయ్యాయా?

కుర్ర ఎంపీకి కష్టాలు మొదలయ్యాయా?

ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు చంద్రబాబును కలవరపెడుతుండగా.. ఇప్పుడు మరో అంశం చంద్రబాబును భయపెడుతోంది. ఏపీలోని 25 లోక్ సభ నియోజకవర్గాల్లో గ్యారంటీగా టీడీపీ గెలుస్తందని చంద్రబాబు, టీడీపీ నమ్మే నియోజకవర్గాల్లో శ్రీకాకుళం ఒకటి. కానీ.. తాజా రాజకీయ పరిణామాలు చంద్రబాబులో ఆ నమ్మకాన్ని పోగొడుతున్నాయట. కారణం.. మాజీ ఎంపీ కిల్లి కృపారాణి వైసీపీలో చేరడమే.

శ్రీకాకుళం నియోజకవర్గంలో 2014లో కింజరాపు రామ్మోహననాయుడు గెలిచారు. పార్లమెంటులో పలు సందర్భాల్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో ఆయన ఆవేశంగా మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. యువకుడిగా, నలుగురిలో కలిసిపోయే తత్వం ఉన్నవాడిగా, అన్నిటికీ మించి దివంగత నేత ఎర్రన్నాయుడి తనయుడిగా ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారు అంతా. వైసీపీ నుంచి బలమైన పోటీ లేకపోవడం దానికి కారణమైంది. ఇంతవరకు వైసీపీ నుంచి శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి దువ్వాడ శ్రీనివాస్, తమ్మినేని సీతారాం పేర్లు వినిపించేవి. కానీ, తమ్మినేని ఆసక్తి చూపకపోవడంతో దువ్వాడ శ్రీనివాస్ ఒక్కరే పోటీలో నిలిచారు. దాంతో దువ్వాడ... రామ్మోహన్ నాయుడికి పోటీ కాలేరని అంతా ఫిక్సయిపోయారు.

కానీ.. తాజాగా కిల్లి కృపారాణి వైసీపీలోకి రావడంతో సమీకరణలు మారిపోయాయి. 2009లో ఎర్రన్నాయుడిని ఓడించిన కృపారాణి అక్కడ బలమైన అభ్యర్థి. ఆర్థికంగా, సామాజికవర్గపరంగా ఆమె గట్టి పోటీ ఇస్తారని భావిస్తున్నారు.  నిజానికి 1996లో ఎర్రన్నాయుడు శ్రీకాకుళం ఎంపీగా గెలవడానికి ముందు కృపారాణి సామాజికవర్గానిదే ఆ జిల్లాలో.. ఆ లోక్ సభ నియోజకవర్గంలో పైచేయి. 1952 నుంచి 1996 వరకు ఆ సామాజికవర్గ నేతలే గెలుస్తూ వచ్చారు. మధ్యలో 1967లో ఒక్కసారి మాత్రం గౌతు లచ్చన్న గెలిచారు. మిగతా 9 సార్లూ కృపారాణిసామాజిక వర్గానిదే శ్రీకాకుళం ఎంపీ సీటు. కానీ. 1996లో ఎర్రన్నాయుడు గెలిచినప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. ఆయన 2004 వరకు నాలుగుసార్లు వరుసగా గెలుస్తూ వచ్చారు. ఆయన సామాజికవర్గం వేరు. 2009లో కృపారాణి మళ్లీ ఆ ఎర్రన్నాయుడి హవాను బ్రేక్ చేస్తూ ఆ సామాజికవర్గానికి చెక్ పెట్టారు.

కానీ.. 2014 ఎన్నికలకు ముందు ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించడం.. రాష్ట్ర విభజన జరిగి కాంగ్రెస్ అంటే ఏపీలో ఏహ్య భావం రావడంతో 2014లో ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు సులభంగా గెలిచారు. నియోజకవర్గంలో ఆయన పెద్దగా పట్టు సాధించపోయినా సింపథీ మాత్రం సంపాదించుకున్నారు. దాంతో 2019 ఎన్నికల్లోనూ ఆయన గెలుపు తధ్యం అని నిన్నమొన్నటి వరకు అనుకున్నారు. అలాంటిది ఇప్పుడు కృపారాణి వైసీపీలో చేరడంతో పోటీ మొదలైంది. బలమైన సామాజికవర్గం కావడంతో పాటు పలాస, పాతపట్నం, శ్రీకాకుళం, ఇచ్చాపురం, నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ బలంగా ఉండడంతో రామ్మోహన్ నాయుడుకు చిక్కులు తప్పవనే మాట శ్రీకాకుళంలో బలంగా వినిపిస్తోందిప్పుడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English