ఓటుకునోటుఃఈ విచార‌ణ ల‌క్ష్యం వేం న‌రేంద‌ర్ కాదా?

ఓటుకునోటుఃఈ విచార‌ణ ల‌క్ష్యం వేం న‌రేంద‌ర్ కాదా?

ఓటుకు నోటు...దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు. 2015 మే 30న వెలుగులోకి వచ్చిన ‘ఓటుకు కోట్లు’ కేసులో వేం నరేందర్‌ రెడ్డిపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్‌ రెడ్డిని గెలిపించుకోవడానికి నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్‌ రెడ్డితోపాటు వేం నరేందర్‌ రెడ్డి కూడా టీడీపీని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

ఈ ఎపిసోడ్‌పై తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దూకుడు పెంచింది. ‘ఓటుకు కోట్లు’ కేసులో కాంగ్రెస్‌ నేత వేం నరేందర్‌రెడ్డి ఇవాళ ఎదుట విచారణకు హాజరయ్యారు. నరేందర్‌ రెడ్డితో పాటు ఆయన కుమారుడు కీర్తన్‌ రెడ్డి కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన 50 లక్షల రూపాయలు లెక్కలపై విచారణ సందర్భంగా వేం నరేందర్ రెడ్డిని ఈడీ అధికారులు ఆరా తీసిన‌ట్లు స‌మాచారం. బ్యాంక్‌ ఖాతాలను ముందుంచిన అధికారులు..రూ.50 లక్షలతో పాటు ఇవ్వజూపిన మరో నాలుగున్నర కోట్లు ఎక్కడ అంటూ నరేందర్‌ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆదాయ పన్ను, అవినీతి నిరోధక శాఖ ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాజ్‌ శేఖర్‌ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగింది.

కాగా, ఓటుకునోటు కేసులో ఈడీ ఇప్పటికే రేవంత్‌ రెడ్డి, ఉదయ సింహను కూడా విచారించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఎపిసోడ్‌లో వేం న‌రేంద‌ర్ రెడ్డిని విచారించ‌డం వెనుక కాంగ్రెస్ ముఖ్య నేత అయిన రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయ‌డం కూడా ఉంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. కీల‌క‌మైన పార్ల‌మెంటు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ కేసుతో సంబంధం ఉన్న‌వారంద‌రినీ టార్గెట్ చేసేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English