ఆ ఒక్క సంఘ‌ట‌న అత‌న్ని తీవ్ర‌వాదిని చేసింది

ఆ ఒక్క సంఘ‌ట‌న అత‌న్ని తీవ్ర‌వాదిని చేసింది

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడిలో ఊహించ‌ని కోణం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఈ దాడికి పాల్ప‌డిన జైషే ఉగ్ర‌వాది ఆదిల్ అహ్మ‌ద్ దార్ గురించి ఆయ‌న తండ్రి కీల‌క స‌మాచారం వెల్ల‌డించాడు.

అస‌లు త‌న కుమారుడు ఎందుకు తిరుగుబాటు మార్గాన్ని ఎంచుకున్నాడో అతని తండ్రి గులామ్ హ‌స‌న్ దార్ వివ‌రించాడు. స్కూల్‌ విద్యార్థిగా ఉన్న స‌మ‌యంలో.. భ‌ద్ర‌తా ద‌ళాలు ఆదిల్ ముక్కును నేల‌కు రాసేలా చేశాయ‌ని, ఆ ఒక్క సంఘ‌ట‌న అత‌న్ని తీవ్ర‌వాదం వైపు మ‌ళ్లించిన‌ట్లు గులామ్ దార్ చెప్పాడు.

ఆదిల్ అహ్మద్ దార్.. జమ్ము కశ్మీర్‌లోని పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న ముష్కరుడు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సైనిక బలగాల ఉపసంహరణను తమ విజయంగా తాలిబన్లు పేర్కొనడాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆదిల్ ఆత్మాహుతి దళ సభ్యుడిగా మారాడు.

పుల్వామాలో ఉగ్రదాడి తరువాత ఆదిల్ ఆత్మాహుతి సందేశానికి సంబంధించిన రెండు వీడియోలు టెలిగ్రామ్‌లో చక్కర్లు కొట్టాయి. ఏడాది తరువాత నాకీ అవకాశం వచ్చింది. ఈ వీడియో మీకు చేరే సరికి... నేను స్వర్గంలో ఉంటాను. కశ్మీర్ ప్రజలకు ఇదే నా చివరి సందేశం అని అతడు ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్లు జిహాద్ ద్వారా అమెరికాను ఓడించారని పేర్కొన్నాడు.

బలిదానాల ద్వారా కశ్మీర్‌లో ముస్లిం లకు స్వాతంత్య్రం సిద్ధిస్తుందన్నాడు. మరోవైపు తన కుమారుడి ఉగ్రవాద కార్యకలాపాల గురించి తమకు తెలియదని ఆదిల్ తండ్రి గులాందార్ చెప్పాడు. జమ్ము కశ్మీర్ పోలీసుల ద్వారానే ఆత్మాహుతి దాడి విషయం తమకు తెలిసిందని పేర్కొన్నాడు.

కానీ తాజాగా ఆదిల్ తండ్రి మాట మార్చాడు. త‌న కుమారుడి మ‌న‌సులో ఉన్న ప‌గే ఇలా చేశార‌ని వెల్ల‌డించాడు. ఓ రోజు స్కూల్ నుంచి ఇంటికి వ‌స్తుంటే పోలీసులు ఆదిల్‌ను ప‌ట్టుకున్నార‌ని, అత‌న్ని వేధించార‌ని, ముక్కును నేల‌కు రాయ‌మ‌ని.. వాహ‌నం చుట్టూ తిప్పించార‌ని గులామ్ గుర్తు చేశాడు. ఆ ఘ‌ట‌న‌ త‌ర్వాత ఆదిల్ పోలీసుల‌పై కోపాన్ని పెంచుకున్నాడ‌ని చెప్పాడు.

ఆ సంఘ‌ట‌న‌ను అత‌ను ప‌దేప‌దే గుర్తు చేసుకుంటూ బాధ‌ప‌డేవాడ‌ని తెలిపాడు. పోలీసులు కొట్ట‌డం వ‌ల్లే వారిపై ఆదిల్‌కు కోపం పెరిగింద‌ని త‌ల్లి ఫ‌మీదా కూడా వెల్ల‌డించింది. ఆదిల్ గ‌త ఏడాది జైషేలో చేరాడు. స్కూల్‌లో అత‌ను డ్రాపౌట్‌. పేలుడు జ‌రిగిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఆదిల్ వీడియోను జైషే రిలీజ్ చేసింది. సూసైడ్ దాడికి పాల్ప‌డిన ఆదిల్‌కు క‌క‌పోరా ప్రాంతంలో పేరెంట్స్ అంత్య‌క్రియులు నిర్వ‌హించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English