బాబు ఢిల్లీ దీక్ష‌తో ఆంధ్రోళ్ల‌కు ఎంత లాభం?

బాబు ఢిల్లీ దీక్ష‌తో ఆంధ్రోళ్ల‌కు ఎంత లాభం?

విభ‌జ‌న కార‌ణంగా ఏపీ ఎంత‌గా న‌ష్ట‌పోయిందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న స‌మ‌యంలో ఉమ్మ‌డి రాష్ట్రంలో తెలంగాణ ఎంత న‌ష్టపోయింద‌న్న విష‌యాన్ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్ర‌మే కాదు.. ఏ రంగానికి చెందిన నిపుణులు ఆ రంగంలో తెలంగాణకు జ‌రిగిన అన్యాయాన్ని అదే ప‌నిగా చెబుతుండేవారు. విచిత్ర‌మైన విష‌యం ఏమంటే.. ఆంధ్రాకి సంబంధించి ఏ వాద‌న వినిపించేది కాదు. నిజానికి ఆంధ్రా ప్రాంతానికి చెందిన మేధావులు.. ప్ర‌ముఖులు.. రాజ‌కీయ తోపుల వైఫ‌ల్య‌మే దీనికి కార‌ణంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

తెలంగాణ సాధ‌న కోసం తెలంగాణ స‌మాజం సంఘ‌టిత‌మైతే..   స‌మైక్య‌రాష్ట్ర భావ‌న మ‌న‌సులో ఉన్నా.. ప‌ని చేసి.. త‌మ వాద‌న‌ను బ‌లంగా వినిపించే విష‌యంలో మేధావులు ప్ర‌ద‌ర్శించిన సోమ‌రిత‌నం.. ప‌ట్ట‌ని త‌నానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. దీనికి తోడు.. తమ‌కు తాము తోపులుగా ఫీల్ కావ‌టం.. త‌మ‌కు మించిన లాబీయింగ్ మ‌రెవ‌రూ చేయలేర‌ని.. అహంభావం.. ఆ వెంటే అహంకారం వెర‌సి..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఏపీ భారీగా న‌ష్ట‌పోయే ప‌రిస్థితి.

విభ‌జ‌న‌తో ఏపీకి ఎంత న‌ష్టం జ‌రుగుతుంద‌న్న విష‌యంపై తెలుగోళ్ల‌ను రెండు ముక్క‌లు చేసిన సోనియ‌మ్మ‌కు ఎంత తెలుసో.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వెంక‌య్య నాయుడికి అంత‌కంటే ఎక్కువ తెలుసు. మిగిలిన వేళ‌ల్లో ఏపీ మీద పెద్ద‌గా ప్రేమ‌ను ప్ర‌ద‌ర్శించ‌ని వెంక‌య్య‌.. విభ‌జ‌న కార‌ణంగా ఏపీకి జ‌రుగుతున్న న‌ష్టాన్ని భ‌ర్తీ చేసేందుకు ప్ర‌త్యేక హోదా అంశాన్ని తెర మీద‌కు తెచ్చారు.

అప్పట్లో ఉన్న ప‌రిస్థితుల కార‌ణంతో పాటు.. మన్మోహ‌న్ లాంటి వ్య‌క్తి ప్ర‌ధాని స్థానంలో ఉండ‌టంతో రాజ్య‌స‌భ‌లో ఏపీకి ఐదేళ్ల పాటు ప్ర‌త్యేక హోదా ఇస్తాన‌న్న మాట‌ను దేశ ప్ర‌ధాని హోదాలో ఇచ్చార‌ని చెప్పాలి. అయితే.. ఇలాంటి హామీల్ని అమ‌లు చేసేంత పెద్ద మ‌న‌సు మోడీ లాంటి ప్ర‌ధానికి ఉండ‌ద‌ని తెలిసిందే.మొద‌ట్లో మిత్రుడిగా..త‌ర్వాతి ద‌శ‌ల్లో రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిగా మారిన మోడీపై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పెద్ద యుద్ధాన్నే చేస్తున్నారు.

ప్ర‌త్యేక హోదా కోసం పోరాడాల్సిన బాబు.. మొద‌ట్లో అందుకు భిన్న‌మైన వైఖ‌రిని అనుస‌రించ‌టం.. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు క‌ళ్లు తెరిచి.. తాను వ‌దిలేసిన హోదాతోనే త‌న‌కు ప‌వ‌ర్ మ‌ళ్లీ వ‌చ్చే ఛాన్స్ ఉంద‌న్న విష‌యాన్ని గుర్తించి.. అందుకు త‌గ్గ‌ట్లు పావులు క‌ద‌ప‌టం షురూ చేశారు.

మోడీ మీద కోపం.. ఏపీకి ఆయ‌న చేసిన మోసాన్ని హైలెట్ చేసేలా పోరాటం మొద‌లైనా.. అది అంత‌కంత‌కూ పెరుగుతూ చివ‌ర‌కు ఢిల్లీలో బాబు దీక్ష చేసే వ‌ర‌కూ వెళ్లింది. హోదా మీద ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌లుమార్లు దీక్ష‌లు చేసినా.. తాజాగా బాబు చేసిన దీక్ష కార‌ణంగా ఏపీకి భారీ ప్ర‌యోజ‌నం చేకూరింద‌ని చెప్పాలి. ఏపీకి హోదా ఇస్తే.. మిగిలిన రాష్ట్రాల నుంచి అభ్యంత‌రాలు వ‌స్తాయ‌న్న అభిప్రాయాన్ని మోడీ బ్యాచ్ తెలివిగా తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. అందుకు భిన్నంగా.. తాజాగా బాబు దీక్ష‌కు దేశ వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాలకు చెందిన రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌రు కావ‌ట‌మే కాదు.. త‌మ మ‌ద్ద‌తును తెల‌ప‌టం ద్వారా హోదా సాధ‌న నినాదానికి భారీ బ‌లం చేకూరింద‌ని చెప్పాలి.

హోదా మీద ఇప్ప‌టివ‌ర‌కూ చాలామంది చాలానే దీక్ష‌లు చేసినా.. గురి చూసి కొట్టిన‌ట్లుగా.. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. వ్యూహాత్మ‌కంగా బాబు చేప‌ట్టిన ఢిల్లీ దీక్ష స‌క్సెస్ కావ‌ట‌మే కాదు.. హోదా సాధ‌న అంశం మ‌రోస్థాయికి వెళ్లింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. దీక్ష ఎవ‌రు చేశార‌న్న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. జాతీయ స్థాయిలో ఏపీ హోదా అంశం హైలెట్ అయ్యింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తాజా దీక్ష‌తో బాబుకు లాభం ఎంత‌?   లాంటి అంశాల్ని ప‌క్క‌న పెడితే..ఏపీ హోదా సాధ‌నకు మాత్రం ఎంతో లాభం చేసే అంశంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English