వాద్రాను వ‌ద‌ల‌ట్లే...అందుకే ప్రియాంక వ‌చ్చి...

వాద్రాను వ‌ద‌ల‌ట్లే...అందుకే ప్రియాంక వ‌చ్చి...

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర‌తో ముప్పు తిప్ప‌లు పెడుతోంది. మనీ లాండరింగ్ కేసులో ఈడీ గురువారం మరోసారి విచారించింది. వాద్రా విచారణ  శుక్రవారం కూడా కొనసాగనున్నట్టు తెలుస్తోంది. వరుసగా రెండో రోజు ఆయనను దాదాపు 10 గంటల పాటు వాద్రాను ఈడీ ప్రశ్నించింది. సుదీర్ఘ స‌మ‌యం పాటు విచార‌ణ కొన‌సాగుతుండ‌టంతో, వాద్రాను రిసీవ్ చేసుకొనేందుకు ఆయన భార్య ప్రియాంక గాంధీ స్వయంగా ఈడీ ఆఫీస్ దగ్గరకు వచ్చారు!

లండన్ లోని 12, బ్రాయన్ టన్ స్క్వేర్ లో ఉన్న 19 లక్షల పౌండ్ల (దాదాపు రూ.17 కోట్లు) విలువైన ఆస్తి కొనుగోలులో మనీ లాండరింగ్ జరిగినట్టు రాబర్ట్ వాద్రాపై అభియోగం. ఈ ఆస్తికి నిజమైన యజమాని వాద్రాయేనని ఈడీ అంటోంది. మనీ లాండరింగ్ కేసు కింద ఈడీ మనోజ్ అరోరాని కూడా ప్రశ్నిస్తోంది. మనోజ్ అరోరా అరెస్ట్ పై పటియాలా హౌస్ కోర్టు ఫిబ్రవరి 6 వరకు తాత్కాలిక నిషేధం విధించింది.

మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకొనేందుకు గతవారం కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రా పటియాలా హౌస్ కోర్టులో అర్జీ పెట్టారు. ఆయనకు ఫిబ్రవరి 16 వరకు కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఉద్దేశపూర్వకంగా అబద్ధపు కేసులు పెట్టి తనను టార్గెట్ చేస్తున్నారని రాబర్ట్ వాద్రా తన పిటిషన్ లో ఆరోపించారు. ఇవన్నీ రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని ఆయన పేర్కొన్నారు. తను చట్టాన్ని పాటించే పౌరుడినని తెలిపారు.

కాగా, తాజాగా అభియోగాల్లో భాగంగా, వాద్రాను విచారిస్తోంది. బుధవారం కూడా ఈడీ వాద్రాను ప్రశ్నించింది. దాదాపు 5 గంటలు సాగిన విచారణలో అధికారులు ఆయనకు 40కి మించి ప్రశ్నలు సంధించారు. విచారణ సమయంలో వాద్రా లండన్ లో తనకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని స్పష్టం చేశారు. సంజయ్ భండారీతో తనకు ఏ లావాదేవీలు లేవని చెప్పారు. రెండో రోజైన  గురువారం ఉదయం వాద్రాను రెండున్నర గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఆ తర్వాత లంచ్ విరామం అనంతరం మరోసారి వాద్రా ఈడీ ఆఫీస్ కి వచ్చారు. రాత్రి దాదాపు 9.30కి ఆయన విచారణ పూర్తయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English