మోదీ రాక‌పై ర‌గులుతున్న ఏపీ

మోదీ రాక‌పై ర‌గులుతున్న ఏపీ

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ టూర్ ఏపీలో కాక రేపుతోంది. విభ‌జ‌న హామీల‌ను విస్మ‌రించ‌డం ద్వారా మోసం చేశారంటూ మోదీకి వ్య‌తిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. మోదీ రాక‌ను నిర‌సిస్తూ దాదాపుగా అన్ని జిల్లాల్లో నల్ల జెండాలు, ఫ్లెక్సీలతో ప‌లువురు ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు. ‘మోదీ గో బ్యాక్‌’ అంటూ నినాదాలు హోరెత్తిస్తున్నారు.

విజయవాడ బెంజి సర్కిల్‌ వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం భారీ ఆందోళన కార్యక్రమం చేప‌ట్టారు. రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్‌, తెదేపా నేత కాట్రగడ్డ బాబు తదితరులు ఇక్క‌డ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఆంధ్ర ప్రజలను మోసం చేసి ఏ మొహం పెట్టుకుని  రాష్ట్రానికి వస్తున్నారంటూ ప్ర‌ధాని మోదీని వారు ప్ర‌శ్నించారు. ఖాళీకుండలు, మట్టి నీళ్లతోపాటు మోదీ వ్య‌తిరేక ప్ల‌కార్డుల‌ను ఆందోళ‌న‌లో భాగంగా ప్ర‌ద‌ర్శించారు. న‌లుపు రంగు బెలూన్ల‌ను ఎగ‌రేశారు.

మోదీ రాకను నిరసిస్తూ విజయవాడ దుర్గా ఘాట్‌ వద్ద సినీ నటుడు శివాజీ జలదీక్ష చేప‌ట్టారు. ఏపీ టూర్ ముగించుకొని మోదీ తిరిగి వెళ్లేంత వ‌ర‌కు దీక్ష కొన‌సాగించ‌నున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. శివాజీకి సంఘీభావంగా కృష్ణా నదిలో పలువురు యువకులు దీక్షకు దిగారు. వీరికి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ కారెం శివాజీ సంఘీభావం తెలిపారు. గుంటూరులో జిన్నాటవర్‌ సెంటర్‌ వద్ద తెదేపా కార్యకర్తలు నిరసనల ప్ర‌ద‌ర్శ‌న నిర్వహించారు.

ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు ఆదివారం ఉదయం గ‌న్న‌వ‌రం విమానాశ్రాయానికి వ‌చ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు చుక్కెదురైంది. క‌న్నాను విమానాశ్ర‌య భ‌ద్ర‌తా సిబ్బంది అడ్డుకున్నారు. ప్రధానిని కలిసేందుకు వచ్చే వారిలో పేరు లేదంటూ ఆయ‌న్ను విమానాశ్ర‌యంలోకి అనుమ‌తించ‌లేదు. ప్రధానికి స్వాగతం పలికేందుకు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.

మ‌రోవైపు - మోదీ రాక నేప‌థ్యంలో ఈ రోజును బ్లాక్‌ డేగా టీడీపీ ఎంపీ గ‌ల్ల జ‌య‌దేవ్ అభివర్ణించారు. పార్లమెంటులో ఏపీ గురించి అడిగితే మోదీ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పుడు ఏం చేయాల‌ని రాష్ట్రానికి వస్తున్నారని ప్రశ్నించారు. ప్రొటోకాల్‌ ప్రకారం తాను మోదీ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నా.. వెళ్లే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English