గాంధీ మాటే నా మాట‌..అదో మ‌హా క‌ల్తీ కూట‌మి

గాంధీ మాటే నా మాట‌..అదో మ‌హా క‌ల్తీ కూట‌మి

విప‌క్షాల‌పై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ మ‌రోమారు విరుచుకుప‌డ్డారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ..ప్రజలకు నీతివంతమైన పాలన అందిస్తున్నామని అన్నారు. మొదటిసారి ఓటు వేసే యువతను ప్రోత్పహించాలని ప్రధాని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రతిపక్షాల మహాకూటమిని టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు ఏర్పాటు చేస్తున్నది మహాగట్ బంధన్ కాదని నిజానికది మహామిలావట్ (మహాకల్తీ) కూటమి అని ఎద్దేవా చేశారు. అది దేశం కోసం పనిచేయలేదని వ్యాఖ్యానించారు.

మహాకూటమిని విమర్శిస్తూ విపక్షాలు ఆ అంశాన్ని దేశానికి ముడిపెట్టారు. ‘మోడీని ద్వేషిస్తూ ప్రతిపక్షం దేశాన్ని ద్వేషించడం ప్రారంభించింది. అందుకే వాళ్ల నేతలు లండన్ వెళ్తారు. దేశాన్ని కించపరిచేలా ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెడతారని’ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కుళ్లిపోయిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టుతో పాటు భారత సైన్యాన్ని కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించారు. ‘మనం కొత్త భారతదేశం గురించి మాట్లాడేటపుడు కొత్త ఆశ గురించి మాట్లాడతాం. మనం రెండు తేదీలు బీసీ, ఏడీ అని చెబుతాం. బీసీ అంటే బిఫోర్ కాంగ్రెస్ (కాంగ్రెస్ ముందు), ఏడీ అంటే ఆఫ్టర్ డైనాస్టీ (రాజవంశ పాలన తర్వాత) అని’ అన్నారు. ‘ఇది ఎన్నికల సంవత్సరం. అందువల్ల అన్ని పార్టీలు పార్లమెంటులో ఏదో ఒకటి మాట్లాడక తప్పని పరిస్థితి. ఎన్నికల్లో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని కోరుకుంటున్నానని’ మోడీ చెప్పారు.

రాఫెల్ వివాదంపై మొదటిసారి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ పార్లమెంట్‌లో మాట్లాడారు.  ‘ఇంత విశ్వాసంతో కాంగ్రెస్ రాఫెల్ డీల్ పై ఎలా అబద్ధాలు చెబుతోందోనని నేను ఆశ్చర్యపోయేవాడిని. ఆ తర్వాత గత కాంగ్రెస్ ప్రభుత్వాలు రక్షణ ఒప్పందాలను మధ్యవర్తుల ద్వారా కుదుర్చుకొనేవని గుర్తించాను. ఎవరైనా నిజాయితీతో పనిచేస్తే కాంగ్రెస్ సహించలేదు’ అని విమర్శించారు. ‘కాంగ్రెస్‌కు మన సాయుధ దళాలు బలోపేతం కావడం ఇష్టం లేదని పార్లమెంటులోని ఈ సభలో చెబుతున్నాను. మన భద్రతా దళాల ఆయుధ సంపత్తి బలంగా ఉండటం వారికి ఇష్టం లేదు. తలదించుకొనే విధంగా చేస్తున్న వాళ్లు ఏఏ కంపెనీలకు బిడ్డింగ్ చేస్తున్నారు?’ అని ప్రశ్నించారు.

దేశంలోని సంస్థలను బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగ పరుస్తోందన్న విమర్శలకు జవాబిస్తూ  కాంగ్రెస్ దాదాపు 100 సార్లు ఆర్టికల్ 356ని ఉపయోగించిందని అందులో ఇందిరా గాంధీ 50 మార్లు ప్రయోగించారని గుర్తు చేశారు. ‘1959లో కాంగ్రెస్ ప్రభుత్వం కేరళలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. 60 ఏళ్ల క్రితం నాటి సంఘటన నా కేరళ మిత్రులకు గుర్తుండే ఉంటుంది. ఏం పవిత్రత? సంస్థలపై ఏం గౌరవం అది?’ అని ప్రశ్నించారు. ‘పూర్తి మెజారిటీతో ఏర్పడిన ప్రభుత్వం ఎలా పని చేస్తుందో దేశ ప్రజలు చూశారు. వాళ్లు ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుని గుర్తించారు’ అన్నారు. దేశంలోని గ్రామాల విద్యుదీకరణ గురించి ప్రధాని మాట్లాడారు. ‘మీరు చేయలేని పనులు చేసేందుకు నేను రాక తప్పలేదని’ కాంగ్రెస్ ని టార్గెట్ చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English