మోదీ పథకాలు 19 ఏళ్ల క్రితం నేను పెట్టినవే: చంద్రబాబు

మోదీ పథకాలు 19 ఏళ్ల క్రితం నేను పెట్టినవే: చంద్రబాబు

గుంటూరులో నిర్వహించిన సభ వేదికగా తనపైన, తన కుమారుడిపైన ప్రధాని మోదీ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీకి 5 పేజీల బహిరంగ లేఖ రాశారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోయేది తాను కాదని... మోదీయే ఓడిపోనున్నారని.. అందుకు ఆయన గుండె దిటవు చేసుకుని సిద్దంగా ఉండాలన్నారు. మీ పథకాలను కాపీకొట్టే చరిత్ర నాకు లేదు.మీరిప్పుడు  చెప్పే పథకాలన్నీ నేను 19ఏళ్ల క్రితం పెట్టినవనేది గుర్తుంచుకోవాలి అంటూ మండిపడ్డారు. 5 పేజీల ఆ సుదర్ఘ లేఖలో చంద్రబాబు అనేక అంశాలను ప్రస్తావించారు.


ఆ లేఖ పూర్తిపాఠం ఇది..

ప్రియమైన శ్రీ నరేంద్రమోది గారికి, నమస్కారాలు,

ప్రధానమంత్రిగా ఉన్నవారికి రాజధర్మం కలిగి ఉండాలి.అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూడగలగాలి. ధర్మాన్ని ఆచరించాలి. అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేయగలగాలి. అంతే తప్ప ఎక్కడ అడుగుపెడితే అక్కడ నిరసనలు ఎదుర్కొనే దుస్థితి అత్యున్నతి పదవిలో ఉండేవారికి కలుగరాదు. గతంలో ఏ ప్రధానమంత్రికి ప్రస్తుతం మీకెదురైనన్ని నిరసనలు ఎదుర్కోలేదు. ఏ రాష్ట్రానికి మీరు వెళ్తే అక్కడ నిరసనలు ఎదుర్కోవడం ఈ 5ఏళ్ల మీ పాలనా దుర్నీతికి నిలువెత్తు నిదర్శనం.

సాధారణంగా ప్రధాని ఏ రాష్ట్రానికైనా వస్తే ఏదైనా ప్రకటిస్తారని అక్కడి ప్రజలు ఆశిస్తారు. అందులోనూ నాలుగున్నరేళ్ల నిర్లక్ష్యానికి గురైన ప్రజలు ఇంకా ఎక్కువ  ఆశిస్తారు. నిన్నటి పర్యటన కొద్దోగొప్పో మీనుంచి ఆశించిన పదుల సంఖ్య ప్రజానీకాన్ని కూడా నీరుకార్చింది.

ఒక రాష్ట్రానికి ప్రధాని వస్తే అక్కడి ముఖ్యమంత్రిని సంప్రదించకుండా, ఆహ్వాన ప్రకటనల్లో పేరు వేయకుండా అవమానించే దుష్ట సంస్కృతి, కుసంస్కారం కూడా నిన్నటి మీ గుంటూరు పర్యటన బయటపెట్టింది. పైగా మీరే సంస్కృతి గురించి,సంస్కారం గురించి,సభ్యత గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం దానికి కొసమెరుపు. చాలా రోజుల తరువాత మళ్లీ ఆంధ్రప్రదేశ్‌ లో మీరు కాలుమోపడం, నాపై కాలు దువ్వడం, మా రాష్ట్రంపై అక్కసు కక్కడం 5కోట్ల ప్రజలే కాదు దేశం మొత్తం చూసింది. మీ నమ్మిన బంటు జగన్మోహన్‌ రెడ్డి అండదండలతో గుంటూరులో మీరు జరిపిన సభ ఏ మేర ఫలప్రదం అయ్యిందో ఆ వివరాల్లోకి నేను వెళ్లదలుచుకోలేదు. అయితే ఆ సభలో మీరు చేసిన నిందారోపణలకు జవాబివ్వాల్సిన బాధ్యత 5కోట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ప్రతినిధిగా నాపై ఉంది.

మీ ప్రసంగం మొత్తం మీద ఎక్కడా ఏపి పునర్‌ విభజన చట్టంలో అంశాల గురించికాని, అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇచ్చిన హామీల గురించి కాని ప్రస్తావించక పోవడమే మీ పలాయనవాదానికి నిదర్శనం.ప్యాకేజి గురించి ప్రసవ్తవించిన మీరు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదో ప్రజలకు చెప్పలేకపోయారెందుకని..? హోదా ఇస్తే గుజరాత్‌ని మించిపోతుందని భయంతోనే ఏపికి ఇవ్వలేదని చెప్పలేకపోయారా..? హోదా కోసం ఆత్మహత్యలు చేసుకున్నవారికి కనీస సంతాపం, సానుభుతి చెప్పే సంస్కారమే మీలో లోపించిందా? విభజన చట్టంలో ఏ అంశాన్ని మీరు నెరవేర్చనందుకే వాటినుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి నాపైన, నా కుటుంబంపైన నిందాపూర్వక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రుల సంస్కారం గురించి, సంస్క‌తి గురించి మాట్లాడిన మీదెంత సంస్కారమో, మీ దుష్ట సంస్క‌తి ఏమిటో మీ వ్యాఖ్యల్లోనే బైటపడింది.ఇక మిగతా విషయాల్లోకి వద్దాం.

నాకు గౌరవం కాదు నేను కోరుకునేది నా రాష్ట్రానికి గౌరవం... 5కోట్ల ప్రజల ప్రతినిధిని నేను, 175మంది సభ్యుల శాసనసభకు నాయకుడిని నేను. నేను కోరేది నాకు న్యాయం చేయమని కాదు, నా రాష్ట్రానికి న్యాయం చేయమని..మా హక్కులు నెరవేర్చమని, విభజన చట్టంలో ఉన్న 18అంశాలు అమలు చేయమని నేను డిమాండ్‌ చేసేది.

మోదిగారూ, మీరు చెప్పినా, చెప్పకపోయినా నేను సీనియర్‌ నే. మీ ఎగతాళి, ఎద్దేవా వ్యాఖ్యలే బిజెపి పతనానికి బీజాలు వేశాయనేది తెలుసుకోండి. నన్నుకాదు మీరు ఎగతాళి చేసింది, నన్ను కాదు మీరు ఎద్దేవా చేసింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, 5కోట్ల ప్రజల ప్రతినిధిని ఎగతాళి చేయడం మీ సంస్కారాన్ని తెలియజేస్తోంది.ప్రజా సంక్షేమంలో సీనియర్‌ మీరైతే దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ నిరశనలు ఎందుకు.? రైతులు, మహిళలు, యువత, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనారిటీ అన్ని వర్గాల్లో ఈ ఆశాంతి ఎందుకు. అభివృద్ధిలో మీరు సీనియర్‌ అయితే రాష్ట్రాలకు ఈ నిధుల కొరత ఎందుకు.?

మీ మాటల్లో నా పట్ల ఉన్న కక్ష కనిపిస్తోంది. మీ మాటల్లో మా రాష్ట్రం పట్ల ఉన్న అక్కసు కనిపిస్తోంది. ఈ కక్షకు, ఈ అక్కసుకు కారణం మీ అసూయే. చరిత్రలో అసూయాపరులు, నమ్మకద్రోహులకు ప్రజాదరణ లేదు.

గుంటూరును 'ఆంధ్రప్రదేశ్‌ ఆక్స్‌ ఫర్డ్‌' గా పేర్కొన్న మీరు, అందులో మీ ఘనత ఎంతో కూడా చెబితే బాగుండేది. ఆంధ్రప్రదేశ్‌ కు  ఆక్స్‌ ఫర్డ్‌ యూనివర్సిటీలు కావాల్సిన అత్యున్నత విద్యాసంస్థలకు ఈ 5ఏళ్లలో ఎంతిచ్చామనే ఆత్మవిమర్శ మీలో ఉందా..? రూ.12వేల కోట్ల విలువైన భూమలు రాష్ట్రప్రభుత్వం ఇస్తే, రూ.130కోట్లతో ప్రహరీగోడలు నిర్మిస్తే,మీరిచ్చింది కేవలం రూ.700కోట్లు మాత్రమే. కావాల్సిందాంట్లో 6% నిధులతో ఆక్స్‌ ఫర్డ్‌ లు అవుతాయా అవి..? మీ వ్యాఖ్యలు గాయాలు మాన్పడమా, పాత గాయాలు రేపడమా..? గాయాలపై కారం జల్లడమా..?

మీరిప్పుడు కొత్తగా వంటగ్యాస్‌ కనెక్షన్ల గురించి చెబుతున్నారు. 19ఏళ్ల క్రితమే నేను 33లక్షల వంటగ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చాను. మీ వద్ద  పాలన నేర్చుకునే పరిస్థితి నాదికాదు, మీ పథకాలను కాపీకొట్టే చరిత్ర నాకు లేదు.మీరిప్పుడు  చెప్పే పథకాలన్నీ నేను 19ఏళ్ల క్రితం పెట్టినవనేది గుర్తుంచుకోవాలి.

రాష్ట్ర పునర్నిర్మాణాన్ని గాలికి వదిలేసి, తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణం చేసుకుంటున్నానని ఎద్దేవా చేశారు. 65లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ తెలుగుదేశం, 36ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ది,పేదల సంక్షేమమే పరమావధిగా పనిచేసే పార్టీపై గుంటూరులో చేసిన వ్యాఖ్యలు మీ సంకుచిత ధోరణికి రుజువు. అయినా ఇప్పడు చేయాల్సింది బిజెపి పోస్ట్‌ మార్టమ్‌ కాని వేరే పార్టీలది కాదు. 5రాష్ట్రాలలో చిత్తుగా ఓటమిపాలై, 3రాష్ట్రాలలో అధికారాన్ని కోల్పోయిన బిజెపిపై పోస్ట్‌ మార్టమ్‌ చేసే ధైర్యం మీకుందా..? ఒకప్పుడు వాజ్‌ పేయి, అద్వానీ ద్వయం 2సీట్లనుంచి బిజెపిని 280సీట్ల స్థాయికి నిర్మిస్తే, అంత ఉత్థానం నుంచి ఇంత పతనానికి కేవలం 4ఏళ్లలోనే బిజెపిని  దిగజార్చిన ద్వయంగా మీరిద్దరూ(మోది, అమిత్‌ షా) చరిత్ర తిరగరాశారు. పునర్నిర్మాణానికి, పునరుత్తేజానికి కూడా పనికిరాని పార్టీగా బిజెపిని దిగజార్చారు.

హృదయ్‌ కింద అమరావతిని హెరిటేజ్‌ పట్టణంగా అభివృద్ది చేస్తున్నామని ''తేనె పూసిన కత్తుల్లాంటి మాటల్లో'' మీది అందె వేసిన చెయ్యి. రూ.1,500కోట్లతో హెరిటేజ్‌ నగరంగా అమరావతిని చేస్తారా..? నిధులన్నీ గుజరాత్‌ కు మళ్లిస్తూ ఏపిపై సవతి ప్రేమ కనబరుస్తారా..? ఇన్నిచేసినా మీ రాష్ట్రంలోనూ మీ పార్టీ పతనానికి చేరిందంటే ఈ విధమైన పోకడలు, పెడ ధోరణుల వల్లే అనేది గుర్తుంచుకోండి.

 అమరావతి నిర్మాణం నేనెంత చేశానో, మీరెంత నమ్మించి ద్రోహం చేశారో 5కోట్ల ప్రజలే కాదు దేశం మొత్తం చూసింది. మా రైతులు ఇచ్చిన రూ.50వేల కోట్ల విలువైన 33వేల ఎకరాల భూమి చూసి మీకు కన్ను కుట్టింది. మా ల్యాండ్‌ పూలింగ్‌ , రైతుల ఉదారత మీరు జీర్ణించుకోలేక పోయారు. 3దఫాలుగా అరకొరగా మీరిచ్చిన రూ.1500కోట్లతో ఒక్క భవనం కాని, అండర్‌ గ్రవుండ్‌ డ్రైనేజి(యూజిడి) కాని పూర్తి కావు. మీ సహకారం లేకపోయినా ఈ రోజు అనేక విశ్వవిద్యాలయాలు, హాస్పటల్స్‌ అమరావతికి వచ్చాయంటే అది మా సామర్ధ్యమే. రూ.లక్ష కోట్ల విలువైన పనుల్లో తొలిదశ కింద రూ.40వేల కోట్ల విలువైన ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ పనులు శరవేగంగా పూర్తి అవుతున్నాయి. మీ కళ్లముందే రాబోయే 5ఏళ్లలోనే మీరన్నట్లే ఢిల్లీని మించిన రాజధానిగా అమరావతిని నిర్మిస్తా, మీరు మరింత అసూయతో రగిలిపోయేలా చేస్తా.

వెన్నుపోటు గురించి, ఫిరాయింపుల గురించి మీరు మాట్లాడటం దివాలాకోరుతనం. మీరే పోటు పొడిచారో అద్వానీగారి కన్నీళ్లే చెబుతాయి, మీరే పోటు పొడిచారో మురళీ మనోహర్‌ జోషి గారి ముఖమే చెబుతుంది. వాజ్‌ పేయి ఆత్మ ఎంత ఘోషిస్తోందో లౌకిక,ప్రజాస్వామ్య వాదులందరికీ తెలిసిందే. కర్ణాటకలో, గోవాలో,మణిపూర్‌ లో మీ ఆధ్వర్యంలో జరిగిన ఫిరాయింపులు,ప్రలోభాల పర్వం దేశం మొత్తం చూసింది మీరు ఫిరాయింపుల గురించి మాట్లాడటం ''దయ్యాలు వేదాలు వల్లించడమే.''

2014ఎన్నికల ప్రచారంలో రూ.లక్షకోట్ల అవినీతిపరుడని మీరు తిట్టిన జగన్మోహన్‌ రెడ్డినే ఇప్పుడు మీ ఒళ్లో కూర్చోపెట్టుకున్నారు. గతంలో మీరు నిందించిన కెసిఆర్‌ నే ఇప్పుడు మెచ్యూర్డ్‌ నాయకుడని ఒళ్లో కూర్చోపెట్టుకున్నారు. నితిన్‌ ను ఎన్నిమాటలు అన్నారు,ఇప్పుడు నితిన్‌ ఉన్నది మీ ఒళ్లో కాదా..? ''ఏ ఎండకా గొడుగు పట్టడంలో'' మిమ్మల్ని మించినవాళ్లు ఎవరున్నారు..?

మీ వ్యాఖ్యలతో 'సన్‌ రైజ్‌ స్టేట్‌' ను అవమానించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల గుండెల్లో మరోసారి గాయం చేశారు. సూర్యోదయ రాష్ట్రంగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్‌ ఆకర్షించడం మీకు కంటగింపైంది. మీ ప్రమేయం లేకుండానే ఏపికి పెట్టుబడుల వరద వెల్లువెత్తడాన్ని జీర్ణించుకోలేక పోయారు.

అతిపెద్ద ఎఫ్‌ డిఐ కియా మోటార్స్‌  ఏపికి రాకుండా మీరు అడ్డంకులు పెట్ట్టినా ముఖ్యమంత్రిగా  నేను సాధించానని కంటు పెట్టుకోవడం నిజం కాదా..? మీ విదేశీ పర్యటనలు డబ్బు వ ధా తప్ప ఫలితం లేకపోవడం, అదే నా విదేశీ పర్యటనలకు అద్భుత స్పందన రావడమే మీ కక్షకు కారణమా..?

సన్‌ రైజ్‌ స్టేట్‌ చేస్తానని చెప్పి నా సన్‌ రైజ్‌ అంటూ ఏవో స్థాయి తక్కువ వ్యాఖ్యలు చేశారు.  నా సన్‌ గురించి నీ సర్టిఫికెట్లు అవసరం లేదు, స్టాన్‌ ఫోర్డ్‌ సర్టిపికెట్‌ ఇచ్చింది నా సన్‌ కు. విద్యాధికుడిగా విశ్వవిద్యాలయలో, ప్రజా సేవకుడుగా సమాజంలో సామర్ధ్యం రుజువు చేసుకుని ప్రజల ఆకాంక్షల మేరకు రాజకీయాల్లోకి వచ్చాడు. తనపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేయమని బహిరంగంగా లోకేష్‌ సవాల్‌ చేస్తే మీ నమ్మినబంటు జగన్మోహన్‌ రెడ్డి  పత్తా లేకుండా పారిపోయాడు. మీ వ్యాఖ్యలు వైసిపి పంపిన స్క్రిప్ట్‌ గా రాష్ట్రం మొత్తానికి తెలిసిందే.

మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన చమురు నిల్వ కేంద్రాలు మీరే నెలకొల్పినట్లు బిల్డప్‌ ఇచ్చి , అవి 2016కే పూర్తి కావాల్సివున్నా నిధులివ్వకుండా 2018వరకు పనులు జాప్యం చేసి తీరా ఎన్నికల నోటిఫికేషన్‌ కు పదిరోజుల ముందు ఇంకా పూర్తి కూడా కాని కేంద్రాలను ప్రారంభించినట్లుగా నమ్మించడం మరో ద్రోహం కాదా..? నిన్న శంకుస్థాపన చేసిన చమురు నిల్వ కేంద్రం పూర్తయ్యేటప్పటికి మీ అడ్రస్‌ కేరాఫ్‌ గుజరాత్‌ అని తెలిసే చేసింది నిజం కాదా..?

ఏపి పట్ట మీకున్న చిత్తశుద్ది ఏమిటో కాకినాడ గ్రీన్‌ ఫీల్డ్‌ పెట్రోలియం కాంప్లెక్స్‌ కు ఐఆర్‌ ఆర్‌ లోనే తెలిసిపోయింది. రాజస్థాన్‌ కు ఒకరకంగా, ఏపికి ఇంకోరకంగా  చేయడం ఏపికి ద్రోహం కాదా..? మీ రాష్ట్ర పెట్రోలియం కార్పోరేషన్‌ లిమిటెడ్‌ నష్టాలు రూ.21వేల కోట్లను ఓఎన్‌ జిసి లో కలిపేసి దానిని గట్టెక్కిస్తారా..? ఓఎన్‌ జిసిని ముంచేస్తారా..? మా ఆర్ధికలోటు రూ.16వేల కోట్లలో మాత్రం రూ.4వేల కోట్లే ఇచ్చి మిగిలిన దానికి గండికొడతారా..? ఇది ఏపికి ద్రోహం కాదా..?

నాకు కునుకు లేకుండా మీరు చేశారా..మీకు కునుకు లేకుండా పోయిందా..? కోల్‌ కత్తాలో 22పార్టీల యునైటెడ్‌ ఇండియా ర్యాలీ జరిగిన నాటినుండి మీకు కునుకు లేదనేది మీ వ్యాఖ్యలే చెబుతున్నాయి. పేదలకు మంచి చేసిన నాయకుడికి ఎప్పుడూ మంచి కునుకే పడుతుంది. పేదల పొట్టకొట్టిన నాయకులకే నిద్రలో పీడకలలు, ఉలిక్కిపడటాలు సహజమే. మీరు చేసిన అరాచకాలే మీకు నిద్రలేని రాత్రులను మిగిల్చాయి.

అప్పటినుండి పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక,కేరళ రాష్ట్రాలే టార్గెట్‌ గా మీరు చేస్తున్న దమనకాండను దేశం మొత్తం చూస్తోంది. మీరెక్కడికి వెళ్తే అక్కడ ఎదురయ్యే నిరసనలే మీ పాలనా దుర్నీతికి రుజువులు. అస్సాంలో, తమిళనాడులో, పశ్చిమ బెంగాల్‌ లో, నిన్న తాజాగా ఆంధ్రప్రదేశ్‌ లో ఉవ్వెత్తున లేచిన ప్రజావ్యతిరేకత చూసే మీలో భయం ఏ స్థాయికి చేరిందో నేను అర్ధం చేసుకోగలను.

 పతనావస్థలో ఎవరైనా సంస్కారాన్ని,సంయమనాన్ని కోల్పోవడం సహజమే. ఓటమి భయం ఎవరినైనా ఎంతకైనా దిగజారుస్తుందనేది చరిత్ర చెప్పిన సత్యం. మీ ప్రస్తుత స్థితికి సానుభూతి చూపడం మినహా నేను చేయగలిగిందేమీ లేదు.

నా రాష్ట్రం మీద, నా కుటుంబం మీద చేసిన మీ వ్యాఖ్యలను దిష్టిచుక్కలుగానే నేను భావిస్తాను. కాకపోతే మీరే మరీ ఈ దేశానికే  దిష్టిబొమ్మగా మారారే అనేదే నా బాధ.

మీ పాలనలో బంగారంలాంటి దేశాన్ని 20ఏళ్లు వెనక్కి నెట్టారనేదే నా బాధ అంతా. సరైన సహకారం ఇచ్చివుంటే నా రాష్ట్రాన్ని మరో 5ఏళ్ల అభివృద్దిని ఇప్పుడే చేసేవాళ్లమనేదే నా ఆవేదన అంతా. పునాదుల నుంచి రాష్ట్ర పునర్నిర్మాణం ఊపందుకున్న ఈ కీలక సమయంలో మీలాంటి చేతకాని ప్రధానిని భరించాల్సి వచ్చిందనేదే మా అందరి ఆందోళన. ఇదే 5ఏళ్లలో మరో సమర్ధ ప్రధాని మాకు అండగా ఉంటే ఇంకో 10ఏళ్ల అభివృద్దిని ఈ 5ఏళ్లలోనే సాధించేవాళ్లం అనేది మా 5కోట్ల ప్రజల భావన.  ఏదేమైనా మీకు మరింత స్వాస్థత చేకూరాలని, రాబోయే ఓటమిని ఎదుర్కోగల గుండె దిటవు మీలో పెరగాలని ఈ సందర్భంగా ఆ భగవంతుని ప్రార్తిస్తున్నాను.        

మీ
(నారా చంద్రబాబు నాయుడు)

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English