బాబుకు మ‌రో షాక్.. కోట్ల యూట‌ర్న్!

బాబుకు మ‌రో షాక్.. కోట్ల యూట‌ర్న్!

చేతికి వ‌చ్చిన ముద్ద నోటి వ‌ర‌కూ రావాల‌న్నా.. నోట్లోకి వెళ్లాల‌న్న రాసి పెట్టి ఉండాలి. త‌మ తీరుతో కొంద‌రు ఇలాంటి అవ‌కాశాల్ని చేజార్చుకుంటుంటారు.తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌రిస్థితి ఇదే రీతిలో ఉందా? అంటే అవున‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. అసెంబ్లీ.. లోక్ స‌భ ఎన్నిక‌లు ముంగిట్లోకి వ‌చ్చిన వేళ‌.. బ‌ల‌మైన నేత‌ల అవ‌స‌రం ఇప్పుడు కీల‌కంగా మారిన ప‌రిస్థితి.

ఏపీలో విప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బ‌లంగా ఉండ‌టంతో ప్ర‌జాద‌ర‌ణ ఉన్న నేత‌లు..క్యాడ‌ర్ ఉన్న వారి అవ‌స‌రం అన్ని పార్టీల‌కు కీల‌కంగా మారింది. ఇదిలా ఉంటే.. క‌ర్నూలు జిల్లాలో శ‌క్తివంత‌మైన రాజ‌కీయ కుటుంబాల్లో ప్ర‌ముఖంగా కోట్ల కుటుంబాన్ని చెబుతుంటారు. సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కోట్ల ఫ్యామిలీ ఇటీవ‌ల తెలుగుదేశం పార్టీలో చేర‌నున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రిగింది.

ఈ  మ‌ధ్య‌న త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి ఏపీ ముఖ్య‌మంత్రి నివాస‌మైన ఉండ‌వ‌ల్లిలో డిన్న‌ర్ కు క‌లిసిన‌ట్లుగా వార్త‌లు వచ్చాయి. ఈ సంద‌ర్భంగా కోట్ల కుటుంబాన్ని బాబు చాలాసేపు వెయిట్ చేయించిన‌ట్లుగా విమ‌ర్శ ఉంది. ఇదిలాఉంటే.. బాబుతో జ‌రిగిన డిన్న‌ర్ సంద‌ర్భంగా త‌న‌కు క‌ర్నూలు ఎంపీ టికెట్‌.. త‌న స‌తీమ‌ణి సుజాత‌మ్మ‌కు డోన్ టికెట్ తో పాటు.. త‌న కుమారుడు రాఘ‌వేంద్ర‌కు ఆలూరు టికెట్ కోరిన‌ట్లుగా చెబుతున్నారు.
అయితే.. ఈ మూడు టికెట్ల విష‌యంలో సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డికి క‌ర్నూలు ఎంపీ టికెట్ మిన‌హా మిగిలిన వాటి గురించి బాబు ఎలాంటి హామీ ఇవ్వ‌క‌పోవ‌టంపై కోట్ల ఫ్యామిలీ అసంతృప్తితో ఉంది.

ఇదిలా ఉంటే.. బాబుతో త‌మ భేటీపై మీడియాలో పెద్ద ఎత్తున వార్త‌లు రావ‌టం.. కొన్ని మీడియాల్లో అయితే టీడీపీలో చేరిపోయిన‌ట్లుగా వార్త‌లు రావ‌టంపై ఆయ‌న అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. కోట్ల కుటుంబం టీడీపీలోకి చేర‌టంతో జిల్లాలో త‌మ పార్టీ మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌న్న సంబంరంలో ఉన్న తెలుగు త‌మ్ముళ్లకు షాక్ త‌గిలేలా కోట్ల తాజా వ్యాఖ్య‌లు ఉన్నాయి.

తెలుగు త‌మ్ముళ్లు ఉలిక్కిప‌డేలా కోట్ల తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాము ఇప్ప‌టివ‌ర‌కూ టీడీపీలో చేర‌లేద‌ని.. ఆ మాట‌కు వ‌స్తే తాము ఏ పార్టీలోనూ చేరాల‌న్న నిర్ణ‌యాన్ని తీసుకోలేద‌న్నారు. జిల్లాలో ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌పై హామీ కోరామ‌ని.. ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స్పంద‌న రాలేద‌న్నారు. తాము వేచి చూస్తామ‌ని.. త‌మ‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆహ్వానం ఉంద‌ని.. త‌మ‌కు అవ‌కాశాలు ఉన్న విష‌యాన్ని కోట్ల త‌న మాట‌ల‌తో చెప్పేశారు. త‌మ పార్టీలోకి రావాల‌న్న ఆహ్వానం ఒక్క టీడీపీ నుంచే కాద‌న్న మాట‌తో.. తాము కోరిన‌ట్లుగా సీట్లపై బాబు హామీ ఇవ్వ‌ని ప‌క్షంలో త‌మ దారి జ‌గ‌న్ పార్టీలోకే అన్న సందేశాన్ని ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు. మ‌రి.. కోట్ల వ్యాఖ్య‌ల‌పై బాబు ఎలా రియాక్ట్ అవుతారు అన్న‌ది ఒక ప్ర‌శ్న అయితే.. మూడు టికెట్లు కోరుతున్న కోట్ల ఫ్యామిలీకి అన్ని టికెట్లు కేటాయించ‌టం జ‌గ‌న్ పార్టీకైనా సాధ్య‌మేనా? అన్న‌దిప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English