‘ఏం చేస్తారో తెలీదు.. చంద్రబాబు ఓడిపోవాలంతే’

‘ఏం చేస్తారో తెలీదు.. చంద్రబాబు ఓడిపోవాలంతే’

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు బీజేపీ సరికొత్త పాత్ర పోషించబోతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమే లక్ష్యంగా ఆ పార్టీ పనిచేయబోతోంది. తమకు ఒక్క సీటు కూడా రాకపోయినా కూడా ఫర్వాలేదు కానీ చంద్రబాబు మాత్రం మళ్లీ అధికారంలోకి రాకూడదన్న లక్ష్యంతో ఆ పార్టీ పనిచేయబోతోంది. ఇందుకు గాను ఆ పార్టీ ప్రత్యేక వ్యూహం, అవగాహనతో ముందుకెళ్లబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీ బీజేపీ నేతలకు గట్టిగా చెప్పినట్లు సమాచారం.

ఇటీవల అమిత్ షా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించినప్పుడు తీవ్ర నిరసనలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో అయితే ఆయన చాలా దారుణమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఏపీలో బీజేపీ బస్సు యాత్రను పలాస నుంచి ప్రారంభించగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా మాట్లాడాల్సి ఉంది. కానీ... పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శివాజీ అనూహ్యంగా అన్ని వైపుల నుంచి బీజేపీ శ్రేణులను అడ్డుకుని ఎవరినీ సభకు రానివ్వకుండా చేశారు. దీంతో భారీ ఏర్పాట్లు చేసినా కూడా సభకు కనీసం వంద మంది కూడా రాలేకపోయారు. పైగా అమిత్ షా‌ను కూడా శివాజీ నేతృత్వంలోని టీడీపీ నేతలు అడ్డుకున్నారు.దీంతో అమిత్ షా సభా వేదికపైకి కూడా వెళ్లలేదు. అట్నుంచి అటే వెనుదిరిగారు. ఈ పరిణామంతో అమిత్‌షా తీవ్ర ఆగ్రహానికి లోనైట్లు చెబుతున్నారు. గతంలో తిరుపతిలోనూ అమిత్ షాకు ఇదే స్థాయి నిరసనలు ఎదురయ్యాయి.

ఈ పరిస్థితుల్లో చంద్రబాబు విషయంలో అమిత్ షా వ్యక్తిగతంగా పగ తీర్చుకోవాలన్నంత కసితో ఉన్నారని.. అందుకే, ఆయన్ను ఎలాగైనా సీఎం కాకుండా అడ్డుకోవాలని పార్టీ నేతలను ఆదేశించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే మోదీకి బద్ధ శత్రువుగా మారిపోయిన చంద్రబాబు ఇప్పుడు అమిత్ షాకు కూడా శత్రువుగా మారినట్లు చెబుతున్నారు. గురువారం రాష్ట్ర బీజేపీ నేతలతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడిన అమిత్ షా.. గ్రామగ్రామాన ఉన్న బీజేపీ నాయకులకు కూడా ఈ సమాచారం చేరాలని, చంద్రబాబు గెలుపును అడ్డుకోవాలని ఆదేశించినట్లు టాక్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English