రాఫెల్ డీల్ః మోడీ బుక్క‌య్యే మ‌రో ఎపిసోడ్ వెలుగులోకి

రాఫెల్ డీల్ః మోడీ బుక్క‌య్యే మ‌రో ఎపిసోడ్ వెలుగులోకి

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రాఫెల్ డీల్‌లో మ‌రో ఎపిసోడ్ తెర‌మీద‌కు వ‌చ్చింది. రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలులోని అక్రమాల వ్యవహారం ప్రధాని మోడీకి తలనొప్పిగా మారింది. నిర్దిష్టమైన ప్రక్రియను పక్కనపెట్టి కుదుర్చుకున్న ఒప్పందం కారణంగానే రాఫెల్‌ యుద్ధ విమానాల ధరలో పెరుగుదల చోటు చేసుకున్నట్లు ఇటీవలి పరిణామాలతో తేటతెల్లమైంది. దాదాపు 41 శాతం అధిక ధరతో రాఫెల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ప్రధాని మోడీయే నిర్ణయం తీసుకున్నారంటూ ఆంగ్ల పత్రిక 'ద హిందూ' సంచలనాత్మక కధనం ప్రచురించింది. ఇందుకు త‌గు ఆధారాల‌ను సైతం ప్ర‌చురించింది.

`ద హిందూ` ప‌త్రిక క‌థ‌నం ప్ర‌కారం, రాఫెల్ యుద్ధ విమానాల కోనుగోలు పై ఫ్రెంచ్ అధికారులతో సమాంతర చర్చలు జరుపుతుండగా..ఇక్కడ  ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకుంది. ఈ చర్చల్లో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ అభ్యంతరాలను లేవనెత్తినట్లు ప‌త్రికా క‌థ‌నం తెలిపింది. ప్రధాని కార్యాలయంలో జరిగిన చర్చల్లో భారత్ తరుపున రక్షణ శాఖకు సంబంధించిన ఏ అధికారి లేడని తెలిపింది. ఫ్రెంచ్ అధికారులతో జరుపుతున్న రాఫెల్ డీల్ చర్చల్లో రక్షణ శాఖ కీలక అధికారులకు అవకాశం ఇవ్వాలని రక్షణశాఖ సూచించిందని పేర్కొంది.

126 రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుపై యూపీఏ ఒప్పందాన్ని కాదని, ప్రధాని మోడీ ఏకపక్షంగా 2015 ఏప్రిల్‌ 10న పారిస్‌ పర్యటనలో కొత్త ఒప్పందాన్ని చేసుకొని వచ్చారు. పాత ఒప్పందం రద్దు ప్రక్రియ మార్చి, 2015 నుంచి ప్రారంభించి, 2015 జూన్‌ నాటికి పూర్తి చేసినట్టు మోడీ సర్కార్‌ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అయితే సుప్రీంకోర్టుకు ఇచ్చిన నోట్‌పై తేదీగానీ, సంతకంగానీ లేవు. అధికారిక వివరణ ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం వెనకాడిందని అర్థమ‌వుతోందని ఈ క‌థ‌నంలో పేర్కొంది. 2015 జూన్‌ 24న అధికారికంగా పాత ఒప్పందం రద్దు అయ్యిందన్న విషయం  పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ నివేదికలోనూ తెలిపారు. కానీ, ఇదంతా నిజం కాదని ఫ్రెంచ్‌ సెనేట్‌ పత్రాల ద్వారా తేలింది. పాత ఒప్పందం రద్దు చేసుకోకుండానే, కొత్త ఒప్పందాన్ని (36 రాఫెల్‌ యుద్ధ విమానాలు) ప్రధాని మోడీ ఏకపక్షంగా చేసుకొచ్చారన్నది స్పష్టమైందని హిందూ క‌థ‌నం వెల్ల‌డించింది.

అయితే, కేంద్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫు వాద‌న‌లు మ‌రో ర‌కంగా ఉన్నాయి. రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు వ్యహరంపై కేంద్రం అక్టోబర్ 2018లో సుప్రీంకోర్టుకు తెలిపిన విషయాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. రాఫెల్ డీల్ కు సంబంధించిన చర్చల్లో ఎయిర్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్‌ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల బృందం చర్చల్లో పాల్గొన్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ డీల్ లో ప్రధాన మంత్రి కార్యాలయం ఎటువంటి జోక్యం చేసుకోలేదని కోర్టుకు తేలింది. అయితే, తాజాగా అవి అస‌త్య‌మ‌ని తేలింద‌ని  హిందూ క‌థ‌నం పేర్కొంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English