కాంగ్రెస్ లో పీకే… తూచ్ !

కాంగ్రెస్ పార్టీ అనేది మహాసముద్రం. సముద్రంలో ఈదుకుంటూ ఒడ్డుని చేరుకునేదెవరో ? ఎప్పటికీ ఈదుతునే ఉండేదెవరో, ఈదలేక మధ్యలోనే ముణిగిపోయేదెవరో ఎవరు చెప్పలేరు. దశాబ్దాల తరబడి పార్టీలో ఉన్నవారికే అధిష్టానం పల్స్ ఏమిటో ఒక పట్టాన అర్థం కాదు. అలాంటిది రాజకీయ వ్యూహకర్తగా పాపులరైన ప్రశాంత్ కిషోర్ (పీకే) పార్టీలో చేరి వెంటనే అందలం ఎక్కేయాలని అనుకున్నారు. అయితే ఇపుడా ఆశ నెరవేరేట్లు కనబడటం లేదు.

తాజాగా ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పీకే తొందరలోనే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. అంటే కాంగ్రెస్ లో చేరబోతున్నారని, కీలక పదవి చేపట్టబోతున్నారనే ప్రచారానికి దాదాపు తెరపడినట్లే అనుకోవాలి. ఇంతకీ పీకేకు కాంగ్రెస్ లో చేరటానికి ఎందుకు బ్రేకులు పడింది ? ఎందుకంటే పీకేని ఒక్కసారిగా అందలం ఎక్కించటానికి పార్టీలోని చాలామంది కీలక నేతలు అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది.

తొందరలోనే పీకే కాంగ్రెస్ లో చేరుతారని, అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాజకీయ వ్యవహారాల సెక్రటరీగా బాధ్యతలు తీసుకోబోతున్నారంటు బాగా ప్రచారం జరిగింది. ఇంతకుముందు సోనియాకు అహ్మద్ పటేల్ రాజకీయ వ్యవహారాల కార్యదర్శిగా పనిచేశారు. అయితే ఆయన చనిపోయిన దగ్గర నుంచి ఆ పోస్టు ఖాళీగానే ఉంది. నిజానికి కాంగ్రెస్ లో రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అంటే దాదాపు సోనియాకు సమానమన్నట్లే. పార్టీలోని నేతల్లో 95 శాతం మంది అపట్లో అహ్మద్ పటేల్ ను కలిస్తేనే సోనియాను కలిసినంత హ్యాపీగా ఫీలయ్యేవారు.

అలాంటి కీలకమైన పోస్టులోకి నిన్నటి వరకు పార్టీతో డైరెక్టుగా ఎలాంటి సంబంధంలేని పీకేని కూర్చోబెడతారంటే మిగిలిన నేతలు ఎందుకు ఊరుకుంటారు. అందుకనే సీనియర్లందరూ పీకే నియామకం విషయంలో తీవ్రంగా వ్యతిరేకించారట. పైగా ఇపుడు కాంగ్రెస్ లో మూడు వర్గాలున్నాయి. సోనియా అధ్యక్షురాలైతే ప్రియాంక గాంధీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఇక రాహుల్ గాంధీ కాబోయే అధ్యక్షుడు. తల్లీ, పిల్లలిద్దరి మధ్య మూడు పవర్ సెంటర్లు తయారయ్యాయట.

మూడు పవన్ సెంటర్ల మధ్య నేతలు ఇరుక్కోకుండా నెట్టుకురావడం అంటే మామూలు విషయం కాదు. తల్లీ, పిల్లల్లో ఇద్దరు ఏకమైతే ఏమి జరుగుతుందో పంజాబ్ లో జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. అందుకనే కాంగ్రెస్ లో నెట్టుకు రావడం కష్టమని పీకేకి కూడా అర్ధమైపోయిందట. తృణమూల్ లో కూడా ఇలాంటి పవర్ సెంటర్లున్నప్పటికీ అక్కడ సీఎం మమతాబెనర్జీ, మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మాత్రమే. ఇక్కడ గమనించాల్సిందేమంటే పీకే ఇద్దరికీ బాగా సన్నిహితుడే. కాబట్టి కాంగ్రెస్ కంటే టీఎంసీలోనే హ్యాపీగా ఉండచ్చని పీకే అనుకోబట్టే కాంగ్రెస్ కు దూరమయ్యారని ప్రచారం జరుగుతోంది. చూద్దాం ఏమి జరుగుతుందో.