కాశ్మీర్‌పై కమల్ షాకింగ్ కామెంట్స్

కాశ్మీర్‌పై కమల్ షాకింగ్ కామెంట్స్

లోకనాయకుడు కమల్ హాసన్ ఇప్పుడు కేవలం నటుడు కాదు. ఆయన రాజకీయ నాయకుడు. కాబట్టి సినిమాల కంటే కూడా సామాజిక, రాజకీయ అంశాలపై ఎక్కువగా స్పందిస్తున్నాడు. తాజాగా ఆయన చెన్నైలో జరిగిన కార్యక్రమంలో భాగంగా కాశ్మీర్ సమస్యపై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. పుల్వామా ఉగ్రవాద దాడిలో 40 మందికి పైగా భారతీయ జవాన్లు ప్రాణాలు విడిచిన నేపథ్యంలో దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

ఈ దాడి వెనుక పాకిస్థాన్ హస్తమున్న సంగతి బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం పాక్ పట్ల తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శిస్తోంది. ఇలాంటి సమయంలో కమల్.. పాకిస్థాన్ ఎప్పుడూ పాడే ఒక పాటను అందుకోవడం చర్చనీయాంశంగా మారింది.

సైన్యంలోకి వెళ్లే వాళ్లందరూ చావడానికే వెళ్తారనే భావన జనాల్లో ఉందని.. కానీ దేశాలు, ప్రాంతాల మధ్య గొడవలకు మనుషులు ఎందుకు చావాలంటూ కమల్ మంచి పాయింటే బయటికి తీశారు. ఐతే కాశ్మీర్ సమస్యకు పరిష్కారం అక్కడి ప్రజల చేతుల్లోనే ఉందని కమల్ అన్నాడు. తాము ఏ దేశంలో అంతర్భాగం కావాలి అనే విషయంలో కాశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని కమల్ అభిప్రాయపడ్డాడు. ఐతే పాకిస్థాన్ దశాబ్దాలుగా ఈ ‘రెఫరెండం’ మాటనే అస్త్రంలాగా ఉపయోగిస్తోంది.

కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాల్ని అడ్డుకునేందుకు భారత సైన్యం చాలా కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రజల్లో భారత ప్రభుత్వం పట్ల కూడా వ్యతిరేకత ఉంది. అలాగే అక్కడ ఉగ్రవాదుల ప్రభావం ఎలాంటిదో కూడా తెలిసిందే. అలాంటపుడు జనాలు విచక్షణతో ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తారనే నమ్మకాలు లేవు.

కాశ్మీర్ ఇండియాదే అయినపుడు మళ్లీ అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ ఏంటి అనే ప్రశ్న కూడా ఉంది. ఈ నేపథ్యంలో రెఫరెండంపై భారత్ ఎప్పుడూ సుముఖంగా లేదు. అందుకే పాకిస్థాన్ తరచుగా రెఫరెండం మాట ఎత్తి భారత్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తుంటుంది. అలాంటిది పాక్ పాడే పాటను కమల్ పాడటం మీద విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English