బీజేపీ, కాంగ్రెస్‌కు ఒకేసారి షాకిచ్చిన నిపుణుడు

బీజేపీ, కాంగ్రెస్‌కు ఒకేసారి షాకిచ్చిన నిపుణుడు

రాబోయే ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన‌ వాగ్దానంపై నీలి నీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత  క‌నీస ఆదాయ హామీని తాము అమ‌లు చేయ‌న‌న్న‌ట్లు రాహుల్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ పథకం ఆచరణలో సాధ్యంకాదని నీతిఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్ అన్నారు. ఈ పథకం అమలుచేసేందుకు తగిన ఆర్థిక వెసులుబాటు లేదని, అదే సమయంలో పథకం అమలు చేసేందుకు అవసరమైన లబ్ధిదారుల పూర్తి సమాచారం కూడా అందుబాటులో లేదని చెప్పారు. దీంతో, రాహుల్ ప్ర‌క‌ట‌న అమ‌లుపై సందేహాలు నెల‌కొన్నాయి.

రాజీవ్‌కుమార్ ఆదివారం ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ...గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించిన గరీబీ హఠావోను ఈ పథకం పోలి ఉన్నదని పేర్కొన్నారు. కనీస ఆదాయ హామీ పథకాన్ని ఎలా అమలు చేస్తారనే విషయాన్ని దేశ ప్రజలకు కాంగ్రెస్ వివరించాలని కోరారు. ప్రజలకు సార్వజనీన ప్రాథమిక ఆదాయాన్ని(యూనివర్సల్ బేసిక్ ఇన్‌కం) కల్పించాలంటూ మాజీ ఆర్థిక ప్రధాన సలహాదారు అరవింద్ సుబ్రహ్మణియన్ తరుచూ చేసే సూచనను సైతం రాజీవ్‌కుమార్ వ్యతిరేకించారు. పనిచేసే వ్యక్తులకు మాత్రమే ప్రోత్సాహకాలు అందించాలనేది తన అభిమతమన్నారు. అన్నదాతల సమస్యలకు రుణమాఫీ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ పరిష్కారం కాదని చెప్పారు.

``కనీస ఆదాయ హామీ పథకం ఆచరణ సాధ్యమవుతుందని నేను భావించడం లేదు. ఇది కేవలం అలంకార పద ప్రయోగంలా ఉంది. ఎందుకంటే పథకం అమలు చేసేందుకు అవసరమైన ఆర్థిక వెసులుబాటు, లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి సమాచారం మన వద్ద అందుబాటులో లేవు. కాంగ్రెస్ కేవలం పథకాన్ని మాత్రమే ప్రకటించి, మిగతా అన్ని విషయాల్ని అసంపూర్తిగా వదిలివేసింది`` అని అన్నారు. సార్వజనీన ప్రాథమిక ఆదాయం పథకం ప్రవేశపెట్టాలంటూ మాజీ ఆర్థిక ప్రధాన సలహాదారు అరవింద్ సుబ్రహ్మణియన్ చేసిన వ్యాఖ్యలను రాజీవ్‌కుమార్ తిరస్కరించారు. ``ఈ ఆలోచనకు నేను పూర్తిగా వ్యతిరేకం. భారతదేశ తలసరి ఆదాయం, జనాభా వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యక్తులకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తే బాగుంటందని నా ఆలోచన. తద్వారా వారికి సామాజిక భద్రత చేకూరుతుంది. చైనా లాంటి చాలా దేశాలు కూడా నిరుద్యోగ భృతి కంటే యువతను సాధికారత వైపు పయనించేలా ప్రోత్సహిస్తున్నాయి`` అని పేర్కొన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English