నాగశౌర్య.. రెండు ఫినిష్.. మూడు కావాలి

పెద్ద స్టార్ హీరో కావడానికి ఒక కొత్త థియరీ చెబుతున్నాడు టాలీవుడ్ యువ కథానాయకుడు నాగశౌర్య. ఐదు భారీ హిట్లు పడితే ఆ హీరో ఆటోమేటిగ్గా పెద్ద స్టార్ అయిపోతాడని అతనంటున్నాడు. తన కెరీర్లో అలాంటి తొలి భారీ హిట్ ‘ఛలో’ అతను అభిప్రాయపడ్డాడు. ఇక రెండో హిట్ శుక్రవారం రిలీజ్ కాబోతున్న ‘వరుడు కావలెను’ అని అతను ధీమా వ్యక్తం చేశాడు. దీని తర్వాత తాను మూడు భారీ విజయాలు బాకీ ఉంటానని.. అవి కూడా అందుకుంటే తాను పెద్ద స్టార్ అయినట్లే అతను వ్యాఖ్యానించడం విశేషం.

‘ఛలో’ తర్వాత తనకు ఆశించిన విజయాలు దక్కని మాట వాస్తవమే అని నాగశౌర్య చెప్పాడు. ‘నర్తన శాల’ నిరాశ పరిచిందని.. కానీ అలాంటి ఫ్లాప్ మూవీ తర్వాత వచ్చినా కూడా ‘అశ్వథ్థామ’కు మంచి ఓపెనింగ్స్ వచ్చాయని.. ఆ సినిమా ఫ్లాప్ అంటే తాను ఒప్పుకోనని నాగశౌర్య అన్నాడు.

‘వరుడు కావలెను’ కథ విన్నపుడు బాగా అనిపించిందని.. షూటింగ్ చేస్తున్నపుడు ఈ చిత్రంపై నమ్మం పెరిగిందని.. ఇక ఎడిటింగ్ టైంలో సినిమా చూసినపుడు బ్లాక్‌బస్టర్ కొడుతున్నామనే ధీమా కలిగిందని నాగశౌర్య చెప్పాడు. సినిమాలో ఏమైనా తేడాలుంటే.. లోటుపాట్లుంటే కచ్చితంగా ఎడిటింగ్ టైంలో తెలిసిపోతుందని.. కానీ ‘వరుడు కావలెను’ విషయంలో అలాంటి ఫీలింగ్ కలగలేదని.. ఈ సినిమాలో 15 నిమిషాల పాటు సాగే క్లైమాక్స్ హైలైట్ అని.. తన కెరీర్లోనే ఇది బెస్ట్ క్లైమాక్స్ అవుతుందని నాగశౌర్య ధీమా వ్యక్తం చేశాడు.

ఈ సినిమాను తన కుటుంబ సభ్యులకు చూపించమని నిర్మాతలు అన్నారని.. కానీ సినిమా అటు ఇటుగా ఉన్నపుడు వాళ్లకు చూపించి అభిప్రాయం తెలుసుకోవాలని.. కానీ సినిమా బాగా ఆడుతుందన్న కాన్ఫిడెన్స్ ఉన్నపుడు రిలీజ్ రోజు ప్రేక్షకులతో కలిసి చూడటమే కరెక్ట్ అనిపించి వాళ్లకు సినిమా చూపించలేదని శౌర్య అన్నాడు. మొత్తానికి నాగశౌర్య మాటల్ని బట్టి చూస్తుంటే ‘వరుడు కావలెను’ విషయంలో అతను చాలా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడని అర్థమవుతోంది.