మోదీ వ‌చ్చారు!... పీకే నోరు పెగ‌ల‌ట్లేదే!

మోదీ వ‌చ్చారు!... పీకే నోరు పెగ‌ల‌ట్లేదే!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ గుంటూరు టూర్ ఒక్క ఏపీలోనే కాకుండా యావ‌త్తు దేశంలోనే ఆస‌క్తి రేకెత్తిస్తోంది. మోదీ టూర్‌ను వ్య‌తిరేకిస్తూ... ఏపీ వ్యాప్తంగా అధికార టీడీపీ, కాంగ్రెస్, వామ‌ప‌క్షాలు, ప్ర‌జా సంఘాలు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వ‌హిస్తున్నాయి. అయితే ఈ నిర‌స‌న‌ల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోని మోదీ గుంటూరు చేరుకున్నారు.

వేదిక ఎక్కి విలాసంగా కూర్చున్నారు. ఈ నేప‌థ్యంలో ర్యాలీలు, నిర‌స‌న‌ల‌తో రాష్ట్రం మొత్తం అట్టుడుకుతోంది. అయితే రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీని, మోదీని ప్ర‌శ్నించేందుకు మాత్రం విప‌క్షం వైసీపీతో పాటు మ‌రో కీల‌క పార్టీ జ‌న‌సేన సాహ‌సం చేయ‌డం లేదు. అస‌లు మోదీపై సింగిల్ విమ‌ర్శ చేయ‌డానికి కూడా  ఈ రెండు పార్టీలు సిద్ధంగా లేవనే త‌మ చ‌ర్య‌ల‌తో నిరూపించేసుకున్నాయి.

వైసీపీ విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే... గ‌తంలో మోదీ స‌ర్కారుపై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వైఖ‌రి ఇప్పుడు సైలెంట్‌గా ఉండిపోవ‌డంతో పాటుగా మోదీ టూర్‌ను ప్ర‌శ్నిస్తున్న టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడినే ప్ర‌శ్నించేందుకు సాహ‌సించ‌డం చూస్తుంటే... త‌న పంథా ఏమిటో ప‌వ‌న్ చెప్ప‌క‌నే చెప్పేశారు.

కాకినాడ కేంద్రంగా నిర్వ‌హించిన త‌న స‌భ‌లో ఏపీకి మోదీ ఏం చేశార‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావించిన ప‌వ‌న్‌... పాచిపోయిన ల‌డ్డూలు ఇచ్చారంటూ ఎటకారం చేశారు. అంతేనా మోదీపై త‌న‌దైన శైలిలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు కూడా చేశారు. మ‌రి ఇప్పుడు ఏపీకి ఏం ఇచ్చార‌ని మోదీపై ప‌వ‌న్ సాఫ్ట్ కార్న‌ర్ తీసుకున్నారో అర్థం కావ‌డం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. మోదీ టూర్‌ను వ్య‌తిరేకిస్తూ నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చిన చంద్ర‌బాబు... ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. ఆ ట్వీట్‌కు ప‌వ‌న్ స్పందించ‌కుండా ఉండ‌లేక‌పోయారనే చెప్పాలి.

జ‌న‌సేన అధికారిక ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా చంద్ర‌బాబు ట్వీట్ కు రీట్వీట్ కొట్టిన జ‌న‌సేన త‌న నిజ స్వ‌రూపాన్ని బ‌య‌ట‌పెట్టుకుంది. ఈ రీట్వీట్ ఎలా సాగింద‌న్న విష‌యానికి వ‌స్తే... "2016 లో తిరుపతి వేదికగా బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసింది అని మా అధ్యక్షుడు శ్రీ ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు కేంద్రాన్ని నిలదీస్తే, ఆరోజు న‌రేంద్ర మోదీ గారి భజనలో తరించింది మీరు కాదా చంద్ర‌బాబు గారు. ఈరోజు ఏ ముఖం పెట్టుకుని ప్రజల్ని మభ్యపెడుతున్నారు" అని జ‌న‌సేన ట్వీట్ సాగింది.

ఈ రీట్వీట్ ద్వారా ఏపీకి ఎంత‌మేర అన్యాయం చేసినా... తాము బీజేపీని గాని, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని గానీ ఒక్క మాట కూడా అన‌మ‌ని, అన‌లేమ‌ని కూడా జ‌న‌సేన చెప్పేసిన‌ట్టైంది. అంటే... ఇప్ప‌టిదాకా బీజేపీతో పొత్తు విష‌యంలో ముసుగు క‌ప్పుకునే ఉన్ జ‌న‌సేన ఇప్పుడు ఆ ముసుగును తొల‌గించేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English