ఈ పోరును!.. లోకేశే తీర్చాలి!

ఈ పోరును!.. లోకేశే తీర్చాలి!

రాయ‌ల‌సీమ‌లో కీల‌క జిల్లాగా ఉన్న కర్నూలు జిల్లా కేంద్రం క‌ర్నూలు అసెంబ్లీ టికెట్‌పై ఇప్పుడు టీడీపీలో పెద్ద పోరే న‌డుస్తోంది. ఓ వైపుప సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్ రెడ్డి.... ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో కూడా తానే టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగుతాన‌ని ప్ర‌కటించుకుంటే... కాదు ఈ ద‌ఫా త‌న కుమారుడు టీజీ భ‌ర‌త్ కు పార్టీ టికెట్ ద‌క్కుతుంద‌ని మాజీ మంత్రి, ప్ర‌స్తుతం పార్టీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న టీజీ వెంక‌టేశ్ ప్ర‌క‌టించుకున్న విష‌యం తెలిసిందే. క‌ర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా క‌ర్నూలు అసెంబ్లీ, పార్ల‌మెంటు స్థానాల్లో ఈ సారి సిట్టింగులే బ‌రిలోకి దిగుతార‌ని లోకేశ్ ఏదో య‌ధాలాపంగా చేసిన ప్ర‌క‌ట‌నతో ఇరు వ‌ర్గాలు ర‌చ్చ‌ర‌చ్చ‌కు దిగాయి.

తాజాగా ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైన నేప‌థ్యంలో నేడు ఇరు వ‌ర్గాలు కూడా వేర్వేరుగా మీడియా స‌మావేశాలు ఏర్పాటు చేసుకుని మ‌రోమారు వేడిని రాజేసుకున్నాయి. అయితే ఎస్వీ మోహ‌న్ రెడ్డి చేసిన కొత్త ప్ర‌తిపాద‌న ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి. ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో క‌ర్నూలు అసెంబ్లీ మంత్రి నారా లోకేశ్ పోటీ చేస్తే... తాను స్వ‌చ్ఛందంగా త‌ప్పుకుని సీటును త్యాగం చేస్తాన‌ని, జిల్లాలో మ‌రో సీటును కూడా అడ‌గ‌నంటూ కొత్త ప్ర‌తిపాద‌న చేశారు. అలా కాకుండా లోకేశ్ కాకుండా వేరే ఎవ‌రికి టికెట్ ఇస్తే ఒప్పుకునేది లేద‌ని కూడా ఆయ‌న త‌న‌దైన శైలి వ్యాఖ్య‌లు చేశారు. ఇక ఎస్వీ ప్రెస్ మీట్ ముగిసిన మ‌రుక్ష‌ణం రంగంలోకి దిగిన టీజీ కూడా మీడియా మీట్ పెట్టేశారు.

క‌ర్నూలు అసెంబ్లీ నుంచి లోకేశ్ పోటీ చేస్తానంటే అంత‌కంటే ఆనంద‌మేముంటుంద‌ని టీజీ వ్యాఖ్యానించారు. పార్టీని కాపాడుకుంటూ వ‌స్తున్న లోకేశ్ క‌ర్నూలు బ‌రిలోకి దిగితే... త‌మ సంపూర్ణ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. అదే స‌మ‌యంలో కర్నూలులో గెలుపు అవ‌కాశాలు త‌న కుమారుడికే ఉన్నాయ‌ని, పార్టీ అధిష్ఠానం కూడా త‌న కుమారుడికే టికెట్ ఇస్తుంద‌ని చెప్పారు. లోకేశ్ పోటీ చేస్తామంటూ త‌మ‌కేమీ ఇబ్బంది లేద‌ని, అయితే ఓడిపోయే ఇత‌ర వ్య‌క్తుల‌కు టికెట్ ఎలా ఇస్తార‌ని కూడా టీజీ ప్ర‌శ్నించారు. మొత్తంగా ఈ కీచులాట స‌ద్దుమ‌ణ‌గాలంటే నారా లోకేశ్ అక్క‌డి నుంచి బ‌రిలోకి దిగ‌డ‌మొక్క‌టే మార్గంగా క‌నిపిస్తుంద‌ని చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English