జ‌గ‌న్‌తో బంధం...ముసుగు తొల‌గించిన టీఆర్ఎస్‌

జ‌గ‌న్‌తో బంధం...ముసుగు తొల‌గించిన టీఆర్ఎస్‌

తాను ప్ర‌వ‌చిస్తున్న ఫెడరల్ ఫ్రంట్‌లో కలిసే అంశంపై వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు, ఇతర నాయకులకు సూచించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్‌తో సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించింది. ఈ సమావేశం గంటకుపైగా సాగింది. అనంతరం కేటీఆర్, జగన్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేంద్రం అధికారాలను తన వద్ద పెట్టుకొని, రాష్ర్టాలపై నిర్లక్ష్యవైఖరి అవలంబిస్తున్నదని విమర్శించారు. ఈ వైఖరి మారాలని, దేశంలో గుణాత్మక మార్పు రావాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ సమాఖ్య స్పూర్తితో జాతీయస్థాయిలో ప్రత్యమ్నాయ ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

అయితే, ఈ ఎపిసోడ్ వెనుక ఏపీ రాజ‌కీయాల్లో వైసీపీకి మ‌ద్ద‌తుగా కేసీఆర్ ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారనే అంచ‌నాలు వెలువ‌డ్డాయి. కానీ అలాంట ప్ర‌య‌త్నం తాము చేయ‌బోవ‌డం లేద‌ని, ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కోస‌మే క‌లిశామ‌ని ప‌లు ద‌ఫాల్లో ఇటు టీఆర్ఎస్ నేత‌లు, అటు వైసీపీ నేత‌లు ప్ర‌క‌టించారు. అయితే, ఏపీ రాజ‌కీయాల్లో జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా టీఆర్ఎస్ రంగంలోకి దిగ‌డం అనే ప్ర‌క్రియ‌లో అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి తెలంగాణ సీఎం కేసీఆర్‌ మద్దతు ఇచ్చే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ పార్టీ అధికార ప్రతినిధి అబిద్‌ రసూల్‌ ఖాన్‌ పేర్కొన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌లో భాగంగా జగన్‌కే ఓటేయాలని ఏపీ ప్రజలను తమ పార్టీ కోరనుందని ఆయన తెలిపారు.

హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో అబిద్ ర‌సూల్‌ఖాన్ మాట్లాడుతూ ఆంధ్రాలో నివాసముంటున్న తెలంగాణ ప్రజలు, బంధువులు, వ్యాపార భాగస్వాములంతా వైసీపీకే ఓటేయాలని కోరుతామన్నారు. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ భారీ విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని రసూల్‌ ఖాన్‌ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత లౌకికవాద, ప్రాంతీయ పార్టీలు కీలకపాత్ర పోషించే అవకాశం ఉందన్నారు. వైఎస్‌ జగన్‌ లౌకికవాది మరియు పేదల ప్రజల స్నేహితుడు అని రసూల్‌ ఖాన్‌ చెప్పారు. కాగా, వైసీపీ-టీఆర్ఎస్‌ల మ‌ధ్య అస‌లు బంధం స్ప‌ష్ట‌మైంద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English