పుల్వామా మ‌రో ఘోరం - న‌లుగురు జ‌వాన్ల వీర‌మ‌ర‌ణం!

పుల్వామా మ‌రో ఘోరం - న‌లుగురు జ‌వాన్ల వీర‌మ‌ర‌ణం!

42 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్ల వీర‌మ‌ర‌ణం తాలూకు చేదు జ్ఞాప‌కాల నుంచి భార‌తావ‌ని తేరుకోక‌ముందే పుల్వామాలో మ‌రో ఘోరం చోటుచేసుకుంది. ఉగ్ర ర‌క్క‌సి కోర‌లు చాచి మ‌రో న‌లుగురు జ‌వాన్ల‌ను బ‌లి తీసుకుంది. ఓ పౌరుడినీ పొట్ట‌న పెట్టుకుంది. దీంతో యావ‌త్ దేశం మ‌రోసారి దిగ్భ్రాంతికి గురైంది.

పుల్వామా ఉగ్ర దాడి అనంత‌రం భ‌ద్ర‌తా బ‌ల‌గాలు జ‌మ్మూక‌శ్మీర్ లో మ‌రింత అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. గ‌స్తీ పెంచాయి. ఇంటెలిజెన్స్ నివేదిక‌ల ఆధారంగా సోదాలను ముమ్మ‌రం చేశాయి. ఈ క్ర‌మంలో పుల్వామా జిల్లాలోని పింగ్లాన్ ప్రాంతంలో కొంత‌మంది ఉగ్ర‌వాదులు దాగి ఉన్నార‌ని నిఘా స‌మాచారం అందింది. దీంతో సోమ‌వారం తెల్ల‌వారుజామున బ‌ల‌గాలు రంగంలోకి దిగాయి.

55 రాష్ట్రీయ రైఫిల్స్‌, సీఆర్‌పీఎఫ్‌, స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్టాయి. లొంగిపోవాలంటూ ఉగ్ర‌వాదుల‌ను హెచ్చ‌రించాయి. కానీ - ఉగ్ర‌వాదులు మాట విన‌లేదు. దొంగ‌చాటుగా కాల్పుల‌కు తెగ‌బ్డారు. ఈ కాల్పుల్లో న‌లుగురు వీర‌మ‌ర‌ణం పొందారు. వారిలో ముగ్గురు జ‌వాన్లు కాగా, ఒక‌రు మేజ‌ర్ స్థాయి అధికారి. భ‌ద్ర‌తా బ‌ల‌గాలు కూడా దీటుగా కాల్పులు జ‌రిపాయి. ఉగ్ర‌వాదుల కాల్పుల్లో ఓ సాధార‌ణ పౌరుడు కూడా దుర్మ‌ర‌ణం పాలైన‌ట్లు తెలిసింది. ముగ్గురు ఉగ్రాదులు పింగ్లాన్ లో న‌క్కి కాల్పుల‌కు తెగ‌బ‌డుతున్న‌ట్లు స‌మాచారం.

ఉగ్ర‌వాదుల కాల్పుల్లో వీర మ‌ర‌ణం పొందిన వారిని డి.ఎస్‌.డోండియాల్ (మేజర్‌), సేవా రామ్ (హెడ్‌ కానిస్టేబుల్), అజ‌య్‌ కుమార్‌ (జవాను), హరిసింగ్ (జవాన్‌)గా అధికారులు గుర్తించారు. మృతిచెందిన పౌరుణ్ని ముస్తాక్ అహ్మ‌ద్ గా గుర్తించారు. గుల్జార్‌ అహ్మద్‌ అనే మరో జవాను ఉగ్ర‌వాదుల కాల్పుల్లో గాయ‌ప‌డిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English