వైసీపీ ఎమ్మెల్యేల్లో కొత్త టెన్ష‌న్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప‌రిణామాలు రోజుకో మ‌లుపు తిరుగుతున్నాయి. ఎప్ప‌టిక‌ప్పుడూ ప‌రిస్థితులు మారిపోతున్నాయి. ఇక అధికార పార్టీ వైసీపీలోనూ అదే ప‌రిస్థితి ఉంది. ఇప్పుడ‌క్క‌డ సీఎం జ‌గ‌న్ కొత్త‌గా ప్ర‌క‌టించే మంత్రివ‌ర్గంలో ఎవ‌రికి అవ‌కాశం ఉంటుంది? ఎవ‌రిని తొల‌గిస్తారు? ఎవ‌రిని కొన‌సాగిస్తారు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఇప్ప‌టికే మంత్రి ప‌ద‌వుల‌పై ఆశ పెట్టుకున్న వాళ్లు ఈ సారి ఆ అవ‌కాశం ద‌క్కుతుందా? అని.. మ‌రోవైపు మంత్రి ప‌ద‌విలో ఉన్న‌వాళ్లు ప‌ద‌వి ఉంటుందా? ఊడుతుందా? అనే టెన్ష‌న్‌లో ఉన్నారు. ఇది చాల‌ద‌న్న‌ట్లుగా ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలంద‌రిలోనూ కొత్త టెన్ష‌న్ స్టార్ట్ అయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అస‌లు త‌మ‌కు సీటు ద‌క్కుతుందా? లేదా అనే టెన్ష‌న్‌లో వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

2019 ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యంతో తొలిసారి సీఎం కుర్చీపై కూర్చున్న జ‌గ‌న్.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ అధికారాన్ని కాపాడుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అందుకు ఇప్ప‌టి నుంచే రంగం సిద్ధం చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రికి సీటు కేటాయించాలి? అనే అంశంపై నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఎమ్మెల్యేలు మంత్రుల ప‌నితీరుపై నివేదిక‌లు తెప్పించుకుని ప‌రిశీలిస్తున్నారు. మ‌రోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేల‌పై ప్ర‌జ‌ల్లో అసంతృప్తి ఉందనేది కాద‌న‌లేని నిజం. ఎన్నిక‌ల్లో విజ‌యం త‌ర్వాత వాళ్లు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల కంటే.. సొంత వ్యాపారాల‌పైనే ఎక్కువ దృష్టి పెట్టార‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సారి చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు టికెట్ దొర‌క‌డం క‌ష్ట‌మేన‌న్న ఊహాగానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మ‌రోవైపు జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చాక ఓ ర‌కంగా ఎమ్మెల్యేల‌కు ప‌ని లేకుండా పోయింద‌నే చెప్పాలి. సంక్షేమ ప‌థ‌కాల ప్ర‌యోజ‌నాల‌ను ఆన్‌లైన్ ద్వారా నేరుగా ప్ర‌జ‌ల‌కే అందిస్తుండ‌డంతో ఎమ్మెల్యేల‌కు ఏం ప‌ని లేకుండా పోయింద‌నే అభిప్రాయం ఉంది. మ‌రోవైపు నియోజ‌వ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్య‌లున్నా నిధుల లేమి వేధిస్తోంద‌ని స్వ‌యంగా ఆ పార్టీ ఎమ్యెల్యేలే మొర‌పెట్టుకుంటున్నారు. కానీ కొంత‌మంది ఎమ్మెల్యేలు మాత్రం స‌చివాల‌యాల సంద‌ర్శ‌న పేరుతో ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నారు. సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్నాయో లేదో తెలుసుకుంటున్నారు. అలాంటి నాయ‌కుల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ సీటు ద‌క్క‌డం ఖాయ‌మ‌నిపిస్తోంది.

ఇక ప్రశాంత్ కిషోర్ టీమ్ సూచ‌న‌ల నేప‌థ్యంలో ఏపీలోనూ ప‌శ్చిమ బెంగాల్ ఫార్మూలాను అమ‌లు చేసేందుకు జ‌గ‌న్ సుముఖంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. గ‌త రెండున్న‌రేళ్ల కాలంలో స్థానిక ఎమ్మెల్యేల‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త పెరిగింది. స‌ర్వేల్లో కూడా ఇదే తేలింది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ విజ‌యం కోసం ప‌ట్టుద‌ల‌తో ఉన్న జ‌గ‌న్‌.. ఎక్కువ స్థానాల్లో కొత్త అభ్య‌ర్థుల‌నే నిల‌బెట్టాల‌ని అనుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఈ ఏడాది ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లోనూ పీకే సూచ‌న మేర‌కు మ‌మ‌తా బెన‌ర్జీ ఎక్కువ స్థానాల్లో కొంత వాళ్ల‌కు అవ‌కాశమిచ్చి వ‌రుస‌గా మూడో సారి అధికారంలోకి వ‌చ్చారు. ఇప్పుడు ఏపీలోనూ జ‌గ‌న్ అదే బాట‌లో సాగేలా క‌నిపిస్తున్నారు.