కేబినెట్ విస్త‌ర‌ణ...గ్రేట‌ర్‌లో చోటు ద‌క్కేది ఎవ‌రికి?

కేబినెట్ విస్త‌ర‌ణ...గ్రేట‌ర్‌లో చోటు ద‌క్కేది ఎవ‌రికి?

సుదీర్గ నిరీక్ష‌ణ‌కు చెక్ పెడుతూ, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఈనెల 19న పొద్దున 11.30 నిమిషాలకు మంత్రివర్గాన్ని విస్తరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేర‌కు గవర్నర్ నరసింహన్ ను కలిసిన కేసీఆర్ తన నిర్ణయాన్ని తెలియజేయ‌డంతో అధికారులు ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మ‌య్యారు. అయితే, ఈ జాబితాలో చోటు ద‌క్కించుకునే వారిపై స‌హ‌జంగానే చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌ధానంగా అంద‌రి చూపు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎమ్మెల్యేల వైపు ప‌డింది.

కేసీఆర్ ఏర్పాటు చేయ‌నుంది మినీ కేబినెటా పూర్తిస్థాయిలో కేబినెటా అన్నది స్పష్టంగా తెలియడం లేదు. దీంతో కొత్త దాంట్లో మన పేరుంటుందా లేదా అన్న దానిపై రేసులో ఉన్న ఆశావాహులంతా ఆరా తీయటం మొదలుపెట్టారు. ఈసారి గ్రేటర్ పరిధిలో మంత్రివర్గం లో చోటు కోసం పోటీపడుతున్న వారి సంఖ్య పది మంది వరకూ ఉంది. కానీ మొత్తం మంత్రి వర్గం కోటాయే 15 మందికి మించకూడదు. దీంతో రేసులో ఉన్న చాలా మంది ఆశావాహుల్లో ఆందోళన మొదలైంది.

గ్రేట‌ర్ నుంచి గత కేబినెట్లో ఏకంగా ఐదుగురు మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు. ఈసారి పరిస్థితులు మారాయి. అన్ని జిల్లాల నుంచి మంత్రి వర్గంలో పోటీ పడుతున్న వారి సంఖ్య పెరిగింది. దీనికితోడు ఎప్పుడూ లేని విధంగా అధికారపార్టీ బలం14 కు చేరింది. వీరిలో గతంలో మంత్రులుగా పనిచేసిన తలసాని, పద్మారావు, దానం నాగేందర్ ఉన్నారు. ఇప్పటికే చోటు దక్కించుకున్న మహమూద్ అలీ గ్రేటర్ కోటాలోనే ఉన్నారు.

గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వారంతా మళ్లీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. ముఖ్యంగా సెటిలర్లు ఎక్కువగా ఉండే కూకట్ పల్లి, జూబ్లీ హిల్స్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల నుంచి గెలిచిన మాధవరం కృష్ణారావు, మాగంటి గోపినాథ్, ఆరికెపూడి గాంధీ, కేపీ వివేకానందలు ఈసారి మంత్రి పదవులపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. మాగంటి గోపినాథ్, అరికెపూడి గాంధీ రెండుసార్లు గెలువగా కేపీ వివేకానంద మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజేంద్రనగర్ నుంచి ఎన్నికైన ప్రకాష్ గౌడ్ సైతం మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచినవారే. దీంతో పోటీ పెద్ద ఎత్తున ఉండ‌టంతో, ఇప్పటికే తమకు  అవకాశం ఇవ్వాలంటూ టీఆర్ఎస్ పెద్ద బాస్, చిన్న బాస్ వద్ద ఎవరికి వారు ప్రయత్నాలు గట్టిగానే చేశారు. అంతిమంగా లిస్ట్ లో పేరుంటుందా లేదా అన్న దానిపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English